సుప్రసిద్ధ నటుడు కృష్ణ కి గురుభక్తి … కృతజ్ఞతా భావం ఎక్కువ. అలాగే ఎదుటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నారంటే సాయం చేసే మనసు ఆయనది. చిత్ర పరిశ్రమలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు. తేనెమనసులు చిత్రంతో తనను సినిమా రంగానికి హీరో గా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే మొదటి నుంచి గౌరవం .. గురుభక్తి.
తొలి రోజుల్లో తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శకుడు ఆదుర్తి .. నిర్మాత డూండీ, నటుడు జగ్గయ్యల పట్ల కృతజ్ఞతతో వ్యవహరించే వాడు. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెలుగులోనే కాకుండా హిందీ లో మిలన్,డోలీ,జ్వార్ భలా,మన్ కామీత్ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆ ఊపులోనే దర్పణ్, జీత్ చిత్రాలను స్వీయ దర్సకత్వంలో నిర్మించారు.
అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అంతకుముందు తెలుగు లో తీసిన ప్రయోగాత్మక చిత్రాలు నష్టాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఆయన ఆర్ధికంగా దెబ్బ తిన్నారు. ఆ సమయంలోనే తెలుగులో కొత్తవాళ్లతో ఒక సినిమా తీయాలని ప్లాన్ చేశారు . ఇది తెలిసి ఆయన సతీమణి కొత్తవాళ్లతో ప్రయోగాలు దేనికి ? హీరో కృష్ణ డేట్స్ తీసుకుని ఆయనతో సినిమా తీయండని సలహా ఇచ్చారు. దీంతో ఆదుర్తి కృష్ణ ను కలసి సినిమా విషయం చెప్పగా కథ ఏమిటి అడగ కుండా డేట్స్ ఇచ్చేసారు.
అప్పటికి కృష్ణ సూపర్ స్టార్ గా రైజింగ్ పీరియడ్ లో ఉన్నారు. సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుని బ్లాక్ అండ్ వైట్ లో తీస్తున్నట్టు కృష్ణ తో చెప్పారు ఆదుర్తి. ఆ మాట విని కృష్ణ ఆశ్చర్యపోయారు. తన మొదటి సినిమానే కలర్ లో తీసిన ఆదుర్తి ఆర్ధిక పరిస్థితి బాగా లేదని గ్రహించారు. ఆయనకు నచ్చచెప్పి .. కలర్ ఫిలిం తెప్పించే బాధ్యత తానే తీసుకుని ఆ ఏర్పాట్లు చేశారు.
అప్పట్లో కలర్ ఫిలిం దొరికేది కాదు. తన పరపతితో కృష్ణ కలర్ ఫిలిం తెప్పించారు. ఆ సినిమానే మాయదారి మల్లిగాడు. ఆ సినిమా కు మాటలు సమకూర్చింది సత్యానంద్.. ఆదుర్తి మేనల్లుడే. తర్వాత రోజుల్లో కృష్ణ నటించిన ఎన్నో సినిమాలకు కథ మాటలు అందించారు.
ఇక మాయదారి మల్లిగాడు సినిమా షూటింగ్ మద్రాస్ కి దగ్గర్లోని ఒక పల్లెటూరు లో జరిగింది. హీరో గా తనకు వసతి సదుపాయాలు అడగకుండా రోజూ అక్కడికి సొంత కార్లో వెళ్లి షూటింగ్ చేసి సిటీకి వచ్చేవాడు. ఆదుర్తికి తెలియకుండా వారి తమ్ముడికి కొంత సొమ్ము ఇచ్చి షూటింగ్ నిర్విరామంగా జరిగేలా చూసారు.
తన కంటూ ఆ సినిమాకు పారితోషకం తీసుకోలేదు.సినిమా పూర్తి అయ్యాక ఆదుర్తి గుంటూరు ఏరియా హక్కులు కృష్ణకు ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆదుర్తి ఆర్ధిక కష్టాల నుంచి బయట పడ్డారు. అది కృష్ణ గురుభక్తికి నిదర్శనం. తర్వాత “గాజుల కృష్ణయ్య” కు అడగ్గానే కాల్ షీట్లు ఇచ్చారు.
1975 అక్టోబర్లో ఆదుర్తి మరణించినపుడు కృష్ణ పాడిపంటలు అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం గుంటూరు జిల్లాలో ఉన్నారు. మిగతా వారితో షూటింగ్ కొనసాగించమని చెప్పి గురువు గారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఆదుర్తి కుటుంబాన్ని ఆదుకునేందుకు రవి కళామందిర్ బ్యానర్ పై లాభం వస్తే ఆదుర్తి కుటుంబం తీసుకునేలా .. నష్టం వస్తే తాను భరించేలా మూడు సినిమాలు కృష్ణ తీసాడు.
అవి పంచాయితీ , సిరిమల్లె నవ్వింది, రక్తసంబంధం. ఆ సినిమాల్లో తానే హీరోగా చేసాడు. మొదటి రెండూ పెద్దగా ఆడకపోయినా మూడో సినిమా హిట్ అయింది. ఆదుర్తి కుమారుడు సాయి భాస్కర్ ని సినిమాల్లో సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పచ్చతోరణం సినిమా తీసాడు. అది పెద్దగా ఆడలేదు. తర్వాత భాస్కర్ పలు సినిమాలకు పనిచేశారు.
ఇక డూండీ గురించి చాలామందికి తెలీదు . తెలుగు రాష్ట్రాల్లో తొలి సినిమా హాలు విజయ వాడ మారుతీ టాకీసు యజమాని పోతిన శ్రీనివాసరావు గారి అబ్బాయే డూండీ. తెలుగు లో తొలి బాండ్ చిత్రం “గూఢచారి 116” డూండీ, సుందర్ లాల్ నహతాల నిర్మాణ సారధ్యంలో వచ్చినదే.
అప్పట్లో డూండీ పట్టుబట్టి కృష్ణను హీరోగా ఆ సినిమాలో పెట్టారు. అప్పట్లో డూండీ , నహతా ఇద్దరూ కృష్ణతోనే తీసేవారు. ఇద్దరి దర్శకుడూ కె.ఎస్.ఆర్ దాసే. ఏజంట్ గోపీ, రహస్య గూఢచారి వారు తీసినవే. అందుకే వారు అడిగితే కృష్ణ కాదనకుండా కాల్ షీట్లు ఇచ్చేవాడు.
ఇక నటుడు జగ్గయ్య కృష్ణ శ్రేయోభిలాషి. పదండి ముందుకు సినిమాలో కృష్ణ కు ఒక పాత్ర ఇచ్చి ప్రోత్సాహించారు. ఆ తర్వాత కాలంలో కృష్ణ సొంత బ్యానర్ సినిమాల్లో జగ్గయ్య తప్పక ఉండేవాడు. అలా హీరో కృష్ణ తనకు సహాయం చేసిన వారిని ఎపుడూ మరిచిపోలేదు. ఇవి కాకుండా ఎందరో నిర్మాతలను ఆదుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి.
———–KNM