Horror in the name… everything is comedy………………
ప్రేమకథా చిత్రమ్.. 2013 మే లో రిలీజ్ అయిన సినిమా ఇది.మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో జె.ప్రభాకర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు,నందిత, ప్రవీణ్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో సినిమా బాగా ఆడింది. 20 కోట్లకు పైగా వసూలు చేసింది.
కథ ఏమిటంటే ??
ప్రేమలో మోసపోయిన సుధీర్ (సుధీర్ బాబు), ఇతర కారణాల వలన ప్రవీణ్ (ప్రవీణ్), నందిత రాజ్ (నందిత) లు ఆత్మహత్యకు ప్లాన్ చేసుకుంటారు. వీరితో సప్తగిరి కలుస్తాడు. అందరూ ఒక ఫామ్ హౌస్ కి వెళతారు. ప్రేమలో విఫలమై కుమిలిపోతున్న సుధీర్ ను కాపాడాలని ప్రవీణ్, సుధీర్ ని ప్రేమిస్తున్న నందిత ప్లాన్ చేసి ఆత్మహత్యను మూడురోజులు వాయిదా వేయిస్తారు.
అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. నందితకు దగ్గరగా వెళ్ళినపుడల్లా ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుంది. దెయ్యంలా బిహేవ్ చేస్తుంది.. ముఖ కవళికలు మారిపోతాయి. దీంతో సుధీర్ బెదిరి పోతాడు. స్నేహితులకు చెప్పినా వారు నమ్మరు. తర్వాత వారికి అదే అనుభవం ఎదురవుతుంది. అపుడు అందరూ ఆమె ను ఎవరిదో ఆత్మ ఆవహించిందని గ్రహిస్తారు.
ఆతర్వాత ఆ నలుగురు ఆ ఆత్మ బారినుంచి ఎలా బయట పడ్డారు అనేది మిగిలిన కథ.సుధీర్ బాబు తన పాత్రలో లీనమై నటించాడు. ముఖ్యంగా ఆత్మ నందితలో ప్రవేశించినపుడు భయాన్ని బాగా ప్రదర్శించాడు.
నందు పాత్రలో నందిత ఒదిగి పోయింది.ఆమె కళ్ళు ఆమె కు ప్లస్ పాయింట్.తనలోకి ఆత్మ ప్రవేశించినపుడు ఆమె హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తన కేమైందో అర్ధం కాక తికపడే ప్రియురాలి పాత్రలో బాగా నటించింది.ఈ సినిమా విజయం సాధించినప్పటికీ నందిత కు పెద్దగా అవకాశాలు రాలేదు
ఇక ప్రవీణ్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సప్తగిరి సంగతి చెప్పనక్కర్లేదు.తెరపై చెలరేగిపోయాడు.తన విలక్షణమైన డైలాగ్ డెలివరీ తో ఆడియన్స్ ను అలరించాడు.
చాలా సాదాసీదాగా మొదలైన సినిమా మొదట్లో స్లో గా సాగినా మెల్లగా ఊపందుకుంటుంది. రెండో భాగం ఆసక్తికరంగా నడుస్తుంది. కథలో కొంత లాజిక్ లోపించినప్పటికీ సినిమా చూడవచ్చు.పేరుకే హారర్ సినిమా.కామెడీకే ప్రాధాన్యమిచ్చారు.
నందు లో ప్రవేశించిన ఆత్మ మనసులో మాట ఏమిటో తెలుసుకోవడానికి ముగ్గురు స్నేహితులు డ్రామా టీమ్ తో కలసి ఆడే ద్రౌపది వస్త్రపహరణం నాటకం కామెడీగా సాగుతుంది. కథలో నాలుగే మెయిన్ క్యారెక్టర్స్, ఒకే లొకేషన్ అయినప్పటికీ బోర్ కొట్టదు. క్లైమాక్స్ సన్నివేశాలు మరీ రొటీన్‌గా ఉన్నాయి.లాజిక్ కనిపించదు.
జెబి సంగీతం ఓకే. గుర్తుంచుకోదగిన పాటలేమీ లేవు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. దర్శకుడు జె. ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కొన్ని సన్నివేశాల్లో కెమెరా పనితీరు బాగుంది. మారుతి కథ ..కథనం డైలాగ్స్ అందించారు.ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వచ్చింది. అందులో పాత్రలు కంటిన్యూ అయ్యాయి. నటులు వేరే వాళ్ళు .ఆ సినిమా గురించి మరో మారు చెప్పుకుందాం .
ఇక ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది. చూసిన వారు ..చూడని వారు చూడవచ్చు.

