మంచి మనసున్న నటుడు ఈ సూరి !!

Sharing is Caring...

Sense of Service ……………..

తమిళ నటుడు సూరి వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి చెంత ఆయన నిర్వహిస్తున్న ‘అమ్మన్ రెస్టారెంట్’ నేడు వేలాది మంది పేదల పాలిట అన్నపూర్ణగా మారింది.

పసియార వాంగ (ఆకలి తీర్చుకోవడానికి రండి): “ఆకలితో ఉన్నవాడు అడగకూడదు.. ఆత్మీయంగా వచ్చి తినాలి” అనే గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ భోజనానికి రేట్ కార్డు ఉండదు. తిన్నవారు తమ మనసుకి నచ్చినంత, స్తోమతకు తగ్గట్టుగా (₹10 లేదా ₹50) అక్కడ ఉన్న బాక్స్‌లో వేయవచ్చు.

జేబులో చిల్లిగవ్వ లేకపోయినా పర్వాలేదు.. కడుపు నిండా భోజనం పెట్టి, ఎంతో మర్యాదగా సాగనంపుతారు. ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు, దిక్కులేని నిరుపేదలు ఆకలితో అలమటించకూడదనే  సంకల్పంతో సూరి చేపట్టిన ఈసేవా కార్యక్రమం తమిళనాడు వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 

ఈ అన్నదాన సేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. సూరి తండ్రి జ్ఞాపకార్థం, తన తల్లిపై ఉన్న ప్రేమతో ఈ సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా కేవలం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలనేది సూరి  ఉద్దేశ్యం.

ఇక ఆయన హోటల్ గురించి చెప్పుకోవాలంటే………………….

సూరి తన సొంత ఊరైన మదురైలో మొదట ఈ హోటల్‌ను ప్రారంభించారు. ఇప్పుడు మదురైలోని వివిధ ప్రాంతాల్లో (తెప్పకుళం, అన్నానగర్, కామరాజర్ శాలై వంటి చోట్ల) దీనికి శాఖలు ఉన్నాయి. ఇది ప్రధానంగా వెజిటేరియన్ హోటల్. ఇక్కడి భోజనం,టిఫిన్లు మదురైలో చాలా ఫేమస్.

మదురైలో మంచి సక్సెస్ సాధించిన తర్వాత, ఆయన మరిన్ని నగరాల్లో కూడా శాఖలను ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే ఆయన తన హోటల్ వ్యాపారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుంటారు.

సూరి మదురై నుండి చెన్నైకి వచ్చినప్పుడు తిండికి కూడా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 10-15 ఏళ్ల పాటు చిన్న చిన్న పాత్రల్లో, గుంపులో ఒకడిగా నటించారు. ‘సంగమం’, ‘జేజే’ వంటి సినిమాల్లో ఆయనను మనం గమనించవచ్చు.

వెన్నెలైట్ 2009… ఈ సినిమా సూరి జీవితాన్ని మార్చేసింది. ఇందులో ఆయన చేసిన ‘పరోటా కాంపిటీషన్’ కామెడీ సీన్ విపరీతమైన పాపులారిటీ తెచ్చింది. అప్పటి నుండి ఆయనను అందరూ ‘పరోటా సూరి’ అని పిలవడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత రజనీకాంత్ (అన్నాత్తే), విజయ్ (వేలాయుధం), అజిత్ (వేదాళం), సూర్య (అంజాన్), శివకార్తికేయన్ (వరుతపడాత వాలిబర్ సంగం) వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించి టాప్ కమెడియన్‌గా ఎదిగారు. ముఖ్యంగా శివకార్తికేయన్ – సూరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేది.

దర్శకుడు వెట్రిమారన్ ‘విడుదలై’ (Viduthalai) సినిమాతో సూరిని హీరోగా పరిచయం చేశారు. ఒక అమాయకపు కానిస్టేబుల్ పాత్రలో ఆయన నటన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కామెడీ మాత్రమే కాదు, సీరియస్ రోల్స్ కూడా అద్భుతంగా చేయగలనని ఆయన నిరూపించుకున్నారు.

గరుడన్ (2024) హీరోగా ఆయన చేసిన రెండో సినిమా ‘గరుడన్’ కూడా కమర్షియల్‌గా పెద్ద హిట్ సాధించింది. దీనితో ఆయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు, ఒక మినిమం గ్యారెంటీ ఉన్న హీరోగా స్థిరపడ్డారు.
ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో ఆయన నటిస్తున్నాడు. 

సూరి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. “నేను ఎప్పుడూ నా కష్టాన్ని నమ్ముకున్నాను, సినిమా నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది” అని భావోద్వేగానికి గురయ్యారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!