రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? (2)

Sharing is Caring...

Bhavanarayana Thota…………

రాజీవ్ హత్య జరిగిన 90 రోజులకు… సరిగ్గా రాజీవ్ పుట్టినరోజైన ఆగస్టు 20 నాడే వాళ్ళు చనిపోవటం యాదృచ్ఛికం. రాజీవ్ హత్య జరిగి ఏడాది పూర్తికావటానికి సరిగ్గా ఒకరోజు ముందు 1992 మే 20న పూనమల్లిలోని టాడా కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. అది ఎంత భారీగా ఉందంటే, వెయ్యిమందికి పైగా సాక్షుల్ని ప్రశ్నించి రికార్డు చేసిన 10 వేల పేజీల వాంగ్మూలాలు, 500 వీడియో కాసెట్లు, లక్షకుపైగా ఫోటోలు జోడించారు.

దాదాపు ఆరేళ్లపాటు విచారణ జరిగిన తరువాత 1998 లో టాడా కోర్టు తీర్పు చెప్పింది. జనవరి 28 న పూనమల్లి జైలు/టాడా కోర్టు వెలుపల వాతావరణం ఉద్విగ్న భరితంగా ఉంది. ఆ రోజు ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించారు. ఒక చిన్న రెస్టారెంట్ ముందు షామియానావేసి రిపోర్టర్లను కూర్చోబెట్టారు.వార్త సీనియర్ రిపోర్టర్ గా ఈ కేసు దర్యాప్తును దగ్గరగా గమనిస్తున్న నేను ఆ రోజు పూనమల్లి వెళ్ళా.

శ్రీపెరంబుదూరు బహిరంగ సభకు వెళ్ళే అరగంట ముందు రాజీవ్ ఆవిష్కరించిన ఇందిరాగాంధీ విగ్రహం అక్కడికి చాలా దగ్గర్లోనే ఉంది. కేసు గురించే మాట్లాడుకుంటూ దాదాపు రెండు గంటలుగా రిపోర్టర్లమ్ అక్కడే ఎదురుచూస్తూ కూర్చున్నాం.

దూరంగా కార్తికేయన్ నడుచుకుంటూ రావటం చూసిన మేమంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాం. ఆయన రాగానే కర్చీఫ్ తో చెమట తుడుచుకుంటూ ఒక్క క్షణం ఆగారు. అందరం ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉండగా “వాయ్ మైయే వెల్లుమ్… ట్రూత్ ఓన్లీ ట్రయంఫ్స్ .. సత్యమేవ జయతే” అని మూడు భాషల్లో చెప్పాక అసలు విషయం చెప్పారు.

మొత్తం 26 మందినీ దోషులుగా కోర్టు నిర్థారించిందని, మరణశిక్ష విధించిందని, మరిన్ని వివరాలతో మరికాసేపట్లో వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. రోజుకు 20 గంటలపాటు కష్టపడి తయారు చేసిన ఛార్జ్ షీట్, దానికి కొనసాగింపుగా సాగిన కోర్టు విచారణ ఇచ్చిన ఫలితంతో ఆయన మొహంలో చాలా పెద్ద రిలీఫ్ కనబడింది.

కానీ ఫోటోగ్రాఫర్లలో ఒకడిగా వచ్చిన శుభాసుందరం కొడుకు అరుణ్ ఈ మాట వినగానే కుప్పకూలిపోయాడు. వాళ్ళ నాన్న విడుదలవుతాడని, నేరుగా ఆయన్ని గుడికి తీసుకెళ్లాలని కొత్త బట్టలు తీసుకుని మరీ వచ్చినవాడికి ఇది శరాఘాతమే మరి. బెల్ట్ బాంబుకు శక్తిమంతమైన బాటరీలు సమకూర్చిన పేరరివళన్ తల్లి అర్బుతం అమ్మాళ్ కూడా తనకొడుకు విడుదలవుతాడని ఎంతో ఆశతో అక్కడికొచ్చింది.

తీర్పు సంగతి తెలియగానే ఆమె కోపంతో ఊగిపోయింది. ఒక్క సారిగా తీర్పు మీద దుమ్మెత్తిపోస్తూ, కత్తికి శిక్ష వేయటం ఎక్కడైనా ఉంటుందా? అని మీడియా ముందు వాపోయింది. అక్కడ తీర్పు చెప్పిన జడ్జ్ కూడా మళ్ళీ ఇలాంటి తీర్పు రాయాల్సిన అవసరం రాకూడదనే అభిప్రాయంతో న్యాయ ప్రక్రియకు అనుగుణంగానే ఆ సంతకం పెట్టిన పెన్ను పాళీ విరిచేశారు.

