ఆ చిత్రరాజానికి 75 ఏళ్ళు !!

Sharing is Caring...

Excellent fantasy movie……………

విజయా పిక్చర్స్ నిర్మించిన ‘పాతాళభైరవి’ (1951 ) విడుదల అయి మార్చి 15 వ తేదీకి 75 ఏళ్ళు అవుతుంది.  ఇపుడు సినిమాను చూసినా ఫ్రెష్ గానే ఫీల్ అవుతాం..అలాంటి ఫీల్ గుడ్ మూవీ అది. అప్పట్లో ఈ సినిమా  ఘన విజయం సాధించింది. 28 కేంద్రాలలో శతదినోత్సవం జరువుకుంది.కొన్ని కేంద్రాలలో 200 రోజులు నడిచింది. తెలుగులో అన్ని రోజులు ఆడిన మొదటి సినిమా  కూడా ఇదే కావడం విశేషం.

ఎన్టీఆర్ కి ఇది ఆరో సినిమా.ఈ సినిమా విజయం సాధించడంతో ఎన్టీఆర్ కు వరుసగా హీరో గా ఎన్నో అవకాశాలు వచ్చాయి. అప్పటికే అక్కినేని జానపద సినిమాల్లో  హీరో గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తోట రాముడి పాత్ర కోసం తొలుత దర్శకుడు కేవీ రెడ్డి అక్కినేని నాగేశ్వరరావుని అనుకున్నారు. అలాగే మాంత్రికుడి పాత్రకు ముక్కామల లేదా గోవిందరాజుల సుబ్బారావులను తీసుకోవాలని భావించారు.

కేవీ రెడ్డి ఒక రోజు  ‘సంసారం’ (1950) సినిమా సెట్స్‌లో ఎన్టీఆర్‌ను చూసి ఆయన రూపం తోట రాముడి పాత్రకు సరిగ్గా సరిపోతుందని  భావించారు.ఒక సీన్ లో ఆయన కళ్లలో కనిపించిన  తీక్షణత కేవీ రెడ్డికి బాగా నచ్చింది. తోట రాముడి పాత్రలో ఉండాల్సిన సాహసం,అమాయకత్వం రెండూ ఎన్టీఆర్‌లో కనిపించడంతో ఆయనను ఫైనల్ చేశారు. అలాగే మాంత్రికుడి పాత్రకు అప్పటికి పెద్దగా ఇమేజ్ లేని ఎస్వీ రంగారావును తీసుకుంటే బాగుంటుందని కేవీ రెడ్డి నిర్ణయించుకున్నారు.

ఈ మార్పులే సినిమాకు అతిపెద్ద ప్లస్ అయ్యాయి. ఎన్టీఆర్ ఈ సినిమాతో  సూపర్ స్టార్‌గా మారిపోయారు. ఇది ఆయనకు విజయ ప్రొడక్షన్స్‌తో ఉన్న నాలుగు సినిమాల ఒప్పందంలో భాగంగా వచ్చిన అవకాశం. అక్కినేని అప్పటికే స్టార్ హీరోగా ఉన్నప్పటికీ, ఈ జానపద వీరుడి పాత్ర మాత్రం ఎన్టీఆర్ కోసమే పుట్టినట్లుగా ఆయనను వరించింది.

ఇక ఈ సినిమా కథను పింగళి వారు రాశారు.కాశీ మజిలీ కథలను స్ఫూర్తిగా తీసుకుని పింగళి వారు రచన చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. చూసినవాళ్ళే మళ్ళీ మళ్ళీ చూసారు. ఇప్పటికి చూస్తుంటారు. అప్పట్లో  నిర్మాతలు సాహసం చేశారు కాబట్టే ఈ సినిమా మన ముందుకు వచ్చింది. తెలుగు లో దీన్నికొట్టిన ఫాంటసీ మరొకటి లేదు. కొన్ని సినిమాలు వచ్చాయి కానీ ‘పాతాళ భైరవి’ స్థాయిలో అవి లేవు. ఆ స్థాయిలో హిట్ కూడా కాలేదు

అప్పట్లో సాంకేతికత తక్కువగా ఉన్నా మార్కస్ బార్ట్లేచూపిన సృజనాత్మకత అద్భుతం అని చెప్పుకోవాలి. గ్రాఫిక్స్ లేని ఆ కాలంలో, కేవలం లెన్స్‌లు, లైటింగ్, ట్రిక్ ఫొటోగ్రఫీతో మాయల ఫకీరు గుహను, పాతాళభైరవి విగ్రహాన్నిఅద్భుతంగా తెరకెక్కించారు.దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా కథ ను బారాట్లే అద్భుత దృశ్యకావ్యంగా మలిచారు.

తోట రాముడి పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా మాయల ఫకీరు ఆయన్ని బలి ఇవ్వడానికి తీసుకెళ్లే సన్నివేశాల్లో, ఎన్టీఆర్  ఒక అమాయకుడిలా కనిపించడం కోసం చాలా ప్రాక్టీస్ చేశారు.ఎస్వీఆర్ ‘ నేపాళ మాంత్రికుడి’ ఆహార్యం అద్భుతంగా కుదిరింది. ఎస్వీ రంగారావు  మేకప్ కోసం గంటల సమయం పట్టేది. ఆయన గడ్డం, వింతైన దుస్తులు ఆ పాత్రకు ఒక గాంభీర్యాన్ని తెచ్చాయి. ఆయన చెప్పే “సాహసం చేయరా డింభకా” అనే డైలాగ్ డెలివరీ కోసం కేవీ రెడ్డి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

పాతాళ భైరవి’ ని అప్పట్లో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. రెండిట్లో ఎన్టీఆరే హీరో. తెలుగులో మార్చి 15 న , తమిళంలో  మే 17 న విడుదలైంది. ఘంటసాల మాస్టారి సంగీతం గురించి ఇక చెప్పనక్కర్లేదు. ‘కలవరమాయే మదిలో’ , ‘ప్రేమకోసం వలలో పడెనే పాపం పసివాడు’,’వినవే బాలా నా ప్రేమ గోలా’, ‘వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు’ వంటి పాటలు ఇప్పటికి అక్కడక్కడా వినిపిస్తుంటాయి.

ఈ సినిమా హీరోయిన్ మాలతీ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ తల్లి పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రేలంగి పోషించిన రాజుగారి బావమరిది పాత్ర తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత వినోదాత్మకమైన పాత్రల్లో ఒకటి. అతి తెలివితేటలు ప్రదర్శిస్తూ, అసమర్థుడైనప్పటికీ తనను తాను గొప్ప వీరుడిగా ఊహించుకునే “సరదా విలన్” తరహా పాత్ర ఇది. రేలంగి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు.ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఇదొకటి.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!