గంగూబాయి కథేమిటంటే ?

Sharing is Caring...

Bhansali’s Mark movie…………………

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియావాడి’ (2022) ఒక భారీ బయోపిక్. ఎస్. హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

చిన్నవయసులోనే మోసపోయి వేశ్యావాటికకు అమ్మబడిన ఒక యువతి (గంగూబాయి), ముంబైలోని కామాటిపుర ప్రాంతానికి డాన్‌గా, సామాజిక కార్యకర్తగా ఎలా ఎదిగిందనేది ఈ సినిమా కథాంశం. ఆలియా భట్ గంగూబాయిగా తన కెరీర్ లోనే  బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.అమాయకపు అమ్మాయి ‘గంగ’ నుండి శక్తివంతమైన డాన్ ‘గంగూబాయి’గా ఆమె పరివర్తన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

అజయ్ దేవగన్ కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇతర ముఖ్య పాత్రల్లో విజయ్ రాజ్, శాంతను మహేశ్వరి నటించారు. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తే  బాక్సాఫీస్ వద్ద సుమారు ₹211 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండియర్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. కామాటిపుర సెట్స్, సినిమాటోగ్రఫీ , కాస్ట్యూమ్స్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. సినిమా దాదాపు 2 గంటల 30 నిమిషాల పైన ఉండటంతో కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.

వాస్తవ కథ కంటే డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కొన్ని విమర్శలు ఉన్నాయి. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.ఆలియా భట్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు మొత్తం 5 జాతీయ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (భన్సాలీ) సహా ఏకంగా 10 విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది.

 ప్రస్తుతం ఈ సినిమా Netflix India,  Zee5   లో అందుబాటులో ఉంది.ఆసక్తిగలవారు చూడవచ్చు . 

అసలు కథ

గంగూ బాయి కథ కల్పితం కాదు.. నిజ జీవిత కథే. దాదాపు అరవై ఐదేళ్ల క్రితం జరిగిందే. 1960 వ దశకంలో ముంబై రెడ్ లైట్ ఏరియా కామాటిపురా లో ఈ గంగూ బాయి ఓ వెలుగు వెలిగింది. కామాటిపురా లో ఆమె మకుటం లేని మహారాణిగా చక్రం తిప్పింది.

సినిమాలంటే గంగూ కి  విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చిలో ఉండగానే తండ్రి దగ్గర పనిచేస్తున్న కుర్రాడితో ప్రేమలో పడింది. అతగాడి మాటలు నమ్మింది. అంతే. ఇంట్లో చెప్పకుండా .. వెనుకాముందూ చూడకుండా అతగాడితో బొంబాయి పారిపోయింది. బొంబాయి వచ్చాక కొన్నాళ్ళు ఆ ఇద్దరు కలసి కాపురం చేశారు.

అంత పెద్ద నగరం గంగూబాయికి బాగా నచ్చగా, ఆ కుర్రాడు మాత్రం భయపడిపోయాడు. చేతిలో డబ్బుల్లేవు. పోషణ కష్టమైంది. ఒక రోజు గంగూబాయికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి ఆమెను ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు.

అప్పటినుంచి గంగూ జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగింది. తొలుత వ్యభిచార వృత్తి చేసేందుకు గంగూ ఒప్పుకోలేదు. ఏడ్చింది ..మొత్తుకుంది. ఆమె మొర ఎవరూ ఆలకించలేదు.చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వృత్తిని అంగీకరించింది.

ఒక సారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందగత్తె గంగూ.చక్కటి రూపురేఖలు. లావణ్యం ఆమె సొంతం. దానికి తోడు కొంచెం చదువు ఉండటంతో గంగూ ను ఆ వ్యభిచారగృహ నిర్వాహకులు పెద్ద పెద్ద క్లయింట్ల దగ్గరకు మాత్రమే పంపేవారు.

అలా ఆమె కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది.. అలా వచ్చే వారిలో నేరగాళ్లు కూడా ఉండేవారు. దాంతో ఆమెకు ముంబాయి మాఫియా గురించి తెల్సింది. అప్పట్లో కరీం లాలా బొంబాయిలో పెద్ద డాన్. అతని మాటకు తిరుగులేదు. ఈ కరీం లాలా కు చెందిన వ్యక్తి గంగూలీ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒకరోజు నమాజు కి వెళ్లి వస్తున్న కరీం లాలా ను కలసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది.

అతనికి గంగూ మాట్లాడే విధానం బాగా నచ్చుతుంది. ఆమెను ఓదార్చుతాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుంటాడు. ఆమెకు అండగా ఉంటానని అభయం ఇస్తాడు. కామాటి పురాలో గంగూ జోలికి ఎవరొచ్చినా ఊర్కోబోను అంటాడు. అంతే .. గంగూ తన తెలివి తేటలతో  మకుటం లేని మహారాణిగా ఎదిగింది.

గంగూ బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. కామాటి పురా లో వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వెళ్లి పొమ్మనేది. అక్కడ ఉన్న వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా గంగూలీ చూసేది.దీంతో ఆమె కు అక్కడ మంచి పేరు వచ్చింది.

మరెన్నో మలుపులు కూడా ఉన్నాయి కథలో. ఒక సెక్స్ వర్కర్ కథ ఆధారంగా సినిమా తీయడం సాహసమే. సంజయ్ భన్సాలీ అందులో విజయం సాధించారని చెప్పుకోవచ్చు.  

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!