దటీజ్ సూపర్ స్టార్ !

Sharing is Caring...

సుప్రసిద్ధ నటుడు, హీరో కృష్ణ కు  ఒక స్పష్టమైన విజన్ ఉంది. తానేం కావాలో ఒక ఐడియా ఉంది. ఆ మేరకు ముందడుగు వేశారు. కష్టపడ్డారు. హీరో గా ప్రూవ్ చేసుకున్నారు. స్టార్ కావాలనుకున్నారు. సూపర్ స్టార్ అయ్యారు. స్టార్ అయ్యే క్రమంలో రోజుకు 20 గంటలు పనిచేశాడు. ఏడాదికి 15 సినిమాలు కూడా చేశారు.

1972  లో సూపర్ స్టార్ సినిమాలు 18 విడుదల అయ్యాయి. అంటే అప్పట్లో అదొక రికార్డు. మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, అంతా మన మంచికే,పండంటి కాపురం, ఇల్లు ఇల్లాలు వంటి చిత్రాలు ఆ సంవత్సరంలో వచ్చినవే. అలాగే 1973 లో 15.. 1980 లో 17 సినిమాలు విడుదల అయ్యాయి.

దేవుడు చేసిన మనుషులు,మాయదారి మల్లిగాడు,గంగ మంగ, మీనా వంటి సినిమాలు 73లో .. ఘరానా దొంగ, మామా అల్లుళ్ళ సవాల్, చుట్టాలొస్తున్నారు జాగ్రత్త  వంటి చిత్రాలు 1980 లో రిలీజ్ అయ్యాయి. అప్పట్లో కృష్ణ ఎంత హార్డ్ వర్క్ చేశారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక్కడే మరో కోణం గురించి కూడా చెప్పుకోవాలి. సగటున ఏడాదికి 10 సినిమాలు అంటే అందులో నటించిన నటులు కాకుండా ఎంతమంది సాంకేతిక నిపుణులు ఉపాధి పొందారో ? వారిపై ఆధారపడి ఎన్నికుటుంబాలు బతికాయో కూడా చూడాలి.

కృష్ణ స్టార్ అవ్వాలనుకున్న క్రమంలో చాలా కాలిక్యులేటెడ్ గా ముందు కెళ్లారు. 1965 నుంచి 1970 వరకు కృష్ణ కేవలం హీరోనే. అప్పటికే 52 సినిమాలు చేశారు. అందులో బోలెడు హిట్లున్నాయి. ఈ దశలోనే స్టార్ అవ్వాలనుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తమ్ముళ్లను నిర్మాతలుగా పెట్టి పద్మాలయా సంస్థను స్థాపించారు.

తొలుత అగ్నిపరీక్ష తీశారు. అది ఫెయిల్ అయింది. ప్రేక్షకులకు కొత్తదనం కోరుకుంటున్నారు అని గమనించి  మోసగాళ్లకు మోసగాడు తీశారు. కౌబాయ్ ట్రెండ్ ను రంగుల్లో తెలుగు తెర పై చూపారు. గుర్రాలపై థార్ ఎడారిలో చేజింగ్ దృశ్యాలు .. హిమాలయాల్లో పాటలు చూసి ప్రేక్షకులు మంత్ర ముగ్దులై పోయారు. ఒక కొత్త జోనర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేశారు. దాన్ని అనుసరిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. 

ఇక మోసగాళ్లకు మోసగాడు పెద్ద హిట్. భారత దేశంలోనే  తొలి  కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. కృష్ణ ఈ సినిమాతో స్టార్ హీరో గా ఎదిగారు. ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో కేవలం 28 రోజుల్లో ఈ సినిమా తీయడం ఒక రికార్డు. ఫస్ట్ రిలీజ్ లోనే దాదాపు 32 లక్షల రూపాయలు  వసూలు చేసింది.

హాలీవుడ్ సినిమా కథల స్ఫూర్తి తో రూపొందిన ఈ సినిమా ఆంగ్లంలోకి అనువాదమై అక్కడి ప్రేక్షకులను అలరించింది. ట్రెజర్ హంట్ పేరిట 125 కి పైగా దేశాల్లో విడుదలై కనకవర్షం కురిపించింది. అలాగే తమిళ్, హిందీ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేస్తే మంచి వసూళ్లను రాబట్టింది.

అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.ఈ సినిమా స్ఫూర్తి తో మరెన్నో కౌబాయ్ సినిమాలు తెలుగులో రూపొందాయి. కృష్ణ హీరోగానే 15  సినిమాల వరకు వచ్చాయి.కృష్ణ సూపర్ స్టార్ అయ్యారంటే అదేదో కేవలం అదృష్టం వలన మాత్రమే కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు. ఇంకా మంచి తనం, హార్డ్ వర్క్, అంకిత భావం ఆయనకు ప్లస్ అయ్యాయి. 

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!