Mohammed Rafee …………
కొందరు నటులను మనం స్క్రీన్ పైనే చూస్తాం! కొందరిని కలసినప్పుడు మాట్లాడి మరచిపోతాం! కొందరిని మాత్రమే గుండెల్లో పెట్టుకుంటాం! అలా గుండెల్లో పెట్టుకోవాల్సిన అరుదైన అద్భుతమైన వ్యక్తిత్వం వున్న నటుడు జగపతిబాబు! తెలుగు సినిమా ఇండస్ట్రీలో దమ్మున్నోడు ఇతడు! ఇవాళ పుట్టినరోజు సందర్భం రెండు మాటలు.
ది గ్రేట్ వి.బి రాజేంద్రప్రసాద్ కుమారుడు జగపతిబాబు! తండ్రి నీడలో వారసుడిగా ఇండస్ట్రీలోకి రాలేదు. చెన్నై లో చదువుకుని బుద్దిగా వైజాగ్ లో వ్యాపారం మొదలుపెట్టాడు! ఒకరోజు అతనికి హీరో కావాలనిపించింది! తండ్రికి చెప్పకుండా తనవంతు ప్రయత్నం చేసుకున్నాడు! కట్ చేస్తే తొలి సినిమా ‘సింహస్వప్నం’! అట్టర్ ఫ్లాప్ సినిమా!
ఆ తరువాత కూడా వరసగా నాలుగైదు సినిమాలు బోల్తా పడ్డాయి! అయినా అతను వెనకడుగు వేయలేదు! ‘పెద్దరికం’ సినిమా అతడ్ని తలెత్తుకునేలా చేసింది! రాంగోపాల్ వర్మ ‘గాయం’ అతడ్ని హీరోగా నిలబెట్టింది! ‘మనోహరం’ సినిమా సరిగా ఆడలేదు కానీ, అది చూడాల్సిన సినిమా!
జగపతిబాబు వజ్రం లాంటోడు! దర్శకుడు వాడుకునే విధానాన్నిబట్టి అతని నటన కనిపిస్తుంది!
జగపతిబాబులో ఎస్.వి.కృష్ణారెడ్డికి ఒక ఫ్యామిలీ హీరో కనిపించాడు! ‘శుభలగ్నం’ సూపర్ డూపర్ హిట్! అలాంటివే వరస సినిమాలు! శోభన్ బాబు తరువాత ఇద్దరు హీరోయిన్ల మధ్య ముద్దుల హీరో ఇమేజ్ జగపతిబాబుకే వచ్చేసింది! ఆ విజయ పరంపర చాన్నాళ్ళు కొనసాగింది!
ఆ తరువాత బ్రేక్ వచ్చింది! ఎవరైనా అవకాశం ఇస్తే బావుండు అని ఎదురు చూసిన రోజులు! ఇంటి ముందు ఎవరైనా తచ్చాడితే ఎవరైనా దర్శకుడు కథ చెప్పడానికి వచ్చారేమో అనే ఆశ! అయినా కుంగిపోలేదు జగపతిబాబు!
ట్రెండ్ మార్చుకున్నాడు! కెరటంలా పడుతూ మళ్ళీ పైకి లేచాడు! ఈసారి బాలకృష్ణ ‘లెజెండ్’ లో పక్కా విలన్ గా! ఆహా సూపర్ అనిపించుకున్నాడు! ఇక వరసగా రిచ్ విలన్ క్యారెక్టర్లు! అన్నీ బ్లాక్ బస్టర్సె! మీరందరు అంతకుముందు ఆయన నటించిన కృష్ణవంశీ ‘అంతఃపురం’ సినిమా చూసే ఉంటారు!
సారాయి వీర్రాజు పాత్రలో జగపతిబాబు జీవించాడు. ఆ సినిమా హిందీలో రీమేక్ చేసినప్పుడు ఆ పాత్రను షారుఖ్ ఖాన్ చేశాడు! షూటింగ్ కు ముందు తెలుగు ‘అంతఃపురం’ చూసి జగపతిబాబులా చేయలేనని షారుఖ్ చెప్పారట! తెలుగు సినిమాకు దొరికిన అద్భుతం జగపతిబాబు!
బాగా సంపాదించాడు! బాగా పోగొట్టుకున్నాడు! ఎంత పైకి లేచాడో అంత కూలిపోయాడు! ఆఖరకు కార్లు కూడా అమ్మేసుకునే స్థితి! మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాడు! మళ్ళీ సక్సెస్ అయ్యాడు! ఇండస్ట్రీ లో ఫాల్స్ ప్రెస్టేజ్ లేని నటుడు జగపతిబాబు! డౌన్ టు ఎర్త్… ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి వుండే తత్వం!
ఆకాశంలో విహరించే స్థితిలో వున్నా నేలపై నడిచేందుకు ఏమాత్రం సిగ్గుపడలేదు! ఉన్నది ఉన్నట్లుగా గుట్టుగా బతికారు! గుప్తదానాలు ఎన్నో చేశారు! ఎందరికో చేయూత ఇచ్చారు! అతని జీవితం తెరచిన పుస్తకం! ఎందరో నటులకు గొప్ప ఇన్-స్పిరేషన్! కమ్మని వాడైనా కులమతాల పట్టింపులేని నటుడు!
రమ్యకృష్ణ, సౌందర్య నుంచి కీర్తి సురేష్ వరకు అందరూ ఆయనకు ఆత్మీయ మిత్రులు! జగపతిబాబుతో ఏ విషయం పంచుకున్నా ఎంతో రిలీఫ్ అనిపిస్తుందని రమ్యకృష్ణ అంటారు!నాకు నచ్చిన నా ఫెవరెట్ నటుడు జగపతిబాబు! దొరికింది కదా అని ఏదంటే ఆ పాత్ర చేసే రకం కాదు! ఒప్పుకుంటే అందులో లీనమై పరకాయ ప్రవేశం చేసి సంపూర్ణ న్యాయం చేసే నటుడు. హ్యాపీ బర్త్ డే వీరమాచనేని జగపతిబాబు.

