ఆ కొండల్లో ఆదిమానవుల జాడలు !

Sharing is Caring...

Ancient line drawings…………………..

ఆదిమానవులు నివసించిన జాడలు కడప జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట కొండల్లో బయటపడ్డాయి. ఈ కొండల్లో ఆదిమానవులు నివసించిన ఆధారాలు కూడా లభించాయి. అక్కడి బండరాళ్లపై ఆదిమానవులు గీసిన రేఖా చిత్రాలే ఇందుకు సాక్ష్యమని చరిత్రకారులు అంటున్నారు.

ఆకు పసరుతో గీసిన ఆ రేఖా చిత్రాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉండటం విశేషం.1980 ప్రాంతంలో ఆస్ట్రియా దేశపు పురావస్తు పరిశోధకుడు ‘ఇర్విన్ న్యూ మేయర్’ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఆది మానవులపై పరిశోధన చేస్తున్న ఇర్వింగ్ తాను రాసిన “లైన్స్ ఆన్ స్టోన్ “అనే పుస్తకంలో ఈ రేఖా చిత్రాలు … వాటి విశేషాలను వివరించారు.

ఈ తరహా చిత్రాలు మధ్యప్రదేశ్ లోని భీంఖేడ్క్ లో ఉన్నాయని ఇర్వింగ్ పుస్తకంలో రాశారు. ఈ చిత్రాలు ఆదిమానవులు గీసినవే. ఆ చిత్రాలను బట్టి అక్కడ ఆదిమానవులు నివసించారని ఇర్వింగ్ అభిప్రాయ పడ్డారు. ఈ రేఖా చిత్రాలు 10 వేల ఏళ్ళనాటివని అంటారు.  

అయితే అప్పట్లో ఆయన పుస్తకం అంత ప్రాచుర్యంలోకి రాకపోవడంతో ఆదిమానవుల జాడ గురించి కూడా జిల్లా వాసులకు పెద్దగా తెలియ లేదు. 2010 లో స్థానికులు ఈ చిత్రాలను గమనించి పురావస్తు శాఖాధికారులకు విషయం తెలియజేశారు.

ఆ తర్వాత అధికారులు ఈ ప్రాంతాన్ని దర్శించి ఇక్కడ ఆదిమానవులు నివసించారని అందుకు ఆధారాలు రేఖా చిత్రాలే అని నిర్ధారించారు. అప్పటినుంచి ఈ రేఖా చిత్రాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ చింతకుంట కొండ ల్లో దాదాపు 2 వందల రేఖా చిత్రాలను అధికారులు గుర్తించారు.

ఇవన్నీ తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్నాయి. చిన్న,పెద్ద బండ రాళ్ళపై ఈ రేఖాచిత్రాలు గీసి ఉన్నాయి. ఈ చిత్రాల్లో జింకలు, దుప్పులు, ఎద్దులు, ఏనుగులు, నక్క, కుందేలు, హైనా, పక్షులు వంటి ఆకృతులు కనిపిస్తాయి. ఏనుగులపై సవారీ, స్త్రీ మూర్తుల చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ కొండలను పాండవుల గుట్ట అని కూడా పిలుస్తారు.

అక్కడ చిన్న చిన్న గుహాలు కూడా కనిపిస్తాయి.ముద్దనూరు ప్రాంతంలో కొన్ని సమాధులు బయటపడ్డాయి.  ఇవి ఆదిమానవుల కాలానికి చెందినవని భావిస్తున్నారు. అలాగే ఆదిమానవులు ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా ఈ ప్రాంతంలో దొరికాయి. ఇవి వారి జీవనశైలిని తెలియ జేస్తున్నాయి. 

అక్కడి  గుహాల్లో ఆదిమానవులు తలదాచుకున్నారని చెబుతారు. ఈ కొండపైన కోన లింగేశ్వరస్వామి ఆలయం ఉంది. సమీపంలోనే బ్రిటీష్‌ కాలం నాటి చెరువు కూడా ఉంది.ఇందులో నీళ్లు ఎపుడూ ఉంటాయని స్థానికులు చెబుతారు.  ఈ ప్రాంతాన్నిరక్షించి .. పర్యాటక ప్రాంతంగా మారిస్తే టూరిజం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. వీడియో చూడండి. 

PL.WATCH VEDEO ………………………………. ఆదిమానవుడి జాడలు 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!