మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించడం తో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి. కేవలం 24 గంటల్లో ఈటల పోర్టుఫోలియో లేని మంత్రిగా మిగిలిపోయారు. విచారణ పూర్తి కాకముందే ఈటల శాఖను సీఎం కేసీఆర్ పరిధిలోని శాఖలకు జతపరిచారు. అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈటల తో పాటు మరో ఇద్దరి ముగ్గురిని తప్పించి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ఈవ్యవహారంపై దృష్టి పెడతారని అంటున్నారు.
ప్రస్తుతం ఈటల భూకబ్జా వ్యవహారంపై విచారణ జరుగుతోంది.ఈ విచారణ ముగియగానే ఈటలను మంత్రి పదవినుంచి కూడా తప్పించే అవకాశాలున్నాయి. విచారణ చేస్తున్న అధికారులు కూడా చూచాయగా కబ్జా వ్యవహారాలను మీడియాకు చెబుతున్నారు. కాగా తన నుంచి శాఖను తప్పించడంపై ఈటల కూడా సంతోషం ప్రకటించారు. ఒక పధకం ప్రకారమే నా పై ఆరోపణలు చేశారని రాజేందర్ అంటున్నారు. ఒక పక్క ప్రణాళికతో నా రాజకీయ జీవితంపై దెబ్బకొట్టేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు.
నియోజక వర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ఏమిటో ప్రకటించే వ్యూహంలో ఈటల ఉన్నారు. ఎవరిపైనా తాను వ్యక్తిగత విమర్శలు చేయనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తో సహా ఎవరిని కలవబోనని తేల్చి చెబుతున్నారు. ఈటల కు తనను తప్పించడం ఖాయమని అర్ధమైంది. అందుకే భవిష్యత్ కార్యాచరణ గురించి నియోజకవర్గ ప్రజలతో చర్చిస్తా అంటున్నారు. కాగా సీఎం కేసీఆర్ కూడా ఈటల వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఈటల వ్యూహమేమిటో ? ఏదైనా పార్టీ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారా అని కూపీ లాగుతున్నారు. ఈటల తనంతట తాను పార్టీ వీడే వ్యూహాన్ని అనుసరించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఇదంతా డ్రామా అని ప్రజల దృష్టి మరల్చేందుకే అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం కేసీఆర్ కి ఇన్ని రోజులుగా రాజేందర్ అవినీతి కనిపించలేదా అని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. అమీన్ పూర్ భూముల స్కామ్ ఏమైంది ? మంత్రి మల్లారెడ్డి పై వచ్చిన ఆరోపణల మాటేమిటి ? అన్నింటిపై విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
—————KNM