బాపు గారి కెమేరా కన్ను!

Sharing is Caring...

Bharadwaja Rangavajhala

బాపుగారి సినిమాలు చూసేవారికి బాబా అజ్మీ అనే పేరు బాగా పరిచయమే. రాజాధిరాజు, వంశవృక్షం, త్యాగయ్య, రాధా కళ్యాణం, కృష్ణావతారం సినిమాలకు బాబాయే కెమేరా సారధి.ఈ బాబా అజ్మీ అనే కుర్రాడు ప్రముఖ కవి కైఫీ అజ్మీ కుమారుడు. నటి షబ్నా అజ్మీ తమ్ముడు. బాబాకి తండ్రిలా కవిత్వం రాయడం మీద ఇంట్రస్టు లేదు.

అలాగే అక్కలాగా నటుడు కావాలనే కోరికా కలగలేదు. మరేం చేయాలి? బుద్దిగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి.కవిత్వం నటన ఒంట బట్టలేదుగానీ సృజనాత్మక రంగంలోనే రాణించాలనే కోరిక మాత్రం అంతరాంతరాల్లో పనిచేస్తూనే ఉందతనికి. ఏదో చేయాలి … అనే తపనతో చదువు మీద కూడా పెద్దగా శ్రద్ద పెట్టలేదు. ఫైనల్ గా అదీ బాబాకు అందుబాటులోకి రాలేదు.

తండ్రి పిలిచి నీ గోలేమిటి? అని అడిగారు. గోలేమిటి అంటే నెగెటివ్ సెన్సులో కాదు …నీ గోల్ ఏమిటి? అనే. డైరక్షన్ అన్నాడు మనోడు ఏం చెప్పాలో తెలియక.ఓకే మరి ఓ మంచి దర్శకుడ్ని చూసుకుని పనిలో ప్రవేశించు అని ఎడ్వైజ్ చేశారు కైఫీ అజ్మీ.

టాక్సీ డ్రైవర్ , హిందూస్తాన్ కీ కసమ్, జానేమన్ , కుద్రత్ లాంటి సినిమాలు తీసిన సీనియర్ డైరక్టర్ చేతన్ ఆనంద్ దగ్గర దర్శకత్వపు శాఖలో చేరాడు. అయితే చేరిన కొద్ది రోజులకే అది బోరు కొట్టేసింది. అబ్బే ఈ పని మన వల్ల కాదనుకున్నాడు. అనిపించిన తక్షణం అక్కడ మానేశాడు.

ఆ తర్వాత  ఏం చేయాలనే ఆలోచన మళ్లీ మొదలయ్యింది. ఖాళీగా తిరిగేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దూరపు బంధువు ప్రసిద్ద కెమేరామెన్ ఇషాన్ ఆర్య నుంచీ పిలుపు వచ్చింది. డైరక్షన్ వద్దనుకుంటున్నావట కదా… కెమేరా ట్రై చేస్తావా అని అడిగారాయన.సరే అది మానేశాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి అన్నట్టుగానే సరే అన్నాడు బాబా అజ్మీ. సరిగ్గా అప్పుడే ఇషాన్ తో బాపుగారు ముత్యాలముగ్గు సినిమా గురించి చర్చలు జరుపుతున్నారు. అలా ముత్యాలముగ్గు చిత్రంతో బాబా అజ్మీ కెమేరా జీవితం ప్రారంభమయ్యింది.

ముత్యాలముగ్గు సినిమా షూటింగులో అజ్మీ అసలు కెమేరాను ముట్టుకోనేలేదు. లైట్లు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టడం … స్విచ్చేయమంటే వేయడం లాంటి పనులే చేయించాడు ఇషాన్. అయితే బాబా అజ్మీకి కెమేరా పట్ల  ఉత్సాహం కలిగింది. ఇదేదో మనకు తగిన పని అని నిర్ణయించేసుకున్నాడు.ఎప్పుడైతే ఇంట్రస్టు పుట్టిందో ఆ వెంటనే కెమేరా గురించీ ఛాయాగ్రహణం గురించీ తెల్సుకోవడం ప్రారంభించాడు.

