A rare port town…….
పురావస్తు శాస్త్రవేత్త ఎస్.ఆర్. రావు నేతృత్వంలో 1954లో ASI బృందం సింధు లోయ నాగరికతకు చెందిన ‘లోథాల్’ లో అద్భుతమైన పట్టణ ప్రణాళిక, ఓడరేవును కనుగొంది. సబర్మతి నది,అరేబియా సముద్రం సమీపంలోని ఈ ప్రాచీన రేవు, లాక్-గేట్ వ్యవస్థతో పనిచేసేది.నాడు అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఈ ఓడరేవును నిర్మించారు.ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వాణిజ్యం జరిగింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) బృందం లోథాల్ లో వరుస తవ్వకాలను చేపట్టింది. వారు కనుగొన్నవి సామాన్యమైనవి కావు, అత్యంత అసాధారణమైనవి. ఒక అద్భుతమైన ప్రణాళికతో నిర్మించిన నగర స్థావరం, అధునాతన డ్రైనేజీ వ్యవస్థ, చక్కగా నిర్మించిన నివాస, వాణిజ్య ప్రాంతాలు అక్కడ బయల్పడ్డాయి.
వీటన్నింటికంటే మిన్నగా, ఆ నగరాన్ని జలమార్గాలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాలతో అనుసంధానించే ఒక ఓడరేవు (డాక్‌యార్డ్) అక్కడ ఉందనే విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. లోథాల్ సముద్రయాన చరిత్రకు ఈ ఓడరేవే ప్రధాన కేంద్రం.
ఈ నిర్మాణం,ఆ నగరం వ్యూహాత్మక ప్రాధాన్యతను, దానిని నిర్మించిన వారి సాంకేతిక నైపుణ్యాన్ని స్పష్టంగా చూపుతుంది. సుమారు 214 మీటర్ల పొడవు, 36 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఓడరేవు, సబర్మతి నది, అరేబియా సముద్రపు పోటుపాట్లను (అలల ప్రవాహాన్ని) అనుకూలంగా మార్చుకునేలా చాలా తెలివిగా డిజైన్ చేశారు.
ఇది ఓడలు సులభంగా రేవులోకి రావడానికి, ఇక్కడి నుండి బయలుదేరడానికి సహాయపడగా,ఫలితంగా ఒక శక్తివంతమైన వాణిజ్య నెట్‌వర్క్ ఏర్పడింది. ఈ ఓడరేవులో నీటి మట్టాలను స్థిరంగా ఉంచడం, ఓడల రాకపోకలకు ఆటంకం కలిగించే పూడిక (మట్టి) చేరకుండా నిర్వహించగలగడమే ఇక్కడి ఇంజనీరింగ్ అద్భుతం.
నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి, ఓడలు సురక్షితంగా రేవులో ప్రయాణించడానికి ఇక్కడ ఒక అధునాతన లాక్-గేట్ వ్యవస్థను ఉపయోగించారు.లోథాల్ ఓడరేవును భారతదేశంలోనే మొట్టమొదటి డ్రై డాక్‌గా పరిగణిస్తారు.ఇది సింధు లోయ నాగరికత, అధునాతన ఇంజనీరింగ్ సామర్థ్యాలకు నిదర్శనం.
ఇక లోథాల్ పట్టణ ప్రణాళిక ఎంతో అధునాతనమైనది. నగరం స్పష్టమైన విభాగాలుగా విభజించబడింది. పరిపాలనా అవసరాల కోసం ఒక కోట (సిటాడెల్), నివాస, వాణిజ్య కార్యకలాపాల కోసం దిగువ నగరం (లోయర్ టౌన్) ఉండేవి. నగరంలో సులభమైన రాకపోకలకు, వ్యాపారానికి వీలుగా వీధులన్నీ గ్రిడ్ పద్ధతిలో (సమకోణంలో) నిర్మించబడ్డాయి.
ఓడరేవుకు సమీపంలో పెద్ద గిడ్డంగులు ఉండటం, వస్తువులను విదేశాలకు రవాణా చేయడానికి లేదా స్థానికంగా పంపిణీ చేయడానికి ముందు వాటిని నిల్వ చేసేందుకు ఒక వ్యవస్థీకృత ఏర్పాట్లు ఉన్నాయని సూచిస్తుంది. వస్తువులపై ముద్రలు వేయడానికి ఉపయోగించే సీల్స్ను కనుగొన్నారు.
