Devaraha Baba……
నీమ్ కరోలీ బాబా జీవిత కథతో రూపొందిన ‘హనుమాన్ అంశ’ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో నిర్మాతల కన్ను ఫేమస్ బాబాలపై పడింది. వారి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దేవరహా బాబా జీవితకథ ను సినిమాగా తీసేందుకు రెండు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇవి 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎవరీ దేవరహా బాబా ?
దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన సిద్ధ మహా యోగి ఆయన. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతం, బృందావనంలో యమునా, సరయూ నదుల ఒడ్డున ఆయన తన జీవితాన్ని గడిపారు. ఆయన జూన్ 19, 1990న బృందావనంలో మహాసమాధి చెందారు.ఆయన ఎప్పుడూ నేలపై కాకుండా,నదీ తీరంలో సుమారు 10 నుండి 12 అడుగుల ఎత్తులో చెక్కతో నిర్మించిన వేదిక (మచాన్) పైనే నివసించేవారు.
బాబా ప్రత్యేకతలు
భగవంతుడిని చేరుకోవడానికి కఠినమైన మంత్రాలు అవసరం లేదని, నిష్కల్మషమైన ప్రేమతో “శ్రీరామ్” లేదా “కృష్ణ” నామస్మరణ చేస్తే చాలని బోధించేవారు. ఆవులను రక్షించడం, సమస్త జీవరాశుల పట్ల దయతో ఉండటం అత్యున్నత ధర్మమని ఆయన చెప్పేవారు. ఆడంబరాలకు, డబ్బుకు, కీర్తికి దూరంగా ఉంటూ ప్రకృతితో మమేకమై జీవించాలని సూచించేవారు.పేదలకు ఆహారం పెట్టడం, ఆపదలో ఉన్నవారికి సాయం చేయడమే నిజమైన పూజ అని నమ్మేవారు.
ఆయన తన జీవితంలో ఎప్పుడూ ఘనాహారం తీసుకోలేదని, కేవలం యమునా, సరయూ నదీ జలాలు, అప్పుడప్పుడు పాలు లేదా తేనెతోనే జీవించారని భక్తులు చెబుతుంటారు. ఆయన నదీ జలాల అడుగున ఊపిరి బిగబట్టి గంటల తరబడి సమాధి స్థితిలో (ధ్యానంలో) ఉండేవారని భక్తులు చెబుతారు.
తన మరణ సమయాన్ని (జూన్ 19, 1990) ఆయన ముందే ఊహించి శిష్యులకు తెలియజేశారు. మహాసమాధి చెందే సమయంలో యమునా నది నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి ఆయన మచాన్‌ను తాకిందని ప్రతీతి.
అడవిలోని క్రూరమృగాలు, పక్షులు,నదిలోని చేపలు ఆయన ఆజ్ఞలను పాటించేవని ఆయన వద్దకు నిర్భయంగా వచ్చేవని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
ఆయన అసలు వయస్సు ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఆయన కనీసం 150 ఏళ్ల నుండి 500 ఏళ్లకు పైగా జీవించారని భక్తులు నమ్ముతారు. భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా తన చిన్నతనం నుండే బాబాను వృద్ధుడిగా చూశానని అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
బాబా తన మచాన్ పై నుండి భక్తుల తలపై తన పాదాన్ని (కాలి బొటనవేలిని) ఉంచి ఆశీర్వదించేవారు.
మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో రాజకీయ దిగ్గజాలు ఆయన ఆశీస్సులు తీసుకునేందుకు ఆశ్రమానికి వెళ్లేవారు.
దేవరహా బాబా జీవిత చరిత్ర ఆధారంగా రెండు సినిమాలు నిర్మితమవుతున్నాయి. అందులో ఒకటి ‘రుద్రయోగి’ కాగా రెండోది ‘మచాన్ బాబా’. ‘రుద్రయోగి’ సినిమా ఆధ్యాత్మిక రచయిత డాక్టర్ విక్రమ్ మిశ్రా రాసిన ‘మహాదేవ్ అంశ్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది.
జాతీయ అవార్డు గ్రహీత రవి రాజ్ ముర్ము దర్శకత్వంలో, శివ త్రిశూల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రధాన పాత్ర కోసం వినీత్ కుమార్ సింగ్, మోహిత్ రైనా, శరద్ కేల్కర్ వంటి నటులను పరిశీలిస్తున్నారు. దీనిని 2027 శ్రావణ మాసంలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
‘మచాన్ బాబా’ సినిమా ‘ఓజస్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై దేవరహా బాబా జీవితం, ఆయన మచాన్ జీవనం, రాజకీయ నాయకులతో ఆయనకున్న అనుబంధం ఆధారంగా నిర్మితమవుతోంది . దీని టైటిల్ పోస్టర్ విడుదలైంది.. ఈ చిత్రం కూడా 2027లో థియేటర్లలోకి రానుంది.
రుద్రయోగి,మచాన్ బాబా చిత్రాలకు సంబంధించి ప్రధాన నటులు ఎవరెవరో ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.ఈ రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

