కరోనా నేపథ్యంలో మళ్ళీ అక్రమ రవాణా ముఠాలు రంగంలోకి దిగాయి. ఉపాధి లేక , వృత్తి లేక ఇబ్బందులు పాలవుతున్న కుటంబాలకు చెందిన అమ్మాయిల కోసం వేటాడుతున్నాయి. గుట్టు చప్పుడుగా తమ పని కానిస్తున్నాయి. వీరి టార్గెట్. పేదరికంలో మగ్గుతున్న మహిళలు .. బాలికలే.
గత ఆరునెలలు గా బలహీన వర్గాలకు చెందిన ఎన్నో కుటుంబాలు తింటానికి తిండి లేక.. చేయడానికి పనిలేక విల విల్లాడుతున్నాయి. ప్రభుత్వాలు చేసే సాయం తో కుటుంబం గడవదు. ఈ నిస్సహాయ పరిస్థితులే అక్రమరవాణా ముఠాలకు ఊతమిస్తున్నాయి. మాయ మాటలు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపం లోకి దించుతున్నారు.
కరోనా పరిస్థితులు చక్కబడుతున్న క్రమంలో ట్రాఫికర్ల వ్యాపారం జోరుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యభిచార కేంద్రాలను నిర్వహించే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పటికీ వారిపై కఠిన చట్టాలు ప్రయోగించక పోవడం తో ట్రాఫికర్ లు చిరునామాలు మార్చి మళ్ళీ అదే వ్యాపారం చేస్తున్నారు.
కొన్ని చోట్ల పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా సాలీనా వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని అంచనా. అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేల మంది ఇందులో లబ్ది పొందుతున్నారు. ఒక అమ్మాయిని మోసగించో , ప్రలోభ పెట్టో తీసుకొచ్చి అప్పగిస్తే కమీషన్ రూ 10నుంచి 30 వేల వరకు బ్రోకర్ల కు లభిస్తుంది. దీన్ని బట్టి అమ్మాయిలపై ఎంత వ్యాపారం జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు.
అతివల అమ్మకాలలో రెండు తెలుగు రాష్ట్రాలు మొదటి ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే కొద్దిగా నయం. గోవా, ఢిల్లీ, ముంబాయి ,చెన్నై, బెంగళూరు పూణే ,కలకత్తా వంటి నగరాల్లో దాదాపుగా ప్రతి వ్యభిచార గృహం లొ ఆంధ్ర అమ్మాయిలే కన్పిస్తుంటారు. వీరంతా స్వచ్చందం గా అక్కడ కెళ్ళిన వాళ్ళు కాదు. కొంత మంది స్వార్ధ పరుల చేతుల్లో చిక్కుకొని అక్రమ రవాణాకు గురై ఇతర రాష్ట్రాలకు తరలించబడిన వారే . వీరంతా బలవంతం గా వ్యభిచార వృత్తి లోకి నెట్ట బడినవారే. ఇలా ఇప్పటికీ ఎందరో వ్యభిచార గృహాలకు చేరుతూనే వున్నారు. గతం తో పోలిస్తే అతివల అక్రమ రవాణా తగ్గు ముఖం పట్టినట్టు కన్పిస్తున్నప్పటికి పెద్దగా తగ్గలేదు.
ముఖ్యం గా విశాఖ పట్నం ,ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు ,ప్రకాశం ,నెల్లూరు కడప,అనతపురం, నల్గొండ,రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వేరే రాష్ట్రాలకు అమ్మాయిలను తరలించే ప్రక్రియ ఓ పక్క సాగుతుండగా,జిల్లా నుంచి మరో జిల్లాకు కూడా అమ్మాయిలు సరఫరా అవుతున్నారు. దేశం లోని ప్రధాన నగరాలకు తరలించబడుతున్న అమ్మాయిలలో ముప్పై శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారే.
అమ్మాయిల అక్రమ రవాణాలో జార్ఖండ్, మహారాష్ట్ర అస్సామ్ దూసుకుపోతున్నాయి అమ్మాయిలు మాయమైపోతున్న కేసులను బట్టి స్థానాలు మారుతుంటాయి. వాస్తవంలో నమోదు కానీ కేసులే ఎక్కువగా ఉంటాయి. ఈ వివరాలన్నీ ఈ ఏడాది మార్చిలో హోంశాఖ పార్లమెంట్లో ప్రకటించినవి.అక్రమ రవాణా సమస్య ను అరికట్టేందుకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రకటించింది. నిర్భయ ఫండ్ నుంచి 100 కోట్లు ఇందుకోసం కేటాయించింది. ప్రస్తుతం 330 యాంటీ ట్రాఫికింగ్ యూనిట్లు దేశవ్యాపితంగా పని చేస్తున్నాయి. వీటి సంఖ్య పెరగనుంది. పోలీసులు చట్టాలను గట్టిగా ప్రయోగిస్తే కానీ ట్రాఫికింగ్ సమస్య తగ్గుముఖం పట్టదు.
——– KNMURTHY
మాంచి స్టోరీ… నిజమైన స్టోరీ… మీకు అభినందనలు… మంచి విషయాలు మాకు తెలియ జేస్తూ వున్నారు…థాంక్స్