ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామా !!

Sharing is Caring...

political drama..

దళపతి విజయ్ నటించిన ‘సర్కార్’ (Sarkar – 2018) ఒక యాక్షన్ పొలిటికల్ డ్రామా. దొంగ ఓట్లు,ఎన్నికల అవకతవకల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం  వహించారు.

కథ ఏమిటంటే ?

అమెరికాలో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే NRI సీఈఓ సుందర్ (విజయ్) తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంత రాష్ట్రానికి  వస్తాడు. అయితే అప్పటికే తన ఓటును వేరొకరు దొంగ ఓటుగా వేశారని తెలుసుకుని, సెక్షన్ 49P ద్వారా తన ఓటు కోసం న్యాయపోరాటం చేస్తాడు. ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాలను ఎలా కుదిపేసింది…  అవినీతి రాజకీయ నాయకులను సుందర్ ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగిలిన కథ.

కార్పొరేట్ సీఈఓగా స్టైలిష్ లుక్‌లో,రాజకీయ నాయకులను ఎదిరించే సన్నివేశాల్లో విజయ్ తన నటనతో సినిమాను వన్ మ్యాన్ షో గా నడిపారు.  దొంగ ఓటు పడినప్పుడు పోరాడే ‘సెక్షన్ 49P’ గురించిన సన్నివేశాలు, కోర్ట్ డ్రామా, పంచ్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ప్రతి నాయకి పాత్రలో వరలక్ష్మి తన నటనతో మెప్పించారు. కీర్తి సురేష్, యోగి బాబు పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. నటీ నటులంతా  బాగానే చేశారు. 

సుందర్  (విజయ్) ఇతర కంపెనీలను టేకోవర్ చేసే విధానం,  ఆయనను ‘కార్పొరేట్ మాన్‌స్టర్’గా పరిచయం చేసే సన్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. తన ఓటును వేరొకరు వేశారని తెలిసినప్పుడు సుందర్ స్పందించే తీరు, అధికారులతో వాదించి సెక్షన్ 49P కింద తన టెండర్ ఓటు వేయడానికి సిద్ధపడే సన్నివేశం సినిమాకు ప్రధాన ఆకర్షణ.

తన ఒక్క ఓటు కోసం ఏకంగా రాష్ట్ర ఎన్నికల ఫలితాలనే సవాలు చేస్తూ కోర్టులో సుందర్ చేసే వాదనలు, అలాగే ప్రెస్ మీట్ లో మీడియాకు ఆయన ఇచ్చే సమాధానాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఇంటికి వెళ్లి, తనకు ఎదురైన అవమానానికి బదులుగా రాజకీయ నాయకులకు నేరుగా సవాల్ విసిరే సన్నివేశం బాగుంటుంది. 

రాజకీయ నాయకులు పంపిన రౌడీలను ఎదుర్కొంటూ, “ఐ యామ్ ఎ కార్పొరేట్ క్రిమినల్” అని విజయ్ చెప్పే పంచ్ డైలాగ్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఒక సామాన్య వ్యక్తి కలెక్టరేట్ లో కుటుంబసభ్యులతో ఆత్మ హత్య చేసుకునే సన్నివేశాలను హృదయ విదారకంగా ఉంటాయి.

మొహం అంతా కాలిపోయి బతికిన పాపకు ట్రీట్మెంట్ చేయించే సన్నివేశాలు బాగుంటాయి. ప్రథమార్థం ఆసక్తికరంగా సాగినా, ద్వితీయార్థంలో కథనం సాధారణ రివెంజ్ పొలిటికల్ డ్రామాగా మారి నెమ్మదిగా సాగుతుంది.కథలో పాటలు అంతగా అతకలేదు.సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఆసక్తి కరం గా ఉంటాయి.   

లాజిక్ లేని సన్నివేశాలు. కొన్ని రాజకీయ ఎత్తుగడలు వాస్తవానికి దూరంగా, సినిమాటిక్‌గా అనిపిస్తాయి.రాజకీయ నేతల వ్యవహార శైలి ఎలా ఉంటుందో తెరపై బాగా చూపారు.

సినిమాలో గిరీష్ గంగాధరన్  కెమెరా  పనితనం, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం  ప్రధాన సాంకేతిక బలాలుగా నిలిచాయి. కథనంలోని కొన్నిలోపాలను కప్పిపుచ్చి, సినిమాకు ఒక గ్రాండ్ లుక్, ఎలివేషన్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి.

విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా లో-యాంగిల్ షాట్లు, ఫైట్ సన్నివేశాల్లో స్లో-మోషన్ షాట్లు అభిమానులకు విందులా ఉంటాయి..పాటల కంటే రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసింది. ముఖ్యంగా సుందర్ పాత్రలోని గ్రే షేడ్స్ (కార్పొరేట్ క్రిమినల్) హీరోయిజం సన్నివేశాలకు ఇచ్చిన  థీమ్ మ్యూజిక్  ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి కమర్షియల్‌గా హిట్‌గా నిలిచింది. సుమారు ₹110 – ₹115 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ₹252 నుండి ₹256 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. 

పొలిటికల్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మురుగదాస్-విజయ్ గత చిత్రాలైన ‘తుపాకి’, ‘కత్తి’ స్థాయిలో లేకపోయినా, ఓటు విలువను తెలిపే మంచి సందేశం ఉన్న సినిమా ఇది, ఆసక్తి ఉన్నవారు sunnext లో తెలుగు లో సినిమా చూడ వచ్చు.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!