ఆకట్టుకునే మైథలాజికల్ మూవీ !!

Sharing is Caring...

త్రినాథ్ రావు గరగ ………………….

కన్నడ సీమ నుండి వచ్చిన కాంతారా సినిమా మన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా గుర్తుండిపోతుంది. ఆ ప్రాంతపు ఆచారం, సంస్కృతి, భక్తి కలగలిపి నింపిన మైథాలజికల్ ఎంటర్టైనర్. నిజానికి కాంతారా సినిమా వచ్చినప్పుడు దానిమీద ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు.

సినిమా ఘనవిజయానికి అదో ముఖ్య కారణం.అదే చాప్టర్ వన్ విషయానికి వస్తే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 సినిమాలో సరిగ్గా కాంతారా ఎక్కడ ముగుస్తుందో అక్కడే మొదలుపెట్టారు. కానీ కాంతారాలో కనబడిన మట్టి వాసన చాప్టర్1కు వచ్చేటప్పటికి కనుమరుగయ్యింది.

కాంతారాకు ప్రధాన బలం పూనకం సీన్. చాప్టర్ వన్ కొచ్చేటప్పటికి మళ్లీ మళ్లీ చూసినట్టు ఉంది తప్ప కొత్తగా అనిపించలేదు.కథా కథనాల తరువాత యాక్షన్ సన్నివేశాలు ఎక్కువ మార్కులు కొట్టేస్తాయి. రథంపై ఫైట్ .. ఫారెస్టులో వర్షంలోను .. తాంత్రీకులతో ఫైట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.

ప్రీ క్లైమాక్స్ లోను .. క్లైమాక్స్ లోను దైవం ఆదేశించినట్టుగా రిషభ్ శెట్టి చేసిన యాక్టింగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది..రిషబ్ శెట్టి సీక్వెల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని అనుకోకుండా.. ప్రేక్షకులకు ఇంకా గొప్ప అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో మరింత భారీతనం ఉన్న కథతో వచ్చాడు ఈసారి.

ఆ భారీతనం ఒక దశ వరకూ అనవసరపు ఆర్భాటంలా కనిపించినా.. రిషబ్ చెప్పాలనుకున్న కొత్త కథ కొంతమేర విసిగించినా.. ‘కాంతార’కు బలంగా నిలిచిన డివైన్ ఎలిమెంట్లోకి అతను అడుగు పెట్టగానే మొత్తం మారిపోయింది.

మరోసారి రిషబ్ శెట్టి నట విశ్వరూప దర్శనం అవుతుంటే తెరకు కళ్లప్పగించడం తప్ప ఇంకేమీ చేయలేం. ఒక్కసారి ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాక ప్రతీ దృశ్యం అద్భుతంగానే అనిపిస్తుంది.ఒక్కసారిగా ప్రథమార్ధంలోని తప్పులన్నింటినీ మాఫీ చేసేస్తుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని మిగులుస్తుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే కాంతార క్లైమాక్స్ సన్నివేశాల్లో రిషబ్ శెట్టి నటన చూశాక దాన్ని మించి పెర్ఫామ్ చేయడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ రిషబ్ అబ్బురపరిచే నటనతో కట్టి పడేశాడు. దేవుడు పూనినపుడు తన నటనను ఇంతకుముందు అనుభూతి చెందినా సరే.. ఈసారి మళ్లీ ఆశ్చర్యపోతాం. సెకండాఫ్ మొత్తం అతడి పెర్ఫామెన్స్ వేరే లెవెల్లో సాగింది.

అడవిలో విశ్వరూపం చూపించే సన్నివేశం గురించైతే ఎంత చెప్పినా తక్కువే. రిషభ్ – హీరోయిన్ రుక్మిణి వసంత్ పాత్రల పరిచయం .. ప్రేమ సీన్స్ ఆకట్టుకుంటాయి. రాజుగా జయరామ్, యువరాజుగా గుల్షన్ దేవయ్య పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదేమో అనిపిస్తుంది.సప్తసాగరాలు దాటి సినిమా తర్వాత వరుసగా నిరాశపరుస్తున్న రుక్మిణి వసంత్ కు కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచే పాత్ర దక్కింది.

ఇటు అందం.. అటు అభినయంతో ఆమె ఆకట్టుకుంది. ఇప్పటిదాకా రుక్మిణిలో చూడని కోణాన్ని ఇందులో చూస్తాం. తన పాత్రలోని భిన్నకోణాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి.ప్రకాష్ తుమినాడ్.. మిగతా ఆర్టిస్టులందరూ బాగానే చేశారు.

సాంకేతికంగా ‘కాంతార చాప్టర్-1’ అత్యున్నత స్థాయిలో సాగింది. ప్రతి టెక్నీషియన్ ది బెస్ట్ ఇచ్చారు. అజనీష్ లోక్ నాథ్ నేపథ్య సంగీతంలో విజృంభించాడు. ద్వితీయార్ధంలో సన్నివేశాలకు తగ్గట్లే తన ఆర్ఆర్ పతాక స్థాయిలో సాగింది. నేపథ్య సంగీతం సినిమాను డ్రైవ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. అరవింద్ కశ్యప్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో సాగింది.

ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే.హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నాయి. ఇక తనకు సమకూరిన వనరులన్నింటినీ గొప్పగా ఉపయోగించుకుంటూ రైటర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి పడ్డ కష్టం గురించి మనం గొప్పగా చెప్పొచ్చు.

కథాకథనాల్లో,సన్నివేశాల్లో కొంచెం గందరగోళం ఉన్నా. ప్రథమార్ధంలో కాస్త బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నా.ఇలాంటి విభిన్నమైన కథను తెరపైకి తీసుకురావడంలో రిషబ్ పడ్డ కష్టాన్ని.. అతడి తపనను మెచ్చుకోకుండా ఉండలేం.

ప్రేక్షకులకు విజువల్స్ రూపంలో.. నటన పరంగా గొప్ప అనుభూతిని పంచడానికి అతను పెట్టిన ఎఫర్ట్ గొప్పది.ఓవరాల్ గా ఈ చిత్రం కాంతార అభిమానులతో పాటుగా మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!