Crime emotional thriller…………
‘సైరన్’ (Siren) ఇదొక యాక్షన్ క్రైమ్ ఎమోషనల్ థ్రిల్లర్..తమిళ హీరో జయం రవి, కీర్తి సురేష్, సముద్రఖని,అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు.
కథ ఏమిటంటే ?
తిలక్ (జయం రవి) ఒక అంబులెన్స్ డ్రైవర్. తన భార్య జెన్నిఫర్ (అనుపమ పరమేశ్వరన్) ను దారుణంగా హత్య చేశారనే అపనిందతో జైలుకు వెళ్తాడు. సుమారు 14 సంవత్సరాల తర్వాత, జైలు నుండి 15 రోజుల పెరోల్‌పై తిలక్ బయటకు వస్తాడు. అతను బయటకు వచ్చిన వెంటనే, అతని భార్య మరణానికి కారణమైన వారు ఒక్కొక్కరుగా దారుణంగా హత్యకు గురవుతుంటారు.
ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తి సురేష్) రంగంలోకి దిగుతుంది. అసలు ఆ హత్యలు చేస్తుంది తిలకా ? ఒకవేళ తనే అయితే ఒక సాధువు లాంటి అంబులెన్స్ డ్రైవర్ సైకో కిల్లర్‌గా ఎందుకు మారాడు ? తన కూతురి ప్రేమను అతను తిరిగి పొందగలిగాడా? అనేదే మిగతా కథ.
ఈ సినిమాలో జయం రవి రెండు విభిన్నమైన షేడ్స్ (యువకుడిగా,నడివయస్కుడైన తండ్రిగా) లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా పెరోల్‌పై వచ్చిన జైలు ఖైదీగా ఆయన చూపించిన హావభావాలు, నటన సినిమాకు పెద్ద అసెట్.
యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి.పోలీస్ ఆఫీసర్‌గా కీర్తి సురేష్ బాగానే చేసింది కానీ హీరో ముందు ఆమె పర్సనాలిటీ తేలిపోయింది. జయం రవి, కీర్తి సురేష్ మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్లు బాగున్నాయి.
సముద్రఖని ప్రధాన విలన్ పాత్ర లో జీవించాడు. యోగి బాబు సంగతి చెప్పనక్కర్లేదు. మిగతా పాత్రధారులు కూడా బాగానే చేశారు. సినిమాలో విలన్ల పాత్రలు చాలా వీక్‌గా ఉన్నాయి. హీరోకి, విలన్‌కి మధ్య బలమైన మైండ్ గేమ్స్ లేదా హోరాహోరీ పోరాటాలు కనిపించవు
భార్యను చంపిన వారిపై భర్త పగ తీర్చుకోవడం అనేది మనం గతంలో చాలా సినిమాల్లో చూసిన రొటీన్ రివెంజ్ డ్రామా లాగే అనిపిస్తుంది.ఈ కథను దర్శకుడు ఇంకొంచెం డిఫరెంట్ ఫార్మాట్ లో తీస్తే బాగుండేది. సినిమా మొదటి భాగం లో కొన్ని సీన్లు నెమ్మదిగా సాగుతాయి. స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉంటే బాగుండేది.అనవసర సన్నివేశాలు ఎడిట్ చేస్తే సినిమా నిడివి తగ్గేది.
హీరో హత్యలను ఎవరికి చిక్కకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసే సన్నివేశాలు బాగుంటాయి.కానీ అంత సులభమా అనే ఆలోచన కూడా ప్రేక్షకుడికి వస్తుంది. క్లయిమాక్స్ సన్నివేశాలు బాగా చిత్రీకరించారు.కథలో అక్కడక్కడా లాజికల్ లోపాలు ఉన్నాయి.ఎండింగ్ ట్విస్ట్ బాగుంటుంది
సినిమాలో కెమెరా పనితనం,సంగీతం కథలోని యాక్షన్, ఎమోషన్‌ను మరింత సమర్థవంతంగా ఎలివేట్ చేశాయి. సినిమాటోగ్రాఫర్ సెల్వకుమార్ ఎస్.కె. కథలోని రెండు వేర్వేరు టైమ్‌లైన్లను విజువల్ గా చాలా చక్కగా చూపించారు. జైలు,క్రైమ్ సీన్లను ‘డార్క్ అండ్ గ్రిట్టీ’ లో చూపించి సినిమా మూడ్‌ను పర్‌ఫెక్ట్‌గా సెట్ చేశారు.
ఈ సినిమాకు ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు పనిచేశారు. పాటలకు ఒకరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మరొకరు మ్యూజిక్ అందించడం విశేషం..సినిమా అసలు సిసలైన యాక్షన్ థ్రిల్లర్ మూడ్‌లోకి వెళ్లాక సామ్ సి.ఎస్. తన మార్క్ బిజిఎమ్ (BGM) తో దుమ్మురేపారు.
సస్పెన్స్, థ్రిల్ ఆశించి చూసే వారికి ఈ సినిమా ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వదు..ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.ఆసక్తి గలవారు చూడ వచ్చు.

