ఏడు శిఖరాల నడుమ కొలువైన సప్తశృంగి మాత!!

Sharing is Caring...

One of the 51 Shakti Peethas …….

ఈ సప్త శృంగి మాత ఆలయం భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి శరీర భాగాలలో ఆమె కుడి చేయి ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని ప్రసిద్ధ “మూడున్నర శక్తి పీఠాల”లో ఇది అర్థ (సగం) శక్తి పీఠంగా విశిష్టత పొందింది.

సప్త శృంగి మాత ఆలయం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న వణి (Vani) సమీపంలోని నందూరి గ్రామంలో ఉంది. ఈ ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి సుమారు 4,659 అడుగుల ఎత్తులో, ఏడు కొండ శిఖరాల (సప్త శృంగాలు) మధ్య కొలువై ఉంది.

ఇక్కడి అమ్మవారి విగ్రహం సుమారు 8 నుండి 10 అడుగుల ఎత్తులో ఉండి, 18 చేతులతో (అష్టాదశ భుజ దేవి) వివిధ ఆయుధాలను ధరించి ఉంటుంది. విగ్రహం పూర్తిగా సింధూర వర్ణంలో ఉండి, స్వయంభువుగా వెలసిందని నమ్ముతారు.ఈ ఆలయం సుమారు 1,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చరిత్రకారులు చెబుతారు.

దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని అమ్మవారు ఇక్కడే సంహరించారని భక్తుల నమ్మకం. కొండ దిగువన రాతితో చేసిన మహిషాసురుని తల ఆకారం ఇప్పటికీ కనిపిస్తుంది.మార్కండేయ మహర్షి ఇక్కడ తపస్సు చేసి “దేవి మాహాత్మ్యం” (దుర్గా సప్తశతి) గ్రంథాన్ని రచించారని ప్రతీతి. ఆయన పారాయణం వినడానికి అమ్మవారు తన చెవిని వాల్చి విన్నారట, అందుకే ఇక్కడి విగ్రహం ఒక వైపునకు వంగినట్లు ఉంటుంది.

సంతానం లేని వారు, వివాహం కాని వారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు అమ్మవారిని దర్శించుకుంటే ఉపశమనం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.భక్తులు తమ కోర్కెలు నెరవేరిన తర్వాత అమ్మవారికి పట్టుచీర సమర్పించి, ‘ఒడి బియ్యం’ పోసి మొక్కులు చెల్లించుకుంటారు. నాసిక్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేల మంది భక్తులు కాలినడకన కొండపైకి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

గర్భాలయానికి చేరుకోవడానికి భక్తులు 510 మెట్లు ఎక్కాలి. ప్రస్తుతం వృద్ధులు,వికలాంగుల సౌకర్యార్థం రోప్‌వే (ఫ్యూనిక్యులర్ ట్రాలీ) సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. నందూరి  గ్రామం దాటిన తర్వాత, కొండ పైకి వెళ్లే మార్గంలో రోప్‌వే బేస్ స్టేషన్ ఉంది. అక్కడ రోప్ వే ట్రాలీ ఎక్క వచ్చు. 

సోమవారం నుండి శుక్రవారం వరకు రద్దీ తక్కువగా ఉంటుంది. గంట రెండు గంటల్లో దర్శనం పూర్తి చేసుకోవచ్చు.శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. దర్శనానికి 3 నుండి 5 గంటల సమయం పట్టవచ్చు.

మార్కండేయ పర్వతం: సప్తశృంగి ఆలయానికి ఎదురుగా ఉండే ఈ కొండపై మార్కండేయ మహర్షి తపస్సు చేశారని నమ్ముతారు. ఇక్కడి నుండి లోయల అందాలను చూడవచ్చు. ఆలయానికి సమీపంలో ఉన్న శివాలయ కుండ్ పవిత్రమైన స్నానఘట్టం లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

నాసిక్ నుండి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా సులభంగా ఇక్కడికి చేరుకోవచ్చు. నవరాత్రులు, పౌర్ణమి సమయాల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!