Virupaksha Guha …………….
విరూపాక్ష గుహ …….అరుణాచలం లో తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఒకప్పుడు గుహ లా ఉండే ఈ ప్రదేశం కాలక్రమేణా కొత్త రూపు సంతరించుకుంది. కొన్ని వందల ఏళ్ళక్రితం ‘విరుపాక్ష ముని’ ఈ గుహలోనే దీర్ఘకాలం తపస్సు చేసారని అంటారు. అందువల్లనే ఆ గుహను విరూపాక్ష గుహగా పిలుస్తున్నారు.
తదుపరి కాలంలో రమణ మహర్షి ఇక్కడకు వచ్చి .. ఈ ప్రాంతం నచ్చి ఈ గుహలోనే ఉండిపోయారు. 1899 నుండి 16 ఏళ్ళు మహర్షి ఈ గుహలోనే ఉన్నారు. భక్తులు ఈ గుహ వద్దకే వచ్చేవారు. తొలినాళ్ళలో మహర్షి మౌనంగా ఉండేవారు. క్రమంగా తనవద్దకు వచ్చే వారితో మాట్లాడే వారు. అప్పుడప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇచ్చే వారు.
కొన్నాళ్ళు గడిచాక వారిచుట్టూ జిజ్ఞాసువులు చేరారు. మహర్షి సేవక భక్తుల బృందం ఏర్పడింది. కొండ కింద నుంచి పిల్లలు,పెద్దలు నడుచుకుంటూ వచ్చేవారు. అదంతా అటవీ ప్రాంతం కావడంతో జంతువులు కూడా గుహ వద్దకు వచ్చేవి. ఇక ఉడుతలు,కోతులు,పక్షులు అయితే లెక్కలేదు. అవన్నీ భక్తుల నుంచి ఆహారాన్ని స్వీకరించేవి.
ఇలాటి అద్భుత దృశ్యాలెన్నో ఉన్నాయని మహర్షి గురించి రాసిన పుస్తకాల్లో ప్రస్తావించారు. రమణులు వారు విరుపాక్ష గుహలో ఉన్న సమయంలోనే ఒక రోజు సమీపంలో ఉన్న నీటి మడుగులో నీరు త్రాగడానికి చిరుతపులి వచ్చిందట. భక్తులంతా భయపడి దాన్ని తోలడానికి పళ్ళాలు, డబ్బాలు తీసుకొని డప్పు వేస్తుండగానే అది నీళ్ళు తాగి .. గాండ్రు మంటూ వెళ్ళిపోయిందట.
మహర్షి భక్తుల్ని చూసి “మీరెందుకు భయపడతారు? ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలియ జేసింది. నీళ్ళు త్రాగి మరొక అరుపుతో వెళ్తున్నానని చెప్పి తన దారిన తాను వెళ్లి పోయింది. మీ జోలికి రాలేదు కదా… మీకెందుకు భయం? ఈ కొండలు.. గుట్టలు వాటి నివాస ప్రాంతాలు. మనం అవి ఉండేచోటుకి వచ్చి వాటిని తరమటం ఏం న్యాయం?” అని భక్తులను వారించారట.
ఈ అరుణాచలం పై ఎందరో సిద్ధపురుషులు ఉన్నారు. వారు నన్ను చూడాలని వివిధ రూపాలలో వస్తూవుంటారు. వారికి ఏ విధమైన అలజడి కలిగించరాదు” అని భక్తులను మందలించారట.
ఇక 1916 లో మాత్రమే మహర్షి గుహ నుండి బయటికి వచ్చారు. గుహలో ఉన్న కాలంలోనే “సెల్ప్ ఎంక్వైరీ ” .. “హూ యామ్ ఐ ” వంటి అంశాలకు సంబంధించి మహర్షి ఉపదేశాలను ఇచ్చారు. అవే పుస్తకరూపంలో వెలువడినాయి. మహర్షి నివసించిన గుహను ఆయన భక్తులు ఒక ఆలయం గా భావిస్తారు.
అనేకమంది ఇక్కడికి వచ్చి గుహలో ధ్యాన సాధన చేస్తుంటారు. ఈ ప్రాంతంలోవాతావరణం, ప్రకృతి ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికొచ్చి గడుపుతుంటారు. మహర్షి తల్లి అళగమ్మ స్వామికోసం వచ్చి చూసి వెళ్లే వారు. చివరి రోజుల్లో ఆమె తనయుడి వద్దనే ఉండిపోయారు.
విరుపాక్ష గుహకు రమణ ఆశ్రమం వెనుక వైపు నుంచి వెళ్ళవచ్చు. సుమారుగా రెండు కిమీ దూరంలో ఉంటుంది. రోజూ కొన్ని వందలమంది వచ్చి వెళుతుంటారు. అరుణాచలం వెళ్లిన భక్తులు తప్పకుండా ఈ విరూపాక్ష గుహ ను సందర్శించి రండి. ఆ తర్వాత మీలో మార్పును మీరే గుర్తిస్తారు.