Dwaraka Peetham …………
పశ్చిమ్నాయ శ్రీ శారదా పీఠం (ద్వారకా పీఠం) ఆదిశంకరాచార్యుల వారు భారతదేశానికి పశ్చిమ దిక్కున, గుజరాత్లోని ద్వారకలో స్థాపించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది సనాతన ధర్మ ప్రచారానికి, అద్వైత వేదాంత సంరక్షణ కోసం పని చేస్తున్నది.
దీనిని కాళికా మఠం అని కూడా పిలుస్తారు. ఈ మఠం సామవేదానికి ప్రాధాన్యతనిస్తుంది.ఇక్కడ అనుసరించే వేదాంత మంత్రం “తత్త్వమసి” (అదే నీవు). ప్రస్తుతం జగద్గురు శంకరాచార్య స్వామి శ్రీ సదానంద సరస్వతి ఈ పీఠానికి అధిపతిగా ఉన్నారు. వీరు 2022లో స్వామి స్వరూపానంద సరస్వతి తర్వాత బాధ్యతలు స్వీకరించారు.
ఇది ప్రసిద్ధ ద్వారకాధీశ ఆలయానికి (జగత్ మందిర్) అతి సమీపంలో, గోమతీ నది ఒడ్డున ఉంది. ఈ పీఠం పురాతన కాలం నుండి సంస్కృత భాష, వేదాలు, హిందూ సంస్కృతిని పరిరక్షించే గొప్ప విద్యా కేంద్రంగా కొనసాగుతోంది. మఠం గోడలపై ఆదిశంకరాచార్యుల జీవిత చరిత్రను తెలిపే అందమైన చిత్రపటాలు, అద్వైత తత్వానికి సంబంధించిన శిల్పాలు చూడవచ్చు.
ద్వారకలోని శ్రీ శారదా పీఠం కేవలం ఒక మఠం మాత్రమే కాదు,ఇది అనేక ఆధ్యాత్మిక ,విద్యా కార్యక్రమాలకు నిలయం. శారదా దేవికి ఇక్కడ ప్రత్యేక మందిరం ఉంది..ఇక్కడ ప్రతిరోజూ చంద్రమౌళీశ్వర శివలింగానికి పీఠాధిపతులు స్వయంగా పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఈ నిత్య ఆరాధనను, హారతిని సందర్శించవచ్చు.
పీఠానికి సమీపంలోనే శంకరాచార్యుల ఆరాధ్య దైవం భద్రకాళి మాత ఆలయం ఉంటుంది.సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా ఇక్కడ సామవేద పారాయణం,శిక్షణ ఇచ్చే పాఠశాలలు ఉన్నాయి. పీఠం ఆధ్వర్యంలో సంస్కృత అకాడమీ, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలు, పరిశోధనా సంస్థలు నడపబడుతున్నాయి.
ద్వారకాధీశ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు పీఠం ద్వారా ఉచితంగా ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. శారదా నవరాత్రులు, శంకర జయంతి, వ్యాస పౌర్ణమి వంటి సందర్భాల్లో ఇక్కడ విశేష పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయి.
ద్వారకాధీశ ఆలయం (జగత్ మందిర్) నిర్వహణ, పర్యవేక్షణలో శారదా పీఠం కీలక పాత్ర పోషిస్తుంది. పీఠాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మ్యూజియంను కూడా చూడవచ్చు. అందులో హిందూ సంస్కృతి, శంకరాచార్యుల చరిత్రకు సంబంధించిన అనేక అరుదైన వస్తువులు ఉన్నాయి.
పీఠం సాధారణంగా ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, తిరిగి సాయంత్రం 4:00 నుండి రాత్రి 9:00 వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది.అక్కడకు వెళ్లాలని అనుకుంటే అక్టోబర్ నుండి మార్చి వరకు సందర్శించడానికి అనువైన సమయం. కృష్ణ జన్మాష్టమి వంటి పండుగ సమయాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. ద్వారకలో వసతి సౌకర్యాలకు ఇబ్బంది లేదు .

