Trying her luck …….
తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళ్ సై గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళనాడు ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ ఏడో సారి ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె, “ప్రజలకు సేవ చేసేందుకే రాజభవన్ సౌకర్యాలను వదులుకున్నాను” అంటూ ఎన్నికల బరిలోకి దిగారు.
గత ఎన్నికల చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆమె మైలాపూర్ గడ్డపై చెమటోడుస్తున్నారు.ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.తమిళిసై సౌందరరాజన్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించలేదు.
గతంలో ఆమె ఆరు సార్లు పోటీ చేస్తే … అన్ని చోట్ల పరాజయమే దక్కింది. అయినా పట్టు వదలని విక్రమార్కుని చెల్లి గా వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇన్నిసార్లు బీజేపీ టిక్కెట్ ఇవ్వడం కూడా గొప్ప విషయమే.
@2006 అసెంబ్లీ (రాధాపురం): మొదటిసారి పోటీ చేసి నాలుగో స్థానంలో నిలిచారు.అప్పట్లో ఆమెకు 5,343 ఓట్లు వచ్చాయి.
@2009 లోక్‌సభ (చెన్నై నార్త్): ఎంపీగా పోటీ చేసినా విజయం వరించలేదు. 23,350 ఓట్లు వచ్చాయి.
@2011 అసెంబ్లీ (వేలచ్చేరి): మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 7,048 ఓట్లు పడ్డాయి .
@2016 అసెంబ్లీ (విరుగంబాక్కం): మళ్లీ మూడో స్థానంలో నిలిచారు. 19,167 ఓట్లు వచ్చాయి ..
@2019 లోక్‌సభ (తూత్తుకుడి): డీఎంకే అగ్రనేత కనిమొళిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 215,934 ఓట్లు వచ్చాయి.
@2024 లోక్‌సభ (చెన్నై సౌత్): గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 290,683 ఓట్లు వచ్చాయి. . ఒక నియోజక వర్గానికే పరిమితం కాకుండా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయడం మైనస్ పాయింట్ గా మారింది .
తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మైలాపూర్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గతంలోని ఓటములను వివరిస్తూనే, తన అనుభవాన్ని నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తానని చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆమె రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో వడలు తింటూ స్థానికులతో మమేకమవుతున్నారు. స్థానిక డీఎంకే ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండరని, తాను గెలిస్తే నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని ఆమె హామీ ఇస్తున్నారు.
అన్నాడీఎంకే (AIADMK) తో పొత్తులో ఉండటం ఈమెకు అతిపెద్ద బలం. అన్నాడీఎంకే ఓట్లు పూర్తిగా ఈమెకు బదిలీ అయితే గెలుపుకు దగ్గరయ్యే అవకాశం ఉంది. విద్యావంతులు, పట్టణ ఓటర్లలో బీజేపీకి ఉన్న ఆదరణ ఈమెకు కలిసిరావచ్చు. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఆమె విజయం సాధించకపోవడం ఒక బలహీనతగా కనిపిస్తోంది.
అలాగే, నియోజకవర్గంలోని బ్రాహ్మణ ఓట్లు ఇతర పార్టీలకు (TVK, NTK) చీలిపోతే ఆమెకు గెలుపు కష్టతరం కావచ్చు. అన్నా డీఎంకే కార్యకర్తలు అంత చురుగ్గా పనిచేయడం లేదని అంటున్నారు. నటుడు విజయ్ పార్టీ అభ్యర్థి పి. వెంకటరమణన్ బ్రాహ్మణ ఓట్లు,యువత ఓట్లు ఆకర్షించే అవకాశాలున్నాయి. ఈయన ఎంత ఎక్కువ ఓట్లు చీల్చితే, అది ప్రధాన పార్టీలైన డీఎంకే, బీజేపీ అభ్యర్థుల గెలుపు ని అంతగా ప్రభావితం చేస్తుంది
మైలాపూర్‌లో డీఎంకే సిట్టింగ్అభ్యర్థి ధా వేలు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.

