Bharadwaja Rangavajhala ……..
‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ సినిమా అలంకార్ లో చూసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గాత్రంతో భాగ్యరాజా కనెక్ట్ అయ్యారు. కానీ అంతకు ముందే ‘ప్రియ’ అనే చంద్రమోహన్ చిరంజీవి సినిమా టైటిల్స్ లో ఆయన పేరు చూసా… ఆ సినిమా కథ భాగ్యరాజా దే!నిజానికి తమిళ్ లో భాగ్యరాజా నట దర్శకుడైన తర్వాత తెలుగులో చంద్రమోహన్ కేరియర్ ఊపందుకుంది.
హీరోగా తన తొలిచిత్రం ‘పుదియవార్పుగళ్’ తెలుగు రీమేక్ లో హరిప్రసాద్ హీరో…ఆ తర్వాత ప్రణయగీతం, ప్రియ ,రాధా కళ్యాణం, పెళ్లి చూపులు, సత్యభామ. మూడుముళ్లు ఇలా వరుసగా చంద్రమోహన్ భాగ్యరాజా సినిమాలు చేసారు.
సారథి స్టూడియోస్ తోనూ, నవయుగ తోనూ భాగ్యరాజాకి ప్రత్యేక అనుబంధం ఉండేది.మూడుముళ్లు సినిమా విడుదలై తెలుగులో బాగానే ఆడినా-ఒరిజినల్ తమిళ్ సినిమాను ‘వద్దంటే పెళ్లి’ పేరుతో డబ్ చేసి విడుదల చేసారు .దాన్నీ తెలుగు ప్రేక్షకులు చూసారు.
‘అమ్మాయిలూ ప్రేమించండి’ సినిమా లో చెల్లెళ్ళతో సినిమాకు వచ్చిన అన్నగా తెరమీద వచ్చే శృంగార దృశ్యాల నుంచీ చెల్లెళ్ళ దృష్టి మళ్లించడానికి పడే తిప్పలు భాగ్యరాజాను తల్చుకుంటే గుర్తొచ్చే సన్నివేశం.
అలా ఆయన స్ట్రెయిట్ గా తెలుగు తెర ఎక్కాక చంద్రమోహన్ అదర్వైజ్ బిజీ అయ్యారు.అక్కడనుంచి భాగ్యరాజా డబ్బింగ్ సినిమాలతో జనం కనెక్ట్ అయ్యారు.భాగ్యరాజా టేకింగ్ లో గొప్పతనం ఏమిటంటే-
డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ లో పూర్ణిమ తనను కాదు అనేసిందనుకుని కొండెక్కుతూ ఉంటాడు హీరో!
అతను ఆత్మహత్య చేసుకోడానికి ఆ కొండ ఎక్కుతున్నాడని అందరూ థియేటర్ లో ఉన్న ప్రేక్షకులతో సహా అందరూ అనుకుంటూ ఉండగా ఆ కొండపైన ఓ రోడ్డు ఉంటుంది…దాని మీద నడచి వెళ్ళిపోతూ డంగపోయిన ఆడియన్స్ ను వెక్కిరిస్తాడు.. భాగ్యరాజా.
భాగ్యరాజా తొలిసారి డైలాగ్స్ రాసిన కిలక్కుపోగుంరైల్ లో చిరంజీవి రూమ్మేట్ సుధాకర్ హీరోగా చేశాడు.భాగ్యరాజా తొలిసారి హీరోగా నటించిన పుడియవార్పుగల్ రీమేక్ లో చిరంజీవి మరో రూమ్మేట్ హరిప్రసాద్ హీరోగా చేసాడు.ఇదో కోయిన్సిడెన్స్…భాగ్యరాజా డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ సిన్మా కోసం కరాటే నేర్చుకుంటే చంద్రమోహన్ పెళ్లిచూపులు ఒరిజినల్ కోసం కర్రసాము నేర్చుకున్నాడు.
సామాన్య సినీ ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో భాగ్యరాజ్ సిద్ధ హస్తుడు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో ఆ తరహా చిత్రాలనే ఎక్కువగా తీశారు. నటుడిగానూ, దర్శకుడిగానూ, స్క్రీన్ ప్లే రైటర్‌గా వెండి తెరపై తనదైన ముద్ర వేశారు.
ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని భాగ్యరాజ్‌ను పిలుస్తారు. అటు చిరునవ్వులను పండిస్తూనే.. ఇటు భావోద్వేగాల లోతును చూపగల సత్తా ఉన్న దర్శకుడు. ఇలా భాగ్యరాజ్ అనగానే అనేక విషయాలు గుర్తుకొస్తాయ్.