నిజానికి అంతకు ముందు బాబాకి మామూలు కెమేరాతో ఫొటోలు తీసే అలవాటుగానీ హ్యాండిల్ చేయాలనే తపన గానీ  లేదు. అయినా ఇషాన్ తో పనిచేస్తుండగా … ఆ ఉత్సాహం ఉద్రేకం వచ్చేశాయి.ఇషాన్ కూడా మంచి శిష్యుడు దొరికాడనుకున్నారు. అంతే కెమేరాకు సంబంధించి, లైటింగుకు సంబంధించీ చాలా విషయాలు బాబాకు చెప్పడం మొదలెట్టాడు. ముఖ్యంగా ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త పోకడలు , సహజత్వానికి ప్రాధాన్యత ఇస్తూ తీయడం ఎలా ? వంటి  అంశాలలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించాడు.

మరో వైపు ఇషాన్ వరుసగా బాపుగారి సినిమాలు చేస్తూ వచ్చాడు. స్నేహం, గోరంత దీపం, తూర్పువెళ్లే రైలు చిత్రాలకు ఇషానే కెమేరా దర్శకుడు. మధ్యలో ఓ ఎన్టీఆర్ సినిమాకూ పనిచేశారు. ముత్యాలముగ్గు విజయం చూసి నందమూరి రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన మంచికి మరో పేరు సినిమాకు ఇషాన్ ను కెమేరా దర్శకుడుగా పెట్టుకున్నారు.ఎన్టీఆర్ కు విగ్గూ , మేకప్పూ ఉండకూడదన్నాడు ఇషాన్. అది కుదిరే పని కాదన్నారు దర్శక నిర్మాతలు. అక్కడ నుంచీ ప్రతి అంశంలోనూ ఘర్షణే. రిఫ్లెక్టర్లు , లైట్లు భారీగా వాడద్దనేది ఇషాన్ పద్దతి. అది వాళ్లకు జీర్ణం కాలేదు.

ఎలాగోలా సినిమా కంప్లీట్ చేసి బయటపడ్డాడు ఇషాన్.తెలుగు సినిమాలతో పాటు మల్లిగై మోహిని అనే తమిళ సినిమాకు కూడా పనిచేశారు ఇషాన్ ఆర్య, బాబా అజ్మీలు. ఈ సినిమాకు సంబంధించిన విశేషం ఏమిటంటే … తెలుగు అమెరికా అమ్మాయి చిత్రంలో వినిపించే ఆనంద్ గీతం ఒక వేణువు వినిపించెను … పాట ట్యూను ఈ తమిళ సినిమాలో వినిపిస్తుంది. అక్కడ ఆనంద్ తో పాడించుకున్న వెంకటేశ్ తమిళ పాటను తనే పాడారు.
https://www.youtube.com/watch?v=6oSvnYBIexo

మల్లిగై మోహిని సినిమాకు ఆపరేటివ్ కెమేరామెన్ స్థాయికి ఎదిగాడు బాబా అజ్మీ. ఆ తర్వాత అతనికి తొలిసారి కెమేరా దర్శకత్వం వహించే అవకాశం కల్పించింది కూడా తమిళ పరిశ్రమే. షణ్ముగం డైరక్ట్ చేసిన కాశ్మీర్ కాదలి సినిమాకు బాబా అజ్మీ పనిచేశాడు. ఇదే అతనికి తొలి చిత్రం. ఆ సినిమాకు కూడా జి.కె.వెంకటేశే సంగీతం అందించడం విశేషం. ఆ సినిమా అనుకున్న సమయంలో విడుదల కాకపోవడం తో బాపుగారు తీసిన రాజాధిరాజే బాబా అజ్మీకి తొలి చిత్రంగా చెప్పుకోవాలి. రాజాధిరాజు సినిమాను తన సహచర సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ తో కలసి చాలా బాగా తీశారు.

