Mallareddy Desireddy …………………
అరేబియా సముద్రపు ఒడ్డున గల గోకర్ణ క్షేత్రమే..శివుడి ఆత్మలింగ క్షేత్రం ఇది. జీవితంలో ఒక సారైనా సందర్శించవలసిన ఒక గొప్ప శైవ క్షేత్రం.ఈ గోకర్ణ క్షేత్రంలో వెలసిన మహాబలేశ్వర ఆలయం ఏడు ముక్తి స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. “లింగరూప తుంగ, జగమాఘనాశన భంజితాసురేంద్ర రావణలేపన వరగోకర్ణ్యఖ్యా క్షేత్ర భూషణ క్షేత్ర భూషణ శ్రీ మహాబలేశదేవ సార్వభౌమతే”…
గోకర్ణ క్షేత్రం ఒక వింతైన ‘సాధనాదత్త’ క్షేత్రం. ఈ క్షేత్రంలో అనేకానేక సంస్కృతుల సమ్మేళనం కనిపిస్తుంది.అది ఎలాగంటే ఒక విదేశీ పురుషుడు ఒక చేతిని బీరు బాటిల్ మీద మరో చెయ్యిని విదేశీ స్త్రీ మీద వేసి అక్కడ గుడి వీధుల్లో తిరగడం…ఎంత సాధారణమో… మరో విదేశీ స్త్రీ లేదా పురుషుడు వాళ్ళ ఒంటిపై భస్మధారణతో, రుద్రాక్ష యుతంగా శివ నామస్మరణతో శంఖం ఊదుతూ అదే వీధుల్లో తిరగడం కుడా అంతే సాధారణమక్కడ..
ఇక బాత్రూంలో సైతం చెప్పులు వేసుకునే విదేశీయులు కాళ్ళకు చెప్పులు లేకుండా రాళ్ళలో తెల్లవారుజామున తిరుగాడుతూ మనకి ఇక్కడ నిత్యం కనిపిస్తారు. మూరకో గుడి ,బారకో బ్రాహ్మణుడు, అడుగుకో ఔదుంబరం,అరుగుకో అనఘదత్త వృక్షం,గడపకో గోవు,వీధికో విదేశీజంట వెరసి… గోకర్ణ’. ఈ గోకర్ణ క్షేత్రాన్ని ఒక్క గంటలో చూడవచ్చు,ఒక్క రోజులో చూడవచ్చు, ఒక వారమంతా చూడవచ్చు,ఒక నెలంతా చూడవచ్చు… ఇది గోకర్ణ క్షేత్రానికి గల మరో ప్రత్యేకత.
గోకర్ణ బీచ్, ‘ఓం’ బీచ్, ప్యారడైస్ బీచ్, కుండ్లె బీచ్, హాఫ్ మూన్ బీచ్, తడడి బీచ్ లలో ఒకటైనా తప్పనిసరిగా చూడాలి. 
సహ్యాద్రి పర్వత శ్రేణిలోని ‘గోకర్ణం’ కర్నాటక రాష్ట్రంలో పడమర దిక్కుగా ఉన్న ఒక చిన్న పట్టణం.. చుట్టూరా సముద్రపు ఉప్పును తయారు చేసే ‘ఉప్పుమడులు’ [Salt Flats], చక్కటి మడ అడవులు [Mangroovs] ఉన్నాయి. శాల్మలి, అఘ నాశిని అనే రెండు నదులు సముద్రంలో కలిసే మద్య ప్రాంతంలో ఉన్న గొప్ప సాధనా దత్త క్షేత్రం, ప్రముఖ శైవక్షేత్రం.
“ఇతిహాస ప్రస్తావన “
భూమాత “పరమశివా! రాకరాక ఇక్కడికి వచ్చావు. కారణమేదైనా…నాకు నీ స్పర్శ భాగ్యం కలిగించి, నన్ను బాధించక సూక్ష్మరూపధారుడవై నాలో ప్రవేశించి నా కర్ణముల గుండా కైలాసానికి వెళ్ళు స్వామి అని ప్రార్దించింది. రుద్రుడు అంగుష్టమాత్రశరీరాన్ని ధరించి భూమాత కర్ణముల గుండా బయటకు వచ్చిన ప్రదేశం, భూమికి గల మరొక పేరు ‘గో’, కర్ణ ప్రదేశం ద్వారా రుద్రుడు వచ్చాడు కాబట్టి గోకర్ణ అని పేరు వచ్చింది.
