తమిళ సినీ స్టార్ కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటు కోవాలని ప్రయత్నిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అప్పట్లో కమల్ కు పట్టణ ప్రాంతాల్లో కొంత ఆదరణ కనిపించింది.2018 లో పార్టీ ప్రారంభించిన కమల్ పార్లమెంట్ ఎన్నికల్లో 3.8 శాతం ఓట్లను సాధించారు. ఈ సారి 150 నియోజక వర్గాల్లో పోటీ చేయాలని కమల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా సీట్లు మిత్రపక్షం అభ్యర్థులకు కేటాయించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన కొన్ని చోట్ల అభ్యర్థులను ఎంపిక చేశారు. కమల్ పార్టీకి తమిళనాట పెద్దగా బలం లేకపోయినా కొన్ని చోట్ల చోటామోటా లీడర్లు ఉన్నారు.సొంతంగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న దృష్ట్యా ఎన్నికల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నపార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తే గట్టి పోటీ ఇవ్వొచ్చని కమల్ భావిస్తున్నారు. మిత్రుడు రజనీకాంత్ పార్టీ పెడితే పొత్తు పెట్టుకోవాలని కమల్ ఆశించారు. అయితే రజనీ పార్టీ పెట్టే యోచన విరమించుకోవడంతో కమల్ కొంత నిరాశ పడ్డారు. అయినప్పటికీ రజనీని కలసి తనకు మద్దతు పలకమని అడిగినట్టు తెలుస్తోంది. రజనీ ఏ విషయం తేల్చి చెప్పలేదని సమాచారం.
కాగా డీఎంకే తో కూడా చర్చలకు మధ్యవర్తుల ద్వారా కమల్ సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. డీఎంకే నేతలు వచ్చి కింది స్థాయి వ్యక్తులతో మాట్లాడినట్టు సమాచారం. బహుముఖ పోటీ జరిగితే నిలబడగలమా లేదా అని కమల్ సందేహపడుతున్నట్టు చెబుతున్నారు. అన్నా డీఎంకే , డీఎంకే పార్టీలను తట్టుకుని పోటీలో నిలబడటం కష్టమే. ఆ రెండు పార్టీలకు ఆర్ధిక, అంగబలం పుష్కలం గా ఉన్నాయి. నటుడిగా కమల్ కి మంచి పేరున్నప్పటికీ ,, అందరికి తెల్సిన వాడు అయినప్పటికీ … రాజకీయాలు వేరు అభిమానం వేరు. శివాజీ గణేశన్ తదితర నటుల విషయంలో అది రుజువైంది.
ఇక కమల్ హాసన్ ఇప్పటికే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార సభలకు పెద్ద సంఖ్యలోనే జనం హాజరవుతున్నారు. అధికారంలోకి వస్తే తాను ఏం చేయదలచుకున్నదీ తనకు స్పష్టత ఉందని కమల్ చెబుతున్నారు. ఇప్పటికే మహిళలు, పేదల కోసం పలు పథకాలను ఆయన ప్రకటించారు. తన పార్టీ అధికారంలోకి వస్తే మార్పు చూపిస్తానని కూడా కమల్ హాసన్ గట్టిగా హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అని కూడా కమల్ అంటున్నారు.ఈ మాటలు ఎంతవరకు జనంలోకి వెళతాయో..ఎన్ని ఓట్లు పడాతాయో ఎన్నికల తర్వాత కానీ తేలదు.
తమిళనాట 1967 నుంచి డీఎంకే , అన్నా డీఎంకే పార్టీలే అధికారంలో కొచ్చాయి. వేరే పార్టీ కి ఛాన్స్ ఇవ్వలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ రెండు ప్రధాన ద్రవిడ రాజకీయ శక్తుల మధ్య పోటీ జరగనుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్నాయి. కాంగ్రెస్ డీఎంకే తో …బీజేపీ అన్నా డీఎంకే తో కలసి కూటమి గా రంగంలోకి దిగుతున్నాయి. కాగా కొద్దీ రోజుల క్రితం జరిగిన పోల్ సర్వే లో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ కు 2 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని తేలింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి .. వాటి సంఖ్య పెరగవచ్చు .. లేదా తగ్గనూ వచ్చు.
————K.N.MURTHY