Holy river baths……….
ప్రస్తుతం సరస్వతి నది కి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. 2026 మే 21 నుంచి జూన్ 1 వరకు ఈ సరస్వతి అంత్య పుష్కర మహోత్సవాలు వైభవంగా సాగుతాయి.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావచ్చని భావిస్తున్నారు.
అంత్య పుష్కరాలు అంటే?
హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఒక నదికి పుష్కరాలు అనేవి మొత్తం సంవత్సరం (365 రోజులు) పాటు ఉంటాయి. బృహస్పతి (గురు గ్రహం) ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కాలంలో మొదటి, చివరి రోజులు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి.
ఆది పుష్కరాలు: గురు గ్రహం నిర్దేశిత రాశిలోకి ప్రవేశించిన మొదటి 12 రోజులను ‘ఆది పుష్కరాలు’ అంటారు. సరస్వతి నదికి ఆది పుష్కరాలు గత ఏడాది (2025 మే 15 నుండి మే 26 వరకు) జరిగాయి.
అంత్య పుష్కరాలు: గురు గ్రహం ఆ రాశిని వీడి, తదుపరి రాశిలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే చివరి 12 రోజులను ‘అంత్య పుష్కరాలు’ అంటారు. ప్రస్తుతం జరుగుతున్నవి ఈ చివరి 12 రోజుల వేడుకలే.
మధ్యలో ఉండే కాలం కంటే ఈ మొదటి 12 రోజులు (ఆది), చివరి 12 రోజులు (అంత్య) పుష్కరుడు, సప్తర్షులు, సమస్త దేవతలు ఆ నదీ జలాలలో సూక్ష్మ రూపంలో నివసిస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రెండు సమయాల్లో నదీ స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది.
నదిలో పవిత్ర స్నానం ఆచరించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.ఈ ముగింపు రోజులలో పితృ దేవతలకు పిండ ప్రదానం, తర్పణాలు వదలడం వల్ల వారికి ఉత్తమ గతులు లభిస్తాయి.
అంత్య పుష్కరాల చివరి రోజులలో వస్త్ర, అన్న, ముఖ్యంగా నువ్వుల (తిల) దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
దేశంలో ఈ అంత్య పుష్కరాలు జరుగుతున్న ముఖ్య ప్రాంతాలు
1. మానా గ్రామం (ఉత్తరాఖండ్)హిమాలయాల్లోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉండే మానా గ్రామం (Mana Village) వద్ద సరస్వతి నది భూమిపై స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచే నది అంతర్వాహినిగా మారుతుందని పురాణాల కథనం.ఉత్తరాది భక్తులు, సాధువులు ఈ హిమాలయ తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఈ ప్రాంతాన్ని ముఖ్య వేదికగా ఎంచుకుంటారు.
2. త్రివేణి సంగమం – ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) వద్ద గంగ, యమున నదులతో పాటు సరస్వతి నది అంతర్వాహినిగా కలిసి త్రివేణి సంగమంగా మారుతుంది.ఈ సంగమ క్షేత్రంలో పుష్కర స్నానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ పితృ తర్పణాలకు విశేష ప్రాధాన్యత ఇస్తారు.
3. పుష్కర్ సరస్సు (రాజస్థాన్) ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మదేవుని ఆలయం రాజస్థాన్‌లోని పుష్కర్ లో ఉంది. ఇక్కడ ప్రవహించే ప్రాచీన సరస్వతి నది అవశేషంగా ఈ పవిత్ర సరస్సును భావిస్తారు. బృహస్పతి మిథున రాశిలో ఉన్న ఈ సమయంలో ఈ పుణ్య సరస్సులో స్నానం ఆచరించడం ద్వారా పాప పరిహారం జరుగుతుందని ఉత్తర భారతదేశ భక్తుల నమ్మకం.
4. సిద్ధ్‌పూర్ (గుజరాత్) గుజరాత్‌లోని సిద్ధ్‌పూర్ గుండా సరస్వతి నది ప్రవహిస్తుంది. దీనిని ‘మాతృ గయ’ అని పిలుస్తారు.ఇక్కడ పుష్కరాల సమయంలో మాతృ తర్పణాలు చేయడానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు.
5 కాళేశ్వరంలో (తెలంగాణ ) ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద ఈ అంత్య పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు ఈ సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కలిసి త్రివేణి సంగమంగా మారుతుందని అంటారు.
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించడంపై కొంతమంది పండితులు, జ్యోతిష్యులు, చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది సరస్వతి నదికి సంబంధం లేని ప్రదేశమని వారు వాదిస్తారు. కేవలం ఆధ్యాత్మిక నమ్మకం (అంతర్వాహిని) ఆధారంగా, కంటికి కనిపించని నదికి పుష్కరాలు ఎలా నిర్వహిస్తారని కొందరు ప్రశ్నిస్తారు. నది ఉన్న చోట మాత్రమే పుష్కరాలు జరపాలని వారి వాదన.

