ప్రధాని నరేంద్ర మోడీ మామూలుగా మహా మొండి.ఈ విషయం అందరికి తెలుసు. అయితే ఆయన మనసు మార్చుకుని తన నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం గొప్ప విషయమే. ప్రజాస్వామ్యంలో నాయకులు చేయాల్సిందే ఇది. ప్రభుత్వ సారధిగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే అందులో లోటు పాట్లు ఉన్నాయని తెలిస్తే వెంటనే సవరించుకోవాలి. అదే నాయకుని లక్షణం. అంతే కానీ నే పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అని మొండిగా వ్యవహరిస్తే అంతిమ ఫలితాలు వేరుగా ఉంటాయి.
కేంద్రమే ఉచితంగా టీకా వేసే నిర్ణయం తీసుకోవడం వెనుక మోడీ పై పలు ఒత్తిడులు ఉన్నాయి. సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది . ప్రతి నిర్ణయాన్ని న్యాయమూర్తులు తప్పుబట్టారు. వ్యాక్సిన్ ధరలు నిర్ణయించడం నుంచి ఫ్రీ వ్యాక్సిన్ విధానం వరకు సరిగ్గా లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది. అంతటితో ఆగకుండా వ్యాక్సిన్ కొనుగోళ్ళకు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాలని కోరింది.సరయిన పంధాలో పోవడం లేదని సూచించింది. విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మరోపక్క వివిధ రాష్ట్రాల సీఎం లు వ్యాక్సిన్ కోసం ఒత్తిడి పెంచారు. కొందరైతే విమర్శలు జోరు పెంచారు.
అలాగే ఆర్ ఎస్ ఎస్ అధినేత మోహన్ భగవత్ ఆమధ్య చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ప్రభుత్వం,అధికార యంత్రాంగం,ప్రజలు అలక్ష్యంగా ఉండటం వల్లనే ప్రస్తుత కోవిడ్ సంక్షోభం ఏర్పడిందని ఆ వ్యాఖ్యల సారాంశం. ఆ తర్వాత భగవత్ ప్రధానితో మాట్లాడినపుడు కూడా ఇదే విషయమై చర్చ జరిగిందని సమాచారం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అందరికి ఆమోద యోగ్యమైన నిర్ణయాలు తీసుకోమని భగవత్ సలహా ఇచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మోడీ ప్రభుత్వమే అందరికి వ్యాక్సిన్ వేస్తుందని ప్రకటించారు. ప్రజలతో నేరుగా మాట్లాడారు.
ఇది స్వాగతించదగిన పరిణామమే. ఇకపై కేంద్రం క్రియాశీలక పాత్ర పోషించాలి. వ్యాక్సిన్ సరఫరా నుంచి.. వ్యాక్సినేషన్ సాఫీగా జరిగేంతవరకు మానిటరింగ్ చేయాలి. ఒక పక్కా ప్రణాళిక తో ముందుకు సాగాలి. ఓ ఇద్దరు .. ముగ్గురు మంత్రులు … మంచి అధికారులతో కమిటీ వేసి .. ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియను సమీక్షించుకుంటూ వెళితే మంచి ఫలితాలు వస్తాయి. మూడోదశ కరోనా ఉధృతి ని అంచనా వేసి … అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపి ముందస్తు ఏర్పాట్ల కోసం అప్రమత్తం చేయాలి. సిబ్బంది,బెడ్లు, ఆక్సిజన్, అవసరమైన మందులు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలు చేసుకోమని అలెర్ట్ చేయాలి.ఇవన్నీచిత్త శుద్ధితో అమలు చేస్తే తద్వారా ప్రజల్లో వెల్లువెత్తిన అసంతృప్తిని, వ్యతిరేకతను అధిగమించవచ్చు. గతం లో కూడా వ్యతిరేకతను అధిగమించిన నేతలు ఉన్నారు.