మరుసటి రోజు చెన్నైలోని సిట్ కేంద్ర కార్యాలయం మల్లిగై లో మీడియాకి లంచ్ ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు తీరు మొత్తం వివరించారు కార్తికేయన్. ఆ తరువాత జస్టిస్ జైన్ కమిషన్, జస్టిస్ వర్మ కమిషన్ నియామకాల వెనుక రాజకీయ కారణాలున్నాయన్నమాట నిజం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అనేక దేశాలు తిరిగినా, వాళ్ళు కార్తికేయన్ కి మించి తేల్చిందేమీ లేదు.

ఈ కేసు దర్యాప్తు తీరు మీద ఇంటర్ పోల్ కి ఇచ్చిన ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఎంతగా ఆకట్టుకుందంటే దీన్నో మోడల్ గా తీసుకుంటున్నట్టు ప్రకటించింది.అయితే,1999 మే 11 నాడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు చెప్పింది. 19 మందిని నిర్దోషులుగా విడుదలచేసింది. నళిని, మురుగన్, శంతన్, పేరరివళన్ తప్ప మిగిలినవారి మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చింది.

మరణశిక్ష పడినవాళ్ళకు క్షమాభిక్ష కోసం ప్రభుత్వం 2000 లో పంపిన పిటిషన్ల మీద రాష్ట్రపతి తిరస్కార నిర్ణయం 11 ఏళ్ల తరువాత వచ్చింది. ఇప్పటికీ పూర్తిగా ఒక కొలిక్కి రాని ఈ వ్యవహారంలో ఈ మధ్యనే పేరరివళన్ ను సుప్రీంకోర్టు విడుదలచేసింది.

ఒక బిడ్డకు తల్లిగా ఉన్న నళిని ని ప్రియాంక గాంధీ జైల్లో కలిసి రావటం, నళినిని క్షమిస్తున్నట్టు సోనియా, రాహుల్, ప్రియాంక ప్రకటించటం తెలిసిందే. దేశంలో 31 ఏళ్ళుగా జైల్లో ఉండిపోయిన మహిళాఖైదీగా ఆమెదొక రికార్డు. జైల్లోనే కూతుర్ని కని పెళ్ళికూడా చేసింది. 1999 లో విడుదలైన కనకసభాపతి స్విట్జర్లాండ్ వెళ్ళిపోయారు.

ఆయన మనవరాలు ఆదిరై తన సహనిందితుడు విక్కీ అలియాస్ విఘ్నేశ్వరన్ ను పెళ్ళిచేసుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడింది. ఈ కేసులో ఏడేళ్ళకు పైగా జైల్లో ఉండి వచ్చిన శుభాసుందరం ఆ తరువాత కొన్నేళ్ళకే చనిపోయాడు. ఫోటో ఏజెన్సీ నడిపిన శుభాసుందరం ఒకప్పుడు పేరుమోసిన ఫొటోగ్రాఫర్. ఆయన తీసిన ఎమ్జీఆర్ ఫోటో ఒకటి కనీసం కోటి కాపీలు వాడి ఉంటారు ఆయన అభిమానులు.

తండ్రి జైల్లో ఉన్నప్పుడు కొడుకు అరుణ్ ఫొటోగ్రాఫర్ గా ఆ కుటుంబానికి అండ అయ్యాడు. అతను కొంతకాలం ఎన్డీటీవీకి పని చేశాక ఇప్పుడు టీవీ18 లో ఉన్నాడు.2010 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న దేవరాయపురం రామస్వామి కార్తికేయన్ కోయంబత్తూర్ దగ్గర సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు.

చదువుకున్న తరువాత కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. ఆ తరువాతే సివిల్స్ కు ఎంపికై సిబిఐ చీఫ్ దాకా రకరకాల హోదాల్లో పనిచేశారు. రాజీవ్ కేసు దర్యాప్తు సమయంలో భార్యకు గుండెపోటు వచ్చినా ఏమాత్రం తొణకాలేదాయన.

ఇప్పుడు 83 ఏళ్ల వయసులో ఢిల్లీలో స్థిరపడి మెడిటేషన్, ఆహారం, యోగా లాంటి విషయాలు అధ్యయనం చేస్తూ పుస్తక రచనలో నిమగ్నమయ్యారు. హెచ్ ఎం టీవీ (అప్పట్లో టి చానల్) తొలిరోజుల్లో ఎమెస్కో ఆఫీసులో చివరిసారిగా ఆయనతో చిన్న ఇంటర్వ్యూ కూడా చేశాం.

Pl..Read it also ……రాజీవ్ హత్యకేసును కార్తికేయన్ ఎలా ఛేదించారు? (1)

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!