అఘనాశిని… గంగావళి…(అఘనాశిని = పాపమును నశింపజేసేది, శాల్మలి@ గంగావళి = గంగతో సమానమైనది) ఈ విశ్వంలోని సముద్ర సంగమ నదులు ఇవి. (కాశిలోని గంగానది సముద్ర సంగమ ప్రదేశం కాదు). ఎవరైతే ఈ అఘనాశిని, గంగావళి నదులు సముద్రంలో కలిసే చోట స్నానమాచరిస్తారో వారికి పన్నెండు పూర్వ జన్మలలో చేసిన పాపాలూ, అలాగే ప్రస్తుత జన్మలో పాపాలు మొత్తం తొలగిపోతాయి అని నానుడి.
లంకానగరంలో ఉన్న రావణాసురుడి తల్లి ‘కైకసి’ నిత్యం సముద్రపు ఒడ్డున ఇసుకమట్టి తో శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉండేది. ఇలా మట్టితో చేసిన శివలింగాన్ని “పార్థివలింగం”అంటారు. ఇటువంటి పార్థివలింగం పూజ అన్నింటికన్నా మిన్న.. ఒక రోజు కైకసి ఎన్ని సార్లు పార్థివలింగాన్ని చేసినా సముద్రపు అలలు దాటికి నిలబడలేదు.
ఇక ఆరోజు పార్థివ లింగాభిషేకం చేయక లేకపోవడం వల్ల కైకసి కన్నీటి పర్యంతమవుతుంది. ఇది చూసిన రావణుడు తల్లి తో “పార్థివలింగం ..ఏమిటి ?నీకు శివుని ఆత్మలింగమే తెచ్చి ఇస్తానని” చెప్పి కైలాసానికి వెళతాడు.రావణాసురుడు కైలాశం వెళ్లి శివుడిని ప్రార్ధిస్తాడు.. ఆత్మలింగం ఇవ్వమని కోరతాడు.
శివానుగ్రహంతో రావణాసురుడు ఆత్మలింగాన్నిభూలోకానికి తీసుకువస్తాడు. భూమిమీద ఆత్మలింగాన్ని ఎక్కడయితే ఉంచుతారో, అక్కడ అది స్థాపితం అయిపోతుందనీ, తిరిగి దాన్ని ఎత్తడం,జరపడం సాధ్యంకాదనీ పరమశివుడు ఆత్మలింగం ఇవ్వడానికి మునుపే రావణాసురుడికి ఒక నిబంధన
పెడతాడు.
రావణుడు పరమశివుడి ఆత్మలింగాన్ని గనుక లంకలో ప్రతిష్టించితే నష్టం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నారద మునీంద్రుడు వినాయకుడి వద్దకు వచ్చి,“రావణాసురుడి వద్దనున్న ఆత్మలింగం తీసుకుని రావణ రాజ్యంలో కాకుండా లంకలో కాకుండా మరెక్కడైనాభూమిపై పెట్టాలనీ, దానికి తగిన స్థలం‘గోకర్ణ’ అని చెబుతాడు.
పైగా గతంలో మీ తండ్రిగారైన మహాశివుడు భూమాతకు ‘ఆత్మలింగ’ ప్రతిష్ట గోకర్ణలో జరుగుతుందని మాటిచ్చారు కుడా!”అంటూ అందుకు నువ్వే సమర్దుడవని చెప్పి భూలోకానికి పంపిస్తాడు.
రావణుడు సంధ్యవార్చుకునే సమయానికల్లా బ్రాహ్మణ వేషంలో వెళతాడు వినాయకుడు. ఆ బ్రాహ్మణ
బాలుడిని చూసి రావణుడు తను సంధ్య వార్చుకునేంత దాకా ఆత్మలింగాన్ని భూమిపై పెట్టకుండా పట్టుకోవాలని కోరతాడు.
ఈ లింగం చాలా బరువుగా ఉండడం వల్ల తాను ఎక్కువసేపు మోయలేననీ, అలా మోయలేనప్పుడు మూడు సార్లు తమను పిలుస్తాననీ అప్పటికీ మీరు రాకపోతే ఈ లింగాన్ని భూమిపై ఉంచేస్తానని అంటాడు..బాల బ్రాహ్మణుడి రూపంలోని వినాయకుడు.
ఆ పరిసర ప్రాంతంలో మరెవ్వరూ లేకపోవడంతో గత్యంతరం లేక రావణుడు అందుకు అంగీకరించి, ఆత్మలింగాన్ని బాల బ్రాహ్మణుడి చేతిలో పెట్టి సముద్రం ఒడ్డుకు వెళతాడు.రావణుడు వెళ్లిన కాసేపటికే తాను లింగాన్నిమోయలేక పోతున్నానంటూ వినాయకుడు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్య వార్చే కార్యక్రమం మధ్యలో ఉండటంతో కాస్త ఆలస్యంగా వస్తాడు రావణుడు.
