Suspense thriller……..
‘ది డార్క్ హెవెన్ ‘(The Dark Heaven) ఇదొక తమిళ మిస్టరీ,క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. బాలాజీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
ఈ కథ మెక్కరై అనే ఒక కొండ ప్రాంత గ్రామంలో మొదలవుతుంది. అక్కడ ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాపులో స్థానిక లైబ్రేరియన్‌కు ఒక పుస్తకం దొరుకుతుంది. ఆ పుస్తకాన్నిచదవడం ప్రారంభించే ఎవరికైనా అది ఒక భయంకరమైన అనుభూతిని ఇస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు, చివరికి వారు ఎలా చనిపోతారు, ఎప్పుడు, ఎవరి చేతిలో చనిపోతారు అనే వివరాలతో సహా అందులో ముందే రాసి ఉంటాయి.
ఇరవై ఐదేళ్ల తర్వాత, ఆ లైబ్రేరియన్ కూతురు తన తండ్రికి ఏమైందో తెలుసుకోవడానికి మెక్కరై గ్రామానికి వస్తుంది. అదే సమయంలో, అడవి దేవత శాపానికి సంబంధం ఉందని భావిస్తున్న వరుస మిస్టరీ మరణాలపై విచారణ జరపడానికి సిద్ధు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ కొండ ప్రాంత గ్రామానికి వస్తాడు.
ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే వరుస హత్యలు ప్రారంభమవుతాయి.విచారణ ఒక సైకో కిల్లర్ వైపు నడిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? అసలు మెక్కరైలో ఏం జరిగింది? ఆ ఊరి శాపంలో ఎంతవరకు నిజముంది? ఈ ప్రశ్నల చుట్టూనే “ది డార్క్ హెవెన్” కథ తిరుగుతుంది.
దర్శకుడు బాలాజీ కథనం వల్ల సినిమా మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కథను నిలకడగా ముందుకు నడిపిస్తూనే, ఆ మిస్టరీని, ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఈ సినిమా ద్వారా టెలివిజన్ నుండి వెండితెరకు పరిచయమైన సిద్ధు చాలా సహజంగా నటించి, ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు.
దర్శిక, రిత్వికలకు పరిమితమైన పాత్రలు లభించినప్పటికీ, ఇద్దరూ బాగానే నటించారు.నిజాల్గల్ రవి, వేలా రామమూర్తి, అరుళ్ డి శంకర్ పోషించిన పాత్రలపై ప్రేక్షకులకు అనుమానం కలిగేలా డిజైన్ చేశారు, ఇది హత్యల చుట్టూ ఉన్న మిస్టరీని మరింత పెంచింది.
ఒక ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్‌కు కావలసిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ, “ది డార్క్ హెవెన్” సినిమాలో బహుళ కథనాలను (multiple narrative threads) తీసుకురావడం ప్రేక్షకులలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఆ మిస్టరీ పుస్తకం, కథను వివరించే లైబ్రేరియన్, అడవి దేవత శాపం, సైకో కిల్లర్ ఉండే అవకాశం—ఇలా ఇన్ని లేయర్స్ ఒకేసారి రావడం వల్ల, సినిమా అసలు ఏ దిశగా వెళ్తుందో అని ప్రేక్షకుడు ఆలోచించేలా చేస్తుంది.
కొన్ని చిక్కుముడులను ఉద్దేశపూర్వకంగానే రెండవ భాగం కోసం వదిలేసినప్పటికీ, మొదటి భాగం కేవలం ఒకే ఒక ప్రధాన కథాంశంపై దృష్టి పెట్టి ఉంటే మరింత ప్రభావవంతంగా,ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చేది.హీరో ఇన్వెస్టిగేషన్ సీన్లు, ఊరిలోని రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పే స్క్రీన్‌ప్లే బాగుంది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్నిట్విస్ట్లు ఊహించని విధంగా ఉంటాయి. సినిమా రన్‌టైమ్ 2 గంటల 25 నిమిషాలు కావడం తో ఫస్ట్ హాఫ్‌లో కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది.ఈ సినిమా చివరి వరకు ప్రేక్షకులు ఎవరెవరినో హంతకులుగా ఊహించుకుంటారు.
హంతకుడు ఎవరో సులభంగా ఊహించలేకపోవడం అనేది ఈ సినిమాకు, ముఖ్యంగా క్లైమాక్స్‌కు బాగా ప్లస్ అయింది. పెద్ద మిస్టరీని మెయింటైన్ చేసిన దర్శకుడు.. హంతకుడిని రివీల్ చేసే సమయంలో, దానికి గల కారణాన్ని (Motive) చూపించిన విధానం కాస్త రొటీన్‌గా అనిపిస్తుంది.
మణికందన్ పి.కె. కెమెరా పనితనం విజువల్స్‌కు ఒక భయానకమైన రూపాన్ని ఇచ్చింది. కొన్ని సన్నివేశాలలో విజువల్స్ చూస్తుంటే, ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా అనే స్థాయి గ్రాండియర్ కనిపిస్తుంది. శక్తి బాలాజీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఉత్కంఠను పెంచడమే కాకుండా, పలు సన్నివేశాలను మరింత గ్రిప్పింగ్‌గా మార్చడంలో ప్రత్యేక పాత్ర పోషించింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే ఊహించని క్లైమాక్స్ కోసం “ది డార్క్ హెవెన్” సినిమాను చూడవచ్చు.

