రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (2)

Sharing is Caring...

Government spends thousands of crores for patrolling……………….

సియాచిన్ ప్రాంతంలో కాపలా కాసే సైనికులు తప్పనిసరిగా తమ వద్ద కిరోసిన్ ఉంచుకుంటారు. గతంలో క్యాన్స్ లో కిరోసిన్ సరఫరా అయ్యేది. అవసరమైనపుడు స్టవ్ వెలిగించి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ప్రస్తుతం బేస్ క్యాంప్ నుంచి సైనికులు కాపలా ఉండే పోస్ట్ లకు పైప్ లైన్ ద్వారా కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ఇక ప్రతి పోస్ట్ లో పది -పన్నెండు మంది కాపలా ఉంటారు. చిన్న గుడారం వేసుకుని అందులోనే ఉంటారు. వంతుల వారీగా డ్యూటీ చేస్తుంటారు.  నిద్ర సమయంలో స్లీపింగ్ బ్యాగ్ లో దూరతారు.

2000 సంవత్సరం వరకు సైనికులు మంచు లోనే గుడారాలు వేసుకుని ఉండేవారు. మంచు గాలులు, మంచు తుఫాన్లను  ఎదుర్కొంటుండేవారు. ప్రస్తుతం ఫైబర్ గ్లాస్ తో కూడిన గుడారాలు ఉపయోగిస్తున్నారు. ఒక గుడారంలో 12 మంది వరకు ఉండొచ్చు. ఈ గుడారం పైభాగంలో ఒక విండో ఉంటుంది. మంచు తుపాను వచ్చినపుడు తప్పించుకోవడానికి ఈ విండో ఉపయోగపడుతుంది. సూర్య కాంతి కూడా ఇందులో నుంచి ప్రసరిస్తుంది. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటూ కాపలా కాస్తుంటారు.

ఇక వీరికి కావాల్సిన ఆహార సామాగ్రిని ప్రత్యేక హెలికాపర్ల ద్వారా అక్కడికి చేరవేస్తారు. ప్రతి సంవత్సరం మూడు,నాలుగు బెటాలియన్ల సైనికులు ఇక్కడ రక్షణ సేవలు అందిస్తారు. ఒక్కో బెటాలియన్ లో 300 మంది నుంచి 1000 వరకు కూడా ఉంటారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలలు అక్కడే ఉంటుంది. ప్రతి కూల పరిస్థితులు ఉన్నప్పటికీ .. ప్రాణ నష్టం జరుగుతున్నప్పటికీ దేశ రక్షణ ప్రధమ కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తోంది.  పాకిస్థాన్ కూడా తమ సైనికులను సరిహద్దు వద్ద కాపలా పెట్టింది. ఆ దేశ జవాన్లు కూడా మంచు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలున్నాయి. 

 అక్కడి వాతావరణానికి  తట్టుకోలేక, ప్రమాదాలకు గురై చనిపోయిన సంఖ్య తక్కువేమి కాదు. 1984 నుంచి ఇప్పటివరకు 1000 మంది సైనికులు మృత్యువాత పడ్డారు..వీరిలో అధికారులు,జూనియర్ అధికారులు, ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. 2011 లో అత్యధికంగా 24 మంది సైనికులు చనిపోయారు.

ఈ ప్రాంతంలో గస్తీ కోసం ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తున్నది. అక్కడ కాపలా ఉండే జవాన్లకు కావలసిన వస్త్రాలు, పర్వతారోహణ సామాగ్రి, తదితర వస్తువులపై భారీగా ఖర్చు పెడుతున్నది. ఈ సియాచిన్ ప్రాంతంలోనే 2016 లో లాన్స్ నాయక్ హనుమంతు మరో తొమ్మిది మంది జవాన్లు మంచులో కూరుకుపోయి చనిపోయారు. అదో పెద్ద విషాద ఘటన. 

—————- KNM 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!