Child trafficking story ……
‘గాంధారీ’ (Gandhari).హిందీ యాక్షన్-థ్రిల్లర్ చిత్రం ఇది. చైల్డ్ ట్రాఫికింగ్ (పిల్లల అక్రమ రవాణా) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ‘తాప్సీ పన్ను’ లీడ్ రోల్ లో నటించింది.తెలుగు వెర్షన్ లో NETFLIX లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథాంశం
రైల్వే స్టేషన్‌లో ఒక ముఠా చేతిలో 5 ఏళ్ల కుమార్తె మిష్టీని పోగొట్టుకుంటుంది బాని (తాప్సీ పన్ను). ఆ క్రమంలోనే ఆమె తాత్కాలికంగా చూపు కోల్పోతుంది. కళ్ళకు గంతలు కట్టుకునే తన కూతురిని వెతుకుతూ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టును రట్టు చేయడానికి, ఎలాంటి సాహసాలు చేసిందనేదే ఈ సినిమా కథ.
ఒక వైపు కూతురిని పోగొట్టుకున్న తల్లిగా ఎమోషనల్ సీన్స్‌లోనూ, మరోవైపు యాక్షన్ సీన్స్‌లోనూ తాప్సీ అద్భుతమైన నటన కనబరిచింది. వన్-వుమెన్ ఆర్మీగా సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. తాప్సీ భర్తగా నటించిన ఇష్వాక్ సింగ్, నెగెటివ్ పాత్రల్లో కనిపించిన జతిన్ సర్నా, మితా వశిష్ట్, ఛాయా కదమ్ తమ నటనతో మెప్పించారు.
సినిమా మొదలైన మొదటి అరగంట కథ చాలా గ్రిప్పింగ్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతుంది.ఎంచుకున్న స్టోరీ పాయింట్ మంచిదే కానీ దాన్ని ఎఫెక్టీవ్ గా తెరకెక్కించలేకపోయారు. ద్వితీయార్థంలో సినిమా పూర్తిగా గాడి తప్పింది. కథలో వచ్చే మలుపులు చాలా బలవంతంగా ఇరికించినట్టు ఉండి, అసలు లాజిక్‌కే అందవు.కథపై సరైన కసరత్తు చేయలేదని చూసేవారికి తెలిసి పోతుంది.
రచయిత్రి కనికా థిల్లాన్ కథ, దర్శకుడు దేవాశిష్ మఖిజా మేకింగ్ శైలి ఒకదానితో ఒకటి సరిగ్గా మ్యాచ్ కాలేదు. కథలో బహురూప కళాకారుల ఎలిమెంట్స్, మిథాలజీని కలపాలని చూసినప్పటికీ అవి ప్రేక్షకుడికి సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఒక తల్లి పడే ఆవేదన, పగ చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ, స్క్రీన్‌ప్లే లోపాల వల్ల ఆ ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయింది.
సినిమా కథను ఎలా పడితే అలా తిప్పేశారు. కథానాయిక బాని (తాప్సీ) తలకు తగిలిన గాయం వల్ల తాత్కాలికంగా కంటి చూపు కోల్పోతుంది. అయితే, ఆమె బ్లైండ్ మోడ్‌లోకి మారిన తర్వాత కూడా శత్రువులను కాప్టెన్ అమెరికా తరహాలో మార్వెల్ రేంజ్ ఫైట్లతో కుమ్మేస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ అస్సలు నమ్మశక్యంగా ఉండవు.
ఒక చిన్న పాప రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అవ్వడం, తల్లిదండ్రులు వెతకడం, చివరకు తల్లి ప్రతీకార దేవతలా మారి విలన్లను అంతం చేయడం అనేది బాలీవుడ్‌లో ఇప్పటికే వచ్చిన ‘మర్దానీ’, ‘మామ్’ వంటి సినిమాలను తలపిస్తుంది. కథలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకుడు సులభంగా ముగింపును ఊహించగలడు.
కథనం గందరగోళంగా సాగుతుంది. రైల్వే డిపార్ట్మెంట్ లో అందరికి ట్రాఫికింగ్ లో ప్రమేయం ఉన్నట్టు చూపారు. కథలో పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు. గాంధారి అనే పేరు బాగుంది అని సినిమాకు పెట్టుకున్నారు.. కానీ మహాభారత గాంధారి కి ఈ గాంధారి కి కళ్ళకు గంతలు కట్టుకోవడం మినహా మరే పోలిక లేదు.
సినిమా ఒక సీరియస్ క్రైమ్ ఇష్యూను డీల్ చేస్తున్నప్పటికీ, అవసరానికి మించి మెలోడ్రామాను జోడించారు. ‘గాంధారీ’ ఒక యావరేజ్ రివెంజ్ థ్రిల్లర్. తాప్సీ పన్ను నటన కోసం, యాక్షన్ సీన్స్ కోసం దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో ఒకసారి చూడవచ్చు. లాజిక్స్,బలమైన కథనాన్ని ఆశించే వారిని ఈ సినిమా తీవ్రంగా నిరాశపరుస్తుంది.

