కల చెదిరింది … కథ మారింది !

Sharing is Caring...

అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ ఎన్నో కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాక కూడా ఇక అవకాశాలు లేవని తెలిసి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించింది. అన్నాడీఎంకే లో ప్రవేశానికి  సీఎం పళని స్వామీ ససేమిరా అనడం … బీజేపీ నేతలతో మాట్లాడినప్పటికీ సానుకూల స్పందన లేకపోవడంతో చిన్నమ్మ బాగా నిరాశ పడినట్టు చెబుతున్నారు. నాకు ఈ దుస్థితి కల్పించిన వారిపై పగ తీర్చుకుంటా అంటూ ముమ్మార్లు జయ సమాధి పై తట్టి మరీ శపథం చేసిన చిన్నమ్మ ఆ శపథం తీర్చుకోకుండానే పాలిటిక్స్ నుంచి తప్పుకున్నారు.

మేనల్లుడి పార్టీ ని నడపాలంటే అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. కోట్లాది రూపాయలు సొమ్ము కావాలి. మొన్నటి సెప్టెంబర్ లో శశికళ కు  చెందిన 1600 కోట్ల ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. ఇంకా  చెన్నై శివార్లలో ఉన్న భూములు , మరికొన్ని ఆస్తులపై కూడా ఐటీ శాఖ దృష్టి పెట్టింది. జయ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో శశి బంధువులు నిర్మిస్తున్న భవన నిర్మాణం పై కూడా అధికారులు కన్నేశారు. ఇది  300 కోట్ల విలువైన స్థలం . ఇది శశి బినామీ ఆస్తిగా భావిస్తున్నారు. ఇక జయ ఆస్తుల పంపకం జరిగిపోయింది . జయ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చిన్నమ్మ ఆర్ధిక వనరులపై ఇప్పటికి ఐటీ శాఖ కన్నేసి ఉంచింది.ఈ పరిస్థితుల్లో ఎటు నుంచి సొమ్ము అందినా కొత్త కేసులు బుక్ అవుతాయి. మళ్ళీ జైలుకి పంపినా పంపుతారు అనే భయం కూడా పట్టుకుంది. అందుకు సిద్ధపడినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్‌ 8 ప్రకారం ఒక వ్యక్తి ఏదేని నేరాలకు పాల్పడి, జైలుశిక్ష అనుభవిస్తే ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హులు. అదేవిధంగా 1988 సెక్షన్‌ 8(1)ఎం) అవినీతి నిరోధక చట్ట ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కనీసం ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనే ఛాన్స్ లేదు. చిన్నమ్మ లాయర్లను పిలిపించి సంప్రదించినప్పటికీ, అందరూ అదే మాట చెప్పారట. జైలు నుంచి విడుదలైన  రోజు నుంచి ఆరేళ్ల పాటు.. అనగా 2027 జనవరి 26వ తేదీలోగా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం అసాధ్యం అని తేల్చి చెప్పారట. దీంతో శశికళ నీరు కారిపోయారు. 

బీజేపీ పెద్దలతో మాట్లాడి పోటీ చేసే అవకాశం కల్పించమని కోరినప్పటికీ అటు నుంచి రెస్పాన్స్ లేదట. దీంతో చిన్నమ్మ అంచనాలన్నీ విఫలమైనాయి. ఇక అన్నాడీఎంకే లో ఉన్నఅనుచరులు ఎవరూ స్పందించడం లేదు. పళని స్వామి పార్టీ నేతలను కట్టడి చేశారు. ఒక దశలో బీజేపీ నేతలు కొన్ని సీట్లు ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే చిన్నమ్మ అందుకు సుముఖత చూపలేదని తెలుస్తోంది. మొత్తం మీద దారులన్నీ మూసుకుపోయాయి.  ఇక చిన్నమ్మ కూడా స్థాయి ని మించి ఆశించారు. జయలలిత దగ్గర అనుచరురాలిగా చేరి … ఆమె మరణాంతరం  సీఎం పదవి పైనే కన్నేశారు. జయ ఇచ్చిన చనువును దుర్వినియోగం చేశారనే విమర్శలు లేకపోలేదు. ఆమె వ్యవహార శైలి… స్వార్ధపూరిత వైఖరి గమనించే  పళనిస్వామి,సెల్వమ్ లు ఆమెను దూరంగా పెట్టారు. ఈ పరిణామాల కారణంగా నే చిన్నమ్మ రాజకీయాలకు దూరం అయ్యారు. 

———– K.N.MURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!