ఈ సినిమాకు ట్రిక్ షాట్స్ అన్నీ రవి నగాయిచ్ చేసి పెట్టారు. కొన్ని ట్రిక్ షాట్స్ మాత్రం లోక్ సింగ్ చేసేశాడు.ఆ తర్వాత బాపుయే తీసిన వంశవృక్షం సినిమాకు బాబా అజ్మీ పనిచేశారు. బాబా అజ్మీ దగ్గర ఆపరేటివ్ కెమేరామెన్ గా లోక్ సింగ్, థామస్ జేవియర్ పనిచేసేవారు. ఆ తర్వాత తీసిన సినిమాలకూ … సారధీ వారి రాధా కళ్యాణానికి కూడా ఇదే టీమ్ నడిచింది. బాపు అంతరంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకుని దాన్ని తెర మీద ఆవిష్కరించేవారు. అందుకే బాపు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీరితోనే ప్రయాణం సాగించారు.

1981 వ సంవత్సరం సితార సినిమా అవార్డులన్నీ వంశవృక్షం సినిమా కొట్టేసింది. ఆ అవార్డుల ప్రకటన వెలువడిన మర్నాడే నవతా కృష్ణంరాజుగారు ఒక ప్రకటన వెలువరించారు. సితార పురస్కారాలు అందుకున్న వారితో త్యాగయ్య చిత్ర నిర్మాణం త్వరలో అని. సదరు త్యాగయ్య సినిమాకూ బాబా అజ్మీ, లోక్ సింగ్ ఇద్దరూ పనిచేశారు. లోక్ సింగ్ ఇందులో కేవలం ట్రిక్ షాట్స్ మాత్రమే తీయడం విశేషం.ఆ తర్వాత బాపు తీసిన కలియుగ రావణాసురుడు చిత్రానికి సైతం బాలూమహేంద్ర కొంత తీస్తే మిగిలింది బాబా అజ్మీ పూర్తి చేశారు.

సాక్షి తీసిన దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత బాపు కృష్ణల కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కృష్ణావతారం. దానికీ బాబా అజ్మీనే బాధ్యత భుజాన చేసుకున్నారు. బాపుగారితో బాబా అజ్మీ చేసిన చివరి చిత్రం… తెలుగులోనే అతను పనిచేసిన చివరి చిత్రం పెళ్లీడు పిల్లలు. కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు లాంటి దిగ్గజాలు పనిచేసిన అన్నపూర్ణా బ్యానర్ లో సినిమా అని హడావిడిగా వెళ్లి బాపు రమణలు పనిచేసిన సినిమా పెళ్లీడు పిల్లలు. పూర్తిగా అమరావతి లో తీసిన ఆ సినిమా ప్రేక్షకాదరణలో కాస్త వెనకబడింది. బాపు సినిమాకు మొదటి సారి ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించారు.అలా తెలుగులో పది పన్నెండు సినిమాలు చేసిన తర్వాత నెమ్మదిగా బాబా అజ్మీ దృష్టి బాలీవుడ్ వైపు ప్రసరించింది.

అటు తర్వాత ఆయన తెలుగులో పనిచేయలేదు. శేఖర్ కపూర్ తీసిన సూపర్ హిట్ మిస్టర్ ఇండియా తో మొదలు పెట్టి డెడ్ లైన్ సిర్ఫ్ 24 ఘంటే వరకు అనేక హిందీ సినిమాలకు ఆయన పనిచేశారు. కథ నచ్చితే తన రెమ్యూనరేషన్ కూడా పక్కన పెట్టి పనిచేసే డెడికేషను ఉన్న కెమేరా దర్శకుడతను.బాబా అజ్మీ పెళ్లి కూడా బాపుగారి నేతృత్వంలోనే జరగడం విశేషం. తెలుగులో దెబ్బతిన్న సీతమ్మ పెళ్లిని హిందీలో ప్యారీబెహనా పేరుతో రీమేక్ చేశారు.

ఆ మూవీకి బాబా అజ్మీనే కెమేరా దర్శకుడు. తను అదే సినిమాలో మిధున్ చక్రవర్తి చెల్లెలి పాత్రలో నటిస్తున్న కొత్తనటి తన్వి తో ప్రేమలో పడ్డాడు. ఆ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బాబాని మతం మారమన్నారు. ఆయన తండ్రి కూడా మారేయ్ … మతం మారినంత మాత్రాన మనుషులు మారరు అన్నారట. ఫైనల్ గా పెళ్లి అయ్యింది.హిందీ వాడే అయినప్పటికీ తెలుగులో గుర్తుండిపోయే సినిమాలకు బాబా అజ్మీ పనిచేశారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!