స్టాలిన్ రూటు మార్చేశారా ?

Sharing is Caring...

డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన  డీకే నుంచి విడిపోయి  అణ్ణాదురై నాయకత్వంలో డీఎంకే ఏర్పడింది. ఆ తరువాత డీఎంకే నుంచి సినీ హీరో ఎంజీఆర్‌ బయటకు వచ్చి అన్నాడీఎంకే ను స్థాపించారు. తమిళుల ఆరాధ్య దైవమైన అణ్ణాదురై ద్రవిడ సిద్ధాంతాల నుంచి వైదొలగలేదు.తర్వాత కాలంలో కారణాలు ఏమైనా తొలుత అన్నాడీఎంకే నేత జయలలిత .. ఆ పిదప డీఎంకే నేత స్టాలిన్ మెల్ల మెల్లగా ఆస్తికత్వం వైపు మొగ్గు చూపారు…  చూపుతున్నారు. 

స్టాలిన్ ఇటీవల ప్రకటనలు చూస్తుంటే ఆయన ధోరణి మారినట్టు కనిపిస్తోంది. హిందువులను ఆకర్షించే విధంగా ప్రకటనలు చేస్తున్నారు. తాను హిందువుల వ్యతిరేకిని కానని స్పష్టం చేస్తూనే తమిళనాడులో మూతపడిన దేవాలయాలను తెరుస్తామని హామీ ఇచ్చారు. హిందుత్వానికి డీఎంకే వ్యతిరేకం కాదు. అందరి ఆచార వ్యవహారాలను మేము గౌరవిస్తామని తన ఎన్నికల ప్రచారం ద్వారా ఒక మెసేజ్ ను జనంలోకి తీసుకువెళ్తున్నారు. అలాగే హిందువుల ఆలయాల, పవిత్ర ప్రదేశాల  పునరుద్ధరణకు 1000 కోట్లు కేటాయిస్తున్నట్టు డీఎంకే మేనిఫెస్టో లో పేర్కొన్నారు. కొండలపై ఉన్నఆలయాలను దర్శించేందుకు రోప్ వే ఏర్పాటు చేస్తామంటున్నారు. తమిళనాడు నుంచి పూరీ,బదరీనాథ్,కేదారనాథ్ యాత్రలకు వెళ్లేవారికి మనిషికి 25 వేల రూపాయల చొప్పున రాయితీ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.

ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల వేతనాలు పెంచుతామని కూడా అంటున్నారు. శ్రీ రంగం, అరుణాచలం క్షేత్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ  స్టాలిన్ హిందువులను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హిందువులను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో ఎన్నికల తర్వాత కానీ తేలదు. మొత్తం మీద స్టాలిన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు స్టాలిన్ కి అత్యంత కీలకం. ఇపుడు అధికారంలోకి రాకపోతే భవిష్యత్ లోకూడా కష్టమే. అదలా ఉంటే ఎన్నికల సమయంలోనే స్టాలిన్ సతీమణి దుర్గ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తన భర్త .. కుమారుడు ఎన్నికల్లో విజయం సాధించాలని మొక్కుకుంటున్నారు. 
కాగా ఇప్పటివరకు వచ్చిన అన్ని సర్వే లలో డీఎంకే ముందంజలో ఉంది. అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సర్వేలలో వెల్లడైంది. స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే. 

—————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!