ఎవరీ స్వామి నారాయణ ?

Sharing is Caring...

Temples for the Vaishnava devotee ……………………….

ప్రపంచం లో ఎక్కడైనా దేవుళ్ళకు గుడి కట్టిస్తారు.భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.కానీ ఒక భక్తుడికి రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు ‘స్వామి నారాయణ’. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన ఆలయాలు కట్టించారు. తర్వాత మరికొన్ని కూడా నిర్మించారు.   

వంద ఎకరాల సువిశాల భూభాగంలో ఢిల్లీ ఆలయం నిర్మించారు. ఇది యమునానది తీరాన ఉన్నది. అద్భుత నిర్మాణ శైలికి ఈ ఆలయం అద్దం పడుతుంది. అడుగడునా శిల్ప సౌందర్యం కనిపిస్తుంది. స్వామి నారాయణ గురించి చెప్పుకోవాలంటే … ఆయన 1781,ఏప్రిల్ నెల 3న ఉత్తరప్రదేశ్ లో అయోధ్య కు దగ్గరలో ఉన్న ఛాపియా గ్రామం లో జన్మించారు.

ఈయన తండ్రి హరిప్రసాద్ పాండే అర్చకుడు.తల్లి ప్రేమవతి గృహిణి. తల్లితండ్రులు ఈయనకు పెట్టిన పేరు ఘనశ్యాం పాండే.ఘనశ్యాం బాల్యం నుండి చురుకైన వాడు. ఏక సంధాగ్రాహి. ఆయన ఏడు సంవత్సరాలకే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను పుక్కిట పట్టాడు.

పదకొండవ ఏట పా౦చరాత్ర ఆగమవిధానం …  వైష్ణవ భక్తి స౦ప్రదాయాలు నేర్చుకునేందుకు తగిన గురువుకోసం వెతుక్కుంటూ దేశాటన మెుదలు పెట్టారు. ఇల్లు వదిలి కాలు బయట పెట్టగానే తన పేరు నీలకంఠ వామిగా మార్చుకున్నారు. దేశమంతా తిరుగుతూ గుజరాత్ చేరాడు.

అక్కడ ఉద్దవ సంప్రదాయానికి చె౦దిన రామచంద్ర స్వామి వద్ద శిష్యుడిగా చేరాడు.1802 లో రామచంద్రస్వామి తాను పరమపదించటానికి ముందు ఘనశ్యాం పాండే పేరును సహజానంద స్వామి గామార్చారు. ఏకంగా ఉద్దవ సంప్రదాయానికి గురువుగా నియమించాడు.

స్వామి తన శిష్యులకు  స్వామి నారాయణ్ మంత్రం ఉపదేశి౦చటం మెదలు పెట్టాడు. సదా స్వామి నారాయణ్ జపం చేస్తు౦డటంతో కాలక్రమంలో భక్తులు ఆయననే ‘స్వామి నారాయణ’ గా భావించి ఆ పేరుతో పిలవసాగారు. ఆనాటి సమాజంలో స్త్రిలకు విధించిన దయనీయమైన జీవనవిధానాన్నిస్వామినారాయణ్ ఖండించి వారి కోసం సమాజ సంస్కరణలు చేపట్టారు.

అందరికి నియమబద్దమైన మంచి జీవితం గడపమని బోధించడంతో ఆయనకి పెద్దపేరు వచ్చింది. ఆనాటి బ్రిటీషు అధికారులు స్వామి నారాయణ పట్ల అత్యంత గౌరవంగా ఉండేవారు. క్రెస్తవులు ముస్లింలు, ఫార్సిలు కూడా ఆయన శిష్యలుగా  మారారు. 

ఆయన పరమ పదించాక గుజరాత్ లో ఆయనకు ఒక అద్బుతమైన గుడి కట్టించారు. తరువాత ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ ను౦చి భూమిని పొంది యమునా నదీ తీరం లో దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో అక్షరధామ్ నిర్మించారు.ఆ ఆలయంలో అడుగడుగునా అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉట్టిపడుతుంది.

దేవతామూర్తుల విగ్రహాలు, పురాణ ఇతిహాస కథలు, గాధలతో ఈ భవనం కళాత్మకంగా మనకు గోచరిస్తుంది.భవన సముదాయం లోని గర్భభాగములో 11 అడుగుల ఎత్తుతో బంగారు తాపటం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది.  

ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి. ఈ స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ని ప్రముఖ్ మహరాజ్ నిర్మించారు.

ఇక్కడ కు వచ్చే భక్తులకు లేజర్ షో ద్వారా  స్వామినారాయణ జీవిత చరిత్ర ను ప్రదర్శిస్తారు. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రబోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి.అక్కడ బోట్ రైడ్ ఆసక్తికరంగా ఉంటుంది.

ఒక థియేటర్ లో నీటిలో ఉన్న పట్టాలమీద బోట్ కదులుతూ ఉంటుంది. అది వెళ్ళే మార్గాన గోడలపై  చారిత్రక విషయాలను తెలిపే బొమ్మలు  గీయించారు.ఈ ఆలయ పునాదిపైన ఉన్న బృహత్ నిర్మాణ౦లో ఎక్కడా స్టీలు వాడలేదట.ప్రాచీన దేవాలయాలు కట్టినట్లే రాతితో నిర్మి౦చారు.

ఆ శిలలమీద జీవకళ ఉట్టిపడేలా శిల్పాలు పర్యాకులను ఆకట్టుకుంటాయి.  ఈ ఆలయ నిర్మాణ౦లో వేలాది మ౦ది శిల్పులు స౦వత్సరాల తరబడి పనిచేసారట. ఈ ఆలయ౦ ప్రప౦చ౦లోని అన్ని హి౦దూదేవాలయాలలోకీ పెద్దదిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలోకి ఎక్కి౦ది.

రాజస్తాన్ ‍లోని పిండ్వారా, సికంద్రా పట్టణాల నుంచి సేకరించిబడిన వేలాది టన్నుల కెంపువన్నె ఇసుకరాళ్ళు, పాలరాళ్ళతో నిర్మించిన ఈ కట్టడంలో ఒక అంగుళం మేరకైనా ఉక్కు వాడకపోవడం పెద్ద విచిత్రం.

మొదటిదైన అక్షరధామ్ గుజరాత్ ‍లోని గాంధీనగర్‌లో ఉన్నది.ఢిల్లీలోని అక్షరధామ్ రెండవది. 2002 సంవత్సరం సెప్టెంబరు లో గాంధీనగర్‌లో ఉన్న అక్షరధామ్‌‍పై తీవ్రవాదులు దాడి చేశారు. నాటి దుర్ఘటనలో 33 మంది చనిపోయారు.తర్వాత కాలంలో వందల ఆలయాలు  నిర్మించారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!