ఈలోగా వినాయకుడు ఆత్మలింగాన్ని భూమిమీద పెట్టేస్తాడు. దాంతో కోపంతో రావణుడు వినాయకుడి నెత్తిపై గట్టిగా మొట్టికాయ వేస్తాడు. అక్కడ గుంట పడుతుంది. ఇప్పటికి ఆ గుంటను మనం గోకర్ణ మహాగణపతి తలపై చూడవచ్చు.
ఈలోగా తాను అనుకున్న కార్యం నిర్విఘ్నంగా జరిగిపోవటంతో సంతోషించిన విష్ణువు,తన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించడం తో వెంటనే సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు.వెంటనే విషయాన్ని గ్రహించి రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని తన చేతులతో బలవంతంగా పెకిలించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఆత్మలింగం పై కప్పిన వస్త్రం అడ్డు రావడంవల్ల దానిని తీసి విసిరేస్తాడు.
అది పడిన ప్రదేశమే“మురుడేశ్వర”… మళ్లీ ప్రయత్నించిగా ఆత్మలింగం కవచం వల్ల చేతులు జారతాయి. దాంతో కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే అది ” సజ్జేశ్వర” అనే ప్రదేశంలో పడింది. మళ్లీ ప్రయత్నించినప్పుడు ఆత్మలింగం పైనున్న మూత అడ్డు రావడం వల్ల దానిని తొలగించి విరిచి విసిరివేస్తే అందులో ఒక ముక్క “గుణేశ్వర లేదా గుణవంతేశ్వర్” లో, మరో ముక్క“ధారేశ్వర్”లో పడ్డాయి.
రావణాసురుడు ఆత్మలింగం పై ప్రయోగించిన బలం ఫలితంగా ఆత్మలింగం పైభాగం ఆవు చెవి ఆకారంలో సాగుతుందే కాని అది భూమి నుండి ఊడిరాదు. కాల క్రమంలో మహావిష్ణువు శాలిగ్రామ పీఠం రూపంలో ఈ ఆత్మలింగాన్ని చుట్టి ఉంది..
గోకర్ణలోని భక్తులు ఈ మహాబలేశ్వరుని ఆత్మలింగాన్ని“శాలిగ్రామ పీఠం” లోని మధ్య భాగంలో వున్న గుండ్రని రంధ్రం లోనుండి తమ చేతులతో తాకుతారు. ఈ రంద్రం గుండానే అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. అత్యంత అరుదుగా ఆత్మలింగంపై గల ఈ శాలిగ్రామ పీఠంను తొలగించి ఎనిమిది రోజులు పుజిస్తారు.
ఇట్టి కార్యక్రమాన్ని “అగమ్య అష్టబంధన మహోత్సవం” అంటారు. తదుపరి తిరిగి విష్ణు శాలిగ్రామ పీఠాన్ని యధాతధంగా పునఃప్రతిష్టాపన చేస్తారు.ఇక్కడ పంచామృతాభిషేకం ఆత్మలింగాన్ని తాకి…స్పర్శదర్శనం చేసుకుంటే ఒక గొప్పఅనుభూతి కలుగుతుంది.
ప్రధాన ఆత్మలింగ ఆలయానికి ఎడమ చేతి వైపుగా గోశాలకు దగ్గరలో ఉంటుంది. ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ముందుగా దర్శించవలసిన ప్రదేశమిది (మొత్తం గోకర్ణ యాత్రలో ముందుగా దర్శించవలసిన ప్రదేశం మహాగణపతి’దేవాలయం).
ఇక్కడ బిల్వాలను సమర్పించి జలాభిషేకం చేస్తే సరిపోతుంది(నీటిని మనమే తీసుకుని వెళ్ళాలి, అక్కడ చుట్టూరా ఉండే నీటిని మళ్లీ అభిషేకానికి వాడరాదు) గోకర్ణ సందర్శన అద్భుతం.గోకర్ణకు 20 కి.మీ దూరంలో ఉన్న అంకోలా రైల్వే స్టేషన్ సమీప స్టేషన్. ఈ రైల్వేస్టేషన్ ప్రధాన నగరాలు,సమీప ప్రాంతాలకు అనుసంధానమైంది.పర్యాటకులు ఇక్కడి నుండి గోకర్ణ చేరుకోవడానికి బస్సు లేదా అద్దె టాక్సీని తీసుకోవచ్చు. బెంగళూరు నుంచి కూడా రైళ్లు ఉన్నాయి.

