Action drama ……….
‘ముద్దాయి’ (Muddayi).ఇది 1987 నాటి యాక్షన్ డ్రామా మూవీ. సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. శారద,విజయశాంతి, రాధ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
ఈ సినిమా కన్నడ చిత్రం ‘జిమ్మీ గళ్లు’ (1982) కి రీమేక్ కాగా, ఆ తర్వాత ఇదే కథను దర్శకుడు దాస్ హిందీలో ‘muzlim ‘ (1988) గా కూడా రీమేక్ చేశారు..హీరో కృష్ణ నే నిర్మించారు.
కథాంశంఏమిటంటే ?
కథానాయకుడు నాగేంద్ర (కృష్ణ) సమాజంలో ఒక నిజాయితీ గల వ్యక్తి. కానీ విలన్లు (టైగర్ ప్రభాకర్ గ్యాంగ్) కుట్రల వల్ల అతను జైలు కి వెళతాడు.ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయి తన జీవితాన్ని నాశనం చేసిన శత్రువులపై నాగేంద్ర ఎలా పోరాటం చేశాడు? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడు? అనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం.
సూపర్ స్టార్ కృష్ణ తనదైన యాక్షన్ స్టైల్, పవర్‌ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాను వన్-మ్యాన్ షోగా నడిపించారు.విజయశాంతి న్యాయవాదిగా నటనతో మెప్పించగా, రాధ గ్లామర్ తో ప్రేక్షకులను అలరించింది. రాధది చిన్న పాత్ర. ఇక జైలర్ గా శారద బాగా నటించారు. కథలో కీలక పాత్ర ఈ జైలర్ పాత్ర.
సినిమాలో కృష్ణ ఎంట్రీ అభిమానులను అలరిస్తుంది. అగ్నిపర్వతం తర్వాత సూపర్ స్టార్ నటించిన సీరియస్ పాత్ర ఇది.పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ అందించారు. కృష్ణ జైలులో ఉన్నపుడు విజయశాంతి తో, శారద తో మాట్లాడే సీన్స్ ను దాస్ బాగా తీశారు.
విజయ శాంతి బావగా శరత్ బాబు, శారద భర్తగా గిరిబాబు సహాయ పాత్రలలో ఇమిడి పోయారు. కన్నడ ప్రభాకర్ గురించి ఇక చెప్పనక్కర్లేదు. విలనిజం బాగా పండించాడు.సుత్తి వేలు,చిట్టి బాబు కామెడీ సీన్స్ అంతగా ఆకట్టుకోవు.అయినా సినిమా బోర్ కొట్టదు.
ఈ సినిమా కథను మొదట టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు ప్రముఖ హీరోల వద్దకు తీసుకెళ్లారు. అయితే హీరో పాత్రలో ఉన్న నెగెటివ్ షేడ్స్,రివెంజ్ డ్రామా రొటీన్‌గా ఉంటుందేమోనని ఆ ముగ్గురు హీరోలు ఈ సినిమా చేయడానికి నిరాకరించారని అంటారు. మిగిలిన హీరోలు వద్దన్నప్పటికీ, సూపర్ స్టార్ కృష్ణ ఈ కథలోని ఇంటెన్సిటీని, కమర్షియల్ వాల్యూస్‌ను నమ్మారు.
దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ మేకింగ్ స్టైల్‌పై ఉన్న నమ్మకంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేసి ముందుకు వెళ్లారు. అందరూ వద్దనుకున్న ఆ కథే బాక్సాఫీస్ వద్ద ఒక భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. కృష్ణ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఓరియెంటెడ్ హిట్‌గా రికార్డు సృష్టించింది.
ఆ ముగ్గురు హీరోలు శోభన్, చిరంజీవి, బాలకృష్ణ లు.. కాగా అప్పటికే అగ్నిపర్వతం సినిమాలో జమదగ్ని వంటి పవర్ ఫుల్ పాత్రను సృష్టించిన పరుచూరి బ్రదర్స్ ఆ రేంజ్ లోనే నాగేంద్ర పాత్రకు రూపకల్పన చేశారు. KSR దాస్ అంతకుముందే కృష్ణ తో ఎన్నో సంచలన చిత్రాలు తీశారు. సూపర్ స్టార్ బాడీ లాంగ్వేజ్, ఆయన యాక్షన్ స్టైల్ ప్రేక్షకులకు ఎలా చూపిస్తే నచ్చుతుందో దాస్ బాగా తెలుసు.
చేయని నేరానికి జైలుకు వెళ్లిన ఒక సామాన్యుడు, తిరిగొచ్చి పగ తీర్చుకునే క్రమంలో హీరో క్యారెక్టర్‌ను ఆయన ఎలివేట్ చేసిన విధానం థియేటర్లలో ఈలలు వేయించింది.కె.ఎస్.ఆర్. దాస్ ని అప్పట్లో ‘యాక్షన్ డైరెక్టర్’ అని పిలిచేవారు. ఈ సినిమాలో ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ఆయన ఎంతో స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా డిజైన్ చేశారు.
ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో కెమెరా యాంగిల్స్, ఫైటర్స్ కంపోజిషన్ ఆకట్టుకుంటాయి.కథను తెలుగు నేటివిటీకి, కృష్ణ ఇమేజ్‌కు తగ్గట్లుగా మార్పులు చేయడంలో దర్శకుడు వంద శాతం విజయం సాధించారు.
కథనం ఎక్కడా బోర్ కొట్టకుండా పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను, చక్రవర్తి మ్యూజిక్‌ను కథలో పర్ఫెక్ట్‌గా బ్లెండ్ చేస్తూ సినిమా వేగాన్ని తగ్గకుండా చూసుకున్నారు.
ప్రతి ఒక్క పాత్రకు కథలో సరైన ప్రాధాన్యత ఇస్తూ, ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ దెబ్బతినకుండా బ్యాలెన్స్ చేయడంలో దాస్ సీనియారిటీ కనిపిస్తుంది. ఈ చిత్రానికి చక్రవర్తి అందించిన పాటలు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను అలరించే మాస్ బీట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాకు పెద్ద అసెట్‌గా నిలిచాయి.సలీం డాన్స్ డైరెక్షన్ లో సూపర్ స్టార్, విజయ శాంతి, రాధ అభిమానులను అలరించేలా స్టెప్స్ వేశారు.
ఈ సినిమాకు పుష్పాల గోపీకృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. 80ల నాటి సాంకేతిక పరిమితుల మధ్య కూడా, యాక్షన్, ఇంటెన్సిటీని స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించడంలో పుష్పాల కెమెరా పనితనం అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. వడ్డే బాలాజీ రావు ఈ సినిమాను నిర్మించారు. యూట్యూబ్ లో సినిమా ఉంది. ఆసక్తి గలవారు చూడ వచ్చు.

