ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన. కమ్యునిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా జ్వాల అనే పత్రిక పెట్టి … సంపాదకత్వం వహించి ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు ప్రత్యగాత్మ. అన్నట్టు సోవియట్టు రష్యా కృశ్చేవ్ నాయకత్వంలోకి వచ్చాక అందు రివిజనిస్టు పోకడలు ప్రారంభమయ్యాయని గుర్తించిన అప్పటి భారత కమ్యునిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ సభ్యుల్లో వీరూ ఒకరు.శ్రీశ్రీ, అట్లూరి పిచ్చేశ్వర్రావు, రావి శాస్త్రి లాంటి వారితో కథా చర్చలు జరపడం … వారి సలహాలు స్వీకరించడం జరిగేది.
ప్రత్యగాత్మ లాంటి వాళ్ల ద్వారా సినిమా పరిచయం అయిన రావి శాస్త్రిగారు సినిమాల మీద పేల్చిన జోకు చాలా పాపులర్ కదా …సినిమావాళ్లు మన్ని రాయమంటారు. కానీ మన మాటలు మన్ని రాసుకోనీయరు, మన కథలు మన్ని రాసుకోనీయరు … అలా మన పని కూడా వాళ్లే చేసేసుకుంటారు. ఇవే మాటల్లో కాదుగానీ ఇదే భావం వచ్చేలా కామెంట్ చేశారాయన. అలాగే గణేశ్ పాత్రో మీద శాస్త్రిగారు వేసిన కామెంటు కూడా పాపులర్ కదా … ఈ సినిమావాళ్లొచ్చి పాత్రోని పావలా వైపు నిలబడకుండా చేశారు అనేవారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యగాత్మ దగ్గరకు వచ్చేద్దాం.ఆదుర్తి అంతటి డైరక్టరు అవుతాడు అని సాక్షాత్తు అక్కినేని అభిప్రాయపడిన దర్శకుడు ప్రత్యగాత్మ. తన ఉద్యమ మిత్రుడు తాతినేని ప్రకాశరావు చేయి పట్టుకుని సినీ ప్రవేశం చేశారు ప్రత్యగాత్మ.ఇల్లరికం సినిమాకు కథ రాయడం ద్వారా ఆయన సినీ ప్రవేశం జరిగింది.
ఇల్లరికం సమయంలోనే ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సుబ్బారావుతో పరిచయం పెరిగింది. పిఎపి బ్యానర్ లోనే భార్యాభర్తలు సినిమా డైరక్ట్ చేసి సూపర్ హిట్ చేశారు. అక్కినేని, కృష్ణకుమారి నటించిన భార్యాభర్తలు మూవీ రాష్ట్రపతి రజత కమలం సాధించింది. ప్రత్యగాత్మ కథను తెరమీద నడిపే విధానం చాలా మోడ్రన్ గా ఉంటుందని ఇండస్ట్రీ అంగీకరించింది. తన తొలి సక్సస్ ఫుల్ మూవీ హీరో అక్కినేనితోనే ప్రత్యగాత్మ ఎక్కువ సినిమాలు చేశారు. ‘కులగోత్రాలు, పునర్జన్మ, మనుషులు – మమతలు, ఆదర్శ కుటుంబం, శ్రీమంతుడు, పల్లెటూరి బావ లాంటి సినిమాలు వచ్చాయి . ఆ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం నాయకుడు – వినాయకుడు’. అది దారుణంగా తన్నేసింది.ఆ తర్వాత కూడా అక్కినేనితోనే పిఎపిలోనే ఒక సినిమా అనుకున్నారు. చక్రవర్తిని సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. మామూలుగా పిఎపి సినిమాలకు చలపతిరావు పర్మనెంట్ సంగీత దర్శకుడు. వేటూరితో ఓ పాట రాయించుకున్నారు. చక్రవర్తి ట్యూనేశాడు …పాట రికార్డ్ అయ్యింది … మరి సినిమా ఎప్పుడు మొదలెడదామో తేల్చండి అని సుబ్బారావుగారిని అడిగారు ప్రత్యగాత్మ. ఆయన సమాధానం చెప్పకపోయే సరికి చేతిలో ఉన్న స్క్రిప్టు ఫైల్ నేలకేసి కొట్టి వెళ్లిపోయారట ప్రత్యగాత్మ. అంతే .. ఆయన సినిమాలకు ఫేర్వెల్ చెప్పేశారు.
మల్లెపూల మారాణికీ… బంతిపూల పారాణి…. సన్నజాజి ముంగిళ్లలోనా … ఇట్టా అమరజీవి సినిమాలో పాట ఉంటుంది కదా … ఆ పాటే అప్పుడు ప్రత్యగాత్మగారు రికార్డ్ చేయించింది. ఆ తర్వాత వేటూరి చక్రవర్తి కూడ బలుక్కుని ఇందులో వాడేశారు. ప్రత్యగాత్మ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. కె.పి.ఆత్మ పేరుతో ఛోటాభాయి, ఏక్ నారీ ఏక్ బ్రహ్మచారి, తమన్నా, మెహమాన్ లాంటి సక్సస్ ఫుల్ మూవీస్ చేశారాయన. తెలుగులో ఎన్.టి.ఆర్ తో మంచి మనిషి, దీక్ష లాంటి రెండు మూడు సినిమాలు మాత్రమే చేశారు. ఇంగ్లీషు నవలల సన్నివేశాలకు తెలుగుపూత కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి ప్రత్యగాత్మ సినిమాల్లో. స్వీయనిర్మాణంలో చిలకాగోరింక సినిమా తీసి కృష్ణంరాజు, రమాప్రభలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా కృష్ణంరాజును పరిచయం చేసి ప్రత్యగాత్మ ఓ దారుణం చేశారనుకుంటే .. వాళ్లబ్బాయి వాసు చిరంజీవి విడుదలైన తొలి చిత్రం ప్రాణం ఖరీదును డైరక్ట్ చేసి మరో దారుణం చేశారు. మన విప్లవ రచయిత చలసాని ప్రసాద్ కు బావ అవుతారు ప్రత్యగాత్మ. ప్రసాద్ గారు కూడా కొంత కాలం గోపీచంద్ దగ్గర సినిమా కథా రచనా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు కదా.
కొంత మంది తిడితే తిట్టారుగానీ ఉన్న మాట చెప్పేయాలండీ … కృష్ణాజిల్లా కమ్మ యువకులకు అప్పట్లో సినిమాల మీద మాంచి మోజుండేదండి … ప్రొడక్షన్ సైడో డైరక్షన్ సైడో ముఖ్యంగా టెక్నికల్ సైడ్ కూడా చాలా మందే వెళ్లారు. మిగిలిన కులాలతో పోలిస్తే వీళ్ల కదలిక కాస్త ఎక్కువ. ఈ విషయంలోనూ వీరు మా బ్యామ్మర్లకు గట్టి పోటీ ఇచ్చారు.
అయినా నాకెందుకు ఎవరెట్టా పోతే నాకే .