Family Drama…
“బ్లాస్ట్ జోన్ ” ఇది తమిళ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ ఇది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు సుభాష్ కె. రాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ ఏమిటంటే ?
కథ మొత్తం ఒక మార్షల్ ఆర్ట్స్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. రాజారామన్ (అర్జున్ సర్జా) ఒక కరాటే ట్రైనర్. అతను తన కూతురు నీలా (ప్రీతి ముకుందన్) కు చిన్నప్పటి నుండే ఆత్మరక్షణ విద్యలతో పాటు సమాజంలో జరిగే అన్యాయాలపై ఎదురుతిరిగే ధైర్యాన్ని నేర్పిస్తాడు. అతని భార్య నీలవేణి (అభిరామి) కూడా ఒకప్పుడు కరాటే ఛాంపియనే.
ఐటీ ఉద్యోగి అయిన నీలా సమాజంలో మహిళలపై, బలహీనులపై జరిగే అన్యాయాలపై ఒంటరిగానే పోరాడుతుంటుంది. ఈ క్రమంలో ఒక శక్తివంతమైన మైనింగ్ మాఫియా డాన్ వరుణ్ దయాళన్ (జాన్ కొక్కెన్) మనిషి తో ఆమెకు గొడవ అవుతుంది. ఈ గొడవ కారణంగా ఆ క్రూరమైన క్రైమ్ సిండికేట్ నీలా కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. ఆ ప్రమాదం నుండి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఈ విలక్షణమైన కుటుంబం ఎలా ఎదురుదాడి చేసి గెలిచింది? అనేదే మిగతా కథ.
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఇందులోని యాక్షన్ కొరియోగ్రఫీ. హాంగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ సినిమాల శైలిలో ఉండే ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తాయి.ఈ సినిమాకు అర్జున్ ప్రధాన బలం. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఫిట్‌గా కనిపిస్తూ, అదిరిపోయే మార్షల్ ఆర్ట్స్, హై-ఓల్టేజ్ యాక్షన్ స్టంట్స్‌తో అలరించారు. ఒక మధ్యతరగతి తండ్రిగా, కరాటే మాస్టర్‌గా ఆయన నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ప్రీతి ముకుందన్ అర్జున్ కుమార్తె ‘నీలా’ పాత్రలో కనిపించారు. తండ్రి దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ధైర్యవంతురాలైన అమ్మాయిగా ఆమె నటన, భావోద్వేగాలు, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ప్రీతి ముకుందన్ విలన్లను మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో చితక్కొట్టే సీన్లు, అందుకు తగ్గ కెమెరా మూవ్‌మెంట్స్ చాలా కన్విన్సింగ్‌గా, అద్భుతంగా పండాయి.
చాలా కాలం తర్వాత కనిపించిన అభిరామి హోమ్లీగా ఉంటూనే, ఫైట్స్ చేసే సమయంలో చూపించిన ఇంటెన్సిటీ చాలా బాగుంది. అభిరామి రాజారామ్ భార్యగా, నీలా తల్లిగా చక్కటి నటనను చూపారు. కూతురి భద్రత గురించి ఆందోళన చెందుతూనే, ఆమెకు అండగా నిలిచే తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయారు.
అబ్రహం పాత్ర లోఅర్జున్ చిదంబరం నటించారు. కళ్లల్లో క్రూరత్వాన్ని చూపిస్తూ, చాలా స్టైలిష్‌గా, భయంకరమైన విలనిజంతో మెప్పించారు. జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న, పవన్ వంటి నటులు తమ పరిధి మేరకు నెగెటివ్, సపోర్టింగ్ పాత్రల్లో చక్కగా నటించి కథ గమనానికి సహాయపడ్డారు. హింస కూడా కొంచెం ఎక్కువే.
ఫస్టాఫ్ చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగినప్పటికీ.. సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కథ కాస్త పాతకాలపు ప్రతీకార డ్రామా వైపు వెళ్తుంది. విలన్ల కొన్ని సీన్లు ముందే ఊహించేలా ఉంటాయి. జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం లాంటి నటులు ఉన్నప్పటికీ, విలన్ల క్యారెక్టరైజేషన్ కాస్త రొటీన్‌గా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో పవర్‌ఫుల్‌గా అనిపించదు. కొంచెం సాగదీసినట్టుగా అనిపిస్తుంది.కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది.
హాలీవుడ్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ , సౌత్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్‌ల చక్కటి కలయిక. కథనంలో కొన్ని రొటీన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, మునుపెన్నడూ చూడని రీతిలో ఒక కుటుంబం మొత్తం కలిసి విలన్లపై చేసే యాక్షన్ అటాక్స్ ఆకట్టుకుంటాయి.
‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన విలక్షణమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) యాక్షన్ సన్నివేశాలను, సినిమాలోని ఉత్కంఠను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేసింది.కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ బాండింగ్, తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ను దర్శకుడు చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. సినిమాలో ఎలాంటి అశ్లీల సన్నివేశాలు లేవు. కుటుంబంతో కలిసి సినిమా చూడవచ్చు.