అక్కడ వాణిజ్య నియంత్రణ, డాక్యుమెంటేషన్ (పత్రాల నిర్వహణ) అధునాతన పద్ధతిని సూచిస్తుంది.
లోథాల్ కేవలం ఒక ఓడరేవు మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యానికి, పారిశ్రామిక నైపుణ్యానికి నిలయం. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తవ్వకాలలో ఇక్కడ లభించిన మరికొన్ని ముఖ్యమైన చారిత్రక ఆధారాలు కూడా బయట పడ్డాయి.
లోథాల్ లో ఒక పెద్ద పూసల తయారీ పరిశ్రమ ఉంది. ఇందులో పూసలను తయారుచేసే పరికరాలు, ముడి పదార్థాలు, ఒక పెద్ద కొలిమి (Kiln) లభించాయి.,ఇక్కడ కార్నెలియన్ (ఎరుపు రంగు రాయి), జాస్పర్, స్టీయటైట్, లాపిస్ లాజులి వంటి విలువైన రాళ్లతో మైక్రో-పూసలను అద్భుతంగా తయారుచేసేవారు.
ఇక్కడ దొరికిన చారిత్రక ఆధారాలలో అత్యంత కీలకమైనవి విదేశీ ముద్రలు. లోథాల్‌లో బహ్రెయిన్,పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి చెందిన వృత్తాకార ముద్రలు దొరికాయి. ఇవి లోథాల్ వ్యాపారులు మెసొపొటేమియాతో నేరుగా సముద్ర వ్యాపారం చేశారనడానికి బలమైన నిదర్శనం.
లోథాల్ శ్మశాన వాటికలో కొన్ని వింతైన సమాధులు లభించాయి. ఒకే సమాధిలో స్త్రీ,పురుషుల అస్థిపంజరాలు దొరికాయి.కొంతమంది చరిత్రకారులు దీనిని ‘సతీసహగమనం’ వంటి ఆచారానికి తొలి రూపంగా భావిస్తే, మరికొందరు ఒకే సమయంలో చనిపోయిన వారిని కలిసి పూడ్చారని నమ్ముతారు.
లోథాల్‌లో దిశలను కొలవడానికి ఉపయోగించే ఒక వినూత్నమైన షెల్ (శంఖం) పరికరం దొరికింది. ఇది అక్షాంశాలను, దిశలను ఎనిమిది భాగాలుగా కొలవడానికి సహాయపడేది. సింధు ప్రజల ఖచ్చితమైన కొలతలకు నిదర్శనంగా ఇక్కడ ఏనుగు దంతంతో చేసిన ఒక చిన్న స్కేల్ దొరికింది. దీనిపై చాలా చిన్న విభాగాలుగా కొలతలు చెక్కబడి ఉన్నాయి.
సింధు లోయ నాగరికతలోని మిగిలిన నగరాల కంటే లోథాల్ భిన్నమైనది. ఇక్కడ మట్టి పాత్రల అవశేషాలలో వరి పొట్టు (Rice Husk) లభించింది. మట్టితో చేసిన చిన్న ఓడలు, పడవల బొమ్మలు ఇక్కడ లభించాయి. ఈ బొమ్మలకు పడవ చుక్కాని (Oars) తెరచాపలను అమర్చే రంధ్రాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి వారు సముద్ర ప్రయాణాలకు ఎలాంటి ఓడలు వాడారో తెలుస్తోంది.
ఈ ఆధారాలన్నీ లోథాల్ కేవలం ఒక సాధారణ గ్రామం కాదని, ఆ కాలంలోనే విదేశీయులతో నిండిన ఒక అంతర్జాతీయ పారిశ్రామిక నగరమని నిరూపిస్తున్నాయి.లోథాల్ వెళితే ఈ విశేషాలను అక్కడ చూడవచ్చు.
లోథాల్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుండి సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. అహ్మదాబాద్ నుండి టాక్సీ లేదా బస్సుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.అక్కడి పురావస్తు మ్యూజియం లో తవ్వకాలలో దొరికిన అరుదైన వస్తువులను భద్రపరిచారు.

