Attacks …
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులపై దాడులకు తెగబడుతున్న పిల్లల కథనాలు వార్తల్లో చాలానే వస్తున్నాయి. మంచి చెప్పి , క్రమశిక్షణతో పెంచాలనుకునే తల్లిదండ్రులపైనే పిల్లలు ప్రాణాంతక దాడులకు తెగబడతున్నారు.
సమాజంలో విలువల పతనం ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి ఇలాంటి ఉదంతాలే నిదర్శనం. కొంతమంది పిల్లలైతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లల్లో ఇలాంటి మార్పుకు అనేక మానసిక, సామాజిక, సాంకేతిక కారణాలు ఉన్నాయి.
విపరీతమైన కోపం, అసహనం
ప్రస్తుత తరం పిల్లల్లో సహనం చాలా తగ్గిపోయింది. తల్లిదండ్రులు ఏదైనా సందర్భంలో ఇది తప్పు అని మందలించినప్పుడు లేదా నచ్చని విషయం చెప్పినప్పుడు, వారు దాన్ని ఒక సలహాగా తీసుకోలేకపోతున్నారు. తీవ్రమైన కోపానికి (Impulse Control Issue) లోనై, ఏం చేస్తున్నామో తెలియని క్షణికావేశంలో హత్యాకాండకు ఒడిగడుతున్నారు.
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వ్యసనం
పబ్‌జీ (PUBG), ఫ్రీ ఫైర్ వంటి హింసాత్మక గేములకు బానిసలైన పిల్లలు, వాటిని ఆడకుండా తల్లిదండ్రులు ఫోన్ లాక్కుంటే లేదా ఇంటర్నెట్ బంద్ చేస్తే వారిని శత్రువులుగా చూస్తున్నారు. ఫోన్ ఇవ్వలేదనే కోపంతో తల్లులను చంపిన ఘటనలు ఇటీవల దేశంలో చాలా జరిగాయి.అలాగే సోషల్ మీడియాలో చూసే విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి, డబ్బుల కోసం లేదా బైక్, ఖరీదైన ఫోన్లు కొనివ్వలేదని కన్నవారిపై కక్ష పెంచుకుంటున్నారు.
చెడు అలవాట్లు, డ్రగ్స్ బానిసత్వం
గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసలైన యువకులు.. వాటిని కొనడానికి డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధిస్తున్నారు. వారు ఇవ్వడానికి నిరాకరించినా లేదా ఆ వ్యసనాల నుంచి దూరం చేయడానికి గట్టిగా మందలించినా, మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా కన్నవారిని అంతమొందిస్తున్నారు.
స్వేచ్ఛను అడ్డుకుంటున్నారనే అపోహ
తల్లిదండ్రులకు ఇష్టం లేని ప్రేమ వ్యవహారాలు, లేదా తప్పుడు స్నేహాలను వారు వద్దని వారించినప్పుడు, తమ “వ్యక్తిగత స్వేచ్ఛకు” వారు అడ్డుపడుతున్నారని పిల్లలు భావిస్తున్నారు. కొందరు పిల్లలు నేరపూరితమైన లేదా చట్టవిరుద్ధమైన పనులకు అలవాటుపడినప్పుడు, ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని ప్రశ్నిస్తే తమ రహస్యాలు బయటపడతాయనే భయంతో వారిని చంపడానికి కూడా వెనకాడటం లేదు.
పెంపకంలో లోపాలు, ఒంటరితనం
చిన్నప్పటి నుంచి పిల్లలు అడిగినవల్లా సమకూర్చడం వల్ల, వారికి ‘నో’ (వద్దు) అనే మాట వినడం అలవాటు అవ్వడం లేదు. హఠాత్తుగా పెద్దయ్యాక తల్లిదండ్రులు నియంత్రించాలని చూస్తే దాన్ని భరించలేకపోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, ఒంటరి గా పెరగడం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ లోపించి, మానసిక ఒత్తిడి తీవ్రమవుతోంది.
నివారణ మార్గాలు
పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో పాటు, అన్ని కోరికలు తీరవు అనే నిజాన్ని నేర్పించాలి.పిల్లలతో కఠినంగా కాకుండా, వారి మనసును అర్థం చేసుకునేలా స్నేహపూర్వకంగా మాట్లాడాలి. పిల్లల ప్రవర్తనలో విపరీతమైన కోపం, మొండితనం గమనిస్తే వెంటనే మానసిక నిపుణుల (Psychiatrists) సహాయం తీసుకోవడం ఉత్తమం. సమస్య ముదిరే వరకు కూర్చుంటే ముందు ముందు పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.

