The structure is still a mystery…..
పై ఫొటోలో కనిపించేది భూటాన్ లో ఉన్న ఒక బౌద్ధ మఠం.దీన్ని పారో తక్త్సంగ్ మఠం అంటారు. భూటాన్ లో సందర్శించదగిన ప్రదేశాల్లో ఇదొకటి. నిటారుగా ఉన్న కొండపై నిర్మించిన బౌద్ధ మఠం వెనుక జానపద కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి.
8వ శతాబ్దంలో ‘గురు పద్మసంభవ’ (రెండవ బుద్ధుడిగా పిలుస్తారు) ఒక పులిపై (Tigress) స్వారీ చేస్తూ వచ్చి ఇక్కడ ఉన్న ఒక గుహలో మూడు సంవత్సరాలు, మూడు నెలలు, మూడు రోజులు ధ్యానం చేశారని నమ్ముతారు. అందుకే దీనికి ‘టైగర్స్ నెస్ట్’ అనే పేరు వచ్చింది.
నిటారుగా ఉండే ఈ కొండపైకి ఎక్కడం అంత సులభం కాదు. ప్రస్తుత మఠాన్ని 1692లో గ్యాన్సే టెన్జిన్ రబ్గ్యే నిర్మించారు. దీనిని ధ్యాన కేంద్రంగా వినియోగించేవారు.ఇది హిమాలయాలలో ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం.కొండ పక్కనుంచి పైకి వెళ్లేందుకు నడక దారి ఉంది.ఎక్కడం అంత సులభంకాదు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్లు ఈజీగా వెళ్ళగలరు.
ఈ మఠాన్ని చేరుకోవాలంటే వాహనాలు వెళ్లే మార్గం లేదు.కేవలం ట్రెకింగ్ ద్వారానే చేరుకోవాలి.పారో నగరం నుండి బేస్ క్యాంప్ చేరుకున్నాక, అక్కడి నుండి మఠానికి వెళ్లడానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. దారి పొడవునా పైన్ చెట్లు, రంగురంగుల బౌద్ధ ప్రార్థనా జెండాలు, జలపాతాలు కనిపిస్తాయి. మధ్యలో ఒక కెఫెటేరియా ఉంటుంది.. అక్కడ పర్యాటకులు విశ్రాంతి తీసుకోవచ్చు.
ఆ కొండ పైన ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లో నిర్మాణం ఎలా జరిగిందో ఆశ్చర్యకరమైన విషయమే. ఇది భూటాన్ లోని పారో నగరం సమీపం లో ఉంది.కొండ పక్కనే పెద్ద లోయ కూడా కనిపిస్తుంది. పారో .. భూటాన్ పశ్చిమ హిమాలయాలలో ఉన్న ఒక పట్టణం.
ఇది 1962 వరకు దేశంలోని ప్రధాన సాంస్కృతిక, వాణిజ్య, రాజకీయ కేంద్రంగా విలసిల్లింది. భూటాన్‌లో పారో తక్త్సాంగ్, కైచు లాఖాంగ్, రిన్‌పుంగ్ జాంగ్‌లతో సహా మరికొన్ని బౌద్ధ ఆరామాలు ఉన్నాయి
‘గురు పద్మసంభవ స్మృత్యర్థం 1692 లో ఈ మఠాన్ని నిర్మించారు. మఠాన్నిఎలా నిర్మించారో మిస్టరీ. నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఎలా అంత ఎత్తుకి తరలించారో ఎవరికి తెలీదు. ఇక ‘గురు పద్మసంభవ’ గురించి వివరించే కథలు చాలా ప్రచారం లో ఉన్నాయి. ‘పద్మసంభవ’ శ్రీలంకలోని ఉల్క పర్వతం శిఖరంపై కనిపించాడని కొందరు చెబుతారు.
ఆయన ఒరిస్సాలో పుట్టి పెరిగి , పెద్దయ్యాక భూటాన్ వచ్చాడని అంటారు. టిబెట్, నేపాల్, భూటాన్, దేశంలోని హిమాలయ ప్రాంతాల్లో బౌద్ధులు ‘పద్మసంభవ’ను రెండవ బుద్ధునిగా పూజిస్తారు. బుద్ధ శాక్యముని… పద్మ సంభవగా పునర్జన్మించారని బౌద్ధులు నమ్ముతారు.

