శివుడి తొలి ఆలయం ఇదేనా ?

Sharing is Caring...

3,000 year old temple……………

‘ఉతిర కోస మంగై ఆలయం’ ఒక పురాతన శివాలయం.. దీనిని మంగళనాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని రామనాథపురంలో ఉన్న ఈ ఆలయం శివుడు పార్వతీ దేవికి వేద రహస్యాలను బోధించిన ప్రదేశంగా నమ్ముతారు.

“ఉతిరం” (రహస్యాలు), “కోసం” (బహిర్గతం చేయడం),  “మంగై” (పార్వతి) అనే పదాల కలయికతో దీనికి ఈ పేరు వచ్చింది.ఈ ఆలయం ప్రపంచంలోనే శివుడు మొదటిసారిగా వెలసిన ప్రదేశమని, శివుడికి అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటని భక్తుల నమ్మకం.ఈ ఆలయానికి 3,000 సంవత్సరాల నాటి పురాతన చరిత్ర ఉంది.

ఇక్కడి ఆలయంలో స్వామివారు మంగళనాథ స్వామిగా, అమ్మవారు మంగళేశ్వరిగా పూజలందుకుంటున్నారు. నటరాజ రూపంలో స్వామి మరకతశిలలో దర్శనమిస్తారు. ఈ మరకతం నుంచి వెలువడే కిరణాలను జనాలు తట్టుకోవడం కష్టం.అందుకే  ఏడాది పొడవునా చందన లేపనం పూసి ఉంచుతారు.

పరమేశ్వరుడు నటరాజస్వామిగా, లింగ రూపంలోనూ, స్పటిక లింగ రూపంలోనూ దర్శనమిస్తారు. స్పటిక లింగానికి ప్రతిరోజూ అభిషేకం జరుగుతుంది.ఆరుద్ర దర్శనం సమయంలో మాత్రమే చందనం తొలగించి పూర్తి విగ్రహాన్ని భక్తులకు చూపిస్తారు.

ఇక్కడే మండోదరి శివ తపస్సు చేసి రావణాసురుడిని వివాహం చేసుకుందని పురాణ కథలు చెబుతున్నాయి. ఇక్కడ అనేక ఉపాలయాలున్నాయి. ఆలయం లోపలికి ప్రవేశించే సమయంలో యాళి విగ్రహం నోటిలో రాతితో చేసిన బంతి అప్పటి శిల్పుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది.

సాధారణంగా మొగిలి పువ్వును శివ పూజల్లో వినియోగించరు. ‘ఇక్కడ మాత్రం ఆ పువ్వు ను ఉపయోగిస్తారు.ఇక్కడ సమీపంలోనే వారాహి మాత ఆలయం ఉంది. రామేశ్వరం యాత్రకు వెళ్లే భక్తులు ఈ ఆలయాలను సందర్శించవచ్చు.

రామేశ్వరానికి… కాశీకి మధ్య బలమైన ఆధ్యాత్మిక సంబంధం ఉంది. హిందూ సంప్రదాయంలో, ఈ రెండు పుణ్యక్షేత్రాల సందర్శనను కలిపి ఒక సంపూర్ణ తీర్థయాత్రగా పరిగణిస్తారు.

యాత్రికులు తమ కాశీ యాత్రను రామేశ్వరంలో ప్రారంభించి, అక్కడ సముద్ర తీరం నుండి పవిత్రమైన ఇసుకను (సైకత లింగాన్ని) తీసుకువెళతారు. ఈ ఇసుకను అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) లోని త్రివేణి సంగమంలో గంగానదిలో కలిపి, తిరిగి కాశీ నుండి గంగాజలాన్ని తీసుకువచ్చి, రామేశ్వరంలోని రామనాథస్వామి శివలింగానికి అభిషేకం చేస్తారు. అప్పుడే యాత్ర పూర్తయినట్లు నమ్ముతారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!