ట్రంప్ దొరా..ఆ పిల్లల కళ్లలోకి చూడండి !!

Sharing is Caring...

Look into those children’s eyes…………….

“ట్రంప్… ఆ పిల్లల కళ్లలోకి చూడు” అనే శీర్షికతో  ‘టెహ్రాన్ టైమ్స్’ రాసిన కథనం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అబద్ధపు ప్రకటనలు చేస్తూ , దౌత్య పరిష్కారాలను తిరస్కరించడం ద్వారా దాడి బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఆ పత్రిక ఆరోపిస్తోంది.

మినాబ్‌లోని పాఠశాలపై జరిగిన దాడికి ఇరాన్ కారణమని ట్రంప్ ఆరోపించగా, అమెరికా సైన్యమే బాధ్యత వహించే అవకాశం ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ అంటోంది. ఈ విషయాలను కూడా ‘టెహ్రాన్ టైమ్స్’ ప్రస్తావించింది.  

‘న్యూయార్క్ టైమ్స్’  పరిశోధనాత్మక కథనంలో ఈ విషాదంపై సంచలన విషయాలను వెల్లడించింది.
మినాబ్‌లోని ప్రాథమిక పాఠశాల పై జరిగిన ప్రాణాంతక దాడికి అమెరికా సైన్యమే (US Military) బాధ్యత వహించే అవకాశం ఎక్కువగా ఉందని ‘న్యూయార్క్ టైమ్స్’ తన దర్యాప్తులో నిర్ధారించింది. అటు ఇజ్రాయెల్ గానీ, ఇటు అమెరికా గానీ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ ఘటనకు ఇరాన్ దే బాధ్యత అని ఆరోపించారు. ఇరాన్ వద్ద ఉన్న మందుగుండు సామాగ్రికి అస్సలు ఖచ్చితత్వం (Accuracy) లేదని, వారి సొంత తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

న్యూయార్క్ టైమ్స్, బెల్లింగ్‌క్యాట్ (Bellingcat) వంటి సంస్థల విశ్లేషణ ప్రకారం.. ఈ దాడిలో ఉపయోగించింది ‘టోమాహాక్ క్రూయిజ్ మిస్సైల్’ (Tomahawk cruise missile) అని గుర్తించారు. ఇది అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆయుధం. ఇరాన్ అధికారులు ఈ దాడిలో 150 మందికి పైగా మరణించారని చెబుతుండగా, క్షేత్రస్థాయిలో అందుతున్న వివరాల ప్రకారం ఈ సంఖ్య 165 దాటిందని, అందులో అత్యధికులు చిన్నపిల్లలేనని నివేదిక చెబుతోంది.

మినాబ్‌లోని ఆ ప్రాథమిక పాఠశాల ఎప్పుడూ పిల్లల కేరింతలతో, ఆటపాటలతో సందడిగా ఉండేది. నిన్నటి వరకు పలకలు, బలపాలు పట్టుకున్న చేతులు మట్టిలో కలిసిపోయాయి. స్కూలు శిథిలాల వద్ద కూర్చుని ఒక తల్లి తన బిడ్డ చిరిగిన పుస్తకాన్ని గుండెకు హత్తుకుని రోదిస్తున్నతీరు చూస్తే ఎవరికైనా కళ్ళలో నీళ్లు  తిరుగుతాయి.

ఆ మారణహోమం నుండి ప్రాణాలతో బయటపడిన కొద్దిమంది పిల్లల మానసిక పరిస్థితి  భయంకరం గా మారింది..  ఏడేళ్ల అలీ ఇప్పుడు మాట్లాడటం మానేశాడు. బాంబు పేలిన శబ్దం వాడి చెవుల్లో ఇంకా మోగుతూనే ఉంది. తోటి స్నేహితులు కళ్లముందే రక్తం మడుగులో పడిపోవడం చూసిన ఆ పసి హృదయం గడ్డ కట్టుకుపోయింది. ఇప్పుడు ఆకాశంలో చిన్న విమానం శబ్దం వినిపించినా, ఆ పిల్లలు భయంతో వణికిపోతూ తల్లుల చాటున దాక్కుంటున్నారు.

సాధారణంగా తండ్రులు తమ బాధను బయటకు చూపరు. కానీ మినాబ్ లోని తండ్రుల కళ్ళలో నీరు ఇంకి పోయింది. ఆకళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. ఒక తండ్రి తన కొడుకు చిన్నారి చెప్పులను చేత్తో పట్టుకుని పిచ్చివాడిలా కూర్చున్నాడు. “మా పిల్లలు ఏ యుద్ధంలో పాల్గొన్నారు? వారు ఏ ఆయుధాలు పట్టారు? కేవలం చదువుకోవాలనుకోవడం వారి తప్పా?” అని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ప్రపంచ దేశాధినేతల వద్ద సమాధానం లేదు. 

‘టెహ్రాన్ టైమ్స్’ ప్రచురించిన ఆ ఫొటోల్లోని పిల్లల కళ్లు ఇప్పుడు ప్రపంచాన్ని నిలదీస్తున్నాయి. రాజకీయాలు, యుద్ధతంత్రాలు, క్షిపణి దాడుల మధ్య నలిగిపోయింది కేవలం పసి ప్రాణాలు.సమాధానం చెప్పేది ఎవరు ?

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!