ఏమైంది? ఆయన ఎందుకిలా?

Sharing is Caring...

డా. మహ్మద్ రఫీ……………………….

ఫ్రస్ట్రేషన్ అర్ధం కావడం లేదు! అతి చనువో తెలియడం లేదు! వయసు పైబడి చిన్న పిల్లల మనస్తత్వం వచ్చిందో అర్ధం కావడం లేదు! ఇన్నేళ్లు ఇన్నాళ్లు ఇండస్ట్రీ లో ఉంటే సరిగా గుర్తించకుండా సైడ్ చేసేస్తున్నారనే బాధ ఏమో తెలియదు!

ఆయన వేదిక పై మాట్లాడుతుంటే వినే వాళ్ళకు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు! వాక్యం మధ్యలోనే జంప్ అయిపోయి వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతోంది! ఏది పూర్తిగా మాట్లాడటం లేదు! ఎవ్వరికీ ఏమి అర్ధం కావడం లేదు!

సభా మర్యాద అనే ఒక సంప్రదాయం ఒకటి ఉంటుంది! సరే, ఈ ట్రెండ్ పిల్లగాళ్ళకు తెలియకపోవచ్చు! ఆయనకు ఎందుకు తెలియదు? ఎన్టీఆర్ ఇంట్లో గొడ్ల చావడిలో పుట్టినవారు! ఎన్టీఆర్ వీరాభిమాని! అదే బాటలో నడచి హీరో అయ్యారు! కామెడీ హీరో గా ట్రెండ్ సెట్ చేశారు!

అప్పటి ప్రధాని సైతం రాత్రిళ్ళు ఆయన సినిమా చూసి హాయిగా నవ్వుకుని పడుకుంటా అని చెప్పించుకోగలిగిన కీర్తి కిరీటం ఆయన! ఎందరినో ఇండస్ట్రీ కి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తిత్వం! ఎందరినో ఆదరించి అక్కున చేర్చుకున్న శ్రేయోభిలాషి! ఎప్పుడూ జోవియల్ గా నవ్వుతూ నవ్విస్తూనే ఎంతో హుందాగా వుండే వ్యక్తి! ఆయనతో సినిమా నిర్మాతలకు గ్యారంటీ అనిపించుకున్న గొప్ప హీరో!

అలాంటిది ఇటీవల కాలంలో ఎందుకు అభాసుపాలు అవుతున్నారు? ఆయనతో ఒకసారి కలిస్తే మాట్లాడితే ఆయన్ని మరచిపోలేరు! అంతగా ప్రేమించే వ్యక్తిత్వం! ఇట్టే కలసిపోయే తత్వం! అంత సరదాగా అంత స్థాయిలోనూ ఈజీ గోయింగ్ మనిషిని నేను ఇండస్ట్రీ లో చూడలేదు!

కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కళ పత్రిక 10వ వార్షికోత్సవ వేడుక దుబాయ్ లో నిర్వహించినప్పుడు మాకెంతో సహకరించారు! అడిగిన వెంటనే కాదనకుండా వచ్చారు! ఎన్టీఆర్ శత జయంతి పురస్కారంతో దుబాయ్ లో ఘనంగా సత్కరించాం! అందుకు ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను!

కానీ, ఆయన వేదిక పై అదుపు తప్పుతుంటే బాధ కలుగుతోంది! ఆయన సరదాగా అందరిని మన అనుకునే మాటలను తప్పు బట్టి ట్రోల్ చేస్తుంటే “ఎందుకిలా పాపం” అనిపిస్తుంది! నిజానికి ఆయన సినిమాలో మాదిరిగా బయట కూడా నవ్వించాలని ప్రయత్నిస్తున్నారు!

అది వికటించి నవ్వుల పాలవుతున్నారు! ఇటీవల కాలంలో ఆయన పోషిస్తున్న సినిమా పాత్రలు కూడా చూస్తుంటే “ఎందుకు ఒప్పుకున్నారాయన” అనిపిస్తుంటుంది! “వామ్మో ఆయన వున్నాడా చూడలేం ఆయన ఓవర్ యాక్టింగ్” అని జనం అనుకుంటున్న పరిస్థితి!

ఎక్కడో ఏదో తేడా కొడుతోంది! వరల్డ్ టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో కలసి నటించి ఉండొచ్చు! ఆయనతో ఎవరు మాట్లాడినా ఇట్టే కలుపుకుపోతారు కాబట్టి చనువు ఏర్పడి ఉండొచ్చు! అంత మాత్రాన వేదిక పై “ఒరేయ్ డేవిడ్ గా” అనడం తప్పు! చూసే వారికి వినే వారికి హుందాగా ఉండదు! పైగా “వాడికి తెలుగు రాదులే” అనడం మరొక తప్పు!

అతనికి తెలుగు రానంత మాత్రాన స్టేజ్ పై మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా తిట్టేస్తారా? అల్లు అర్జున్ పుష్ప కు కేంద్ర జాతీయ సినిమా పురస్కారం లభించింది! ఇండస్ట్రీ లో కొందరికి జీర్ణం కాకపోవచ్చు! అందులో ఈయన కూడా ఉండొచ్చు! అంత మాత్రాన ఆయన అభిమానులు కోప్పడేలా “కలప దొంగ కు నేషనల్ అవార్డు” అని ఎద్దేవా చేస్తారా? అది ఆయన వయసుకు అనే మాటలు కావు!

నిన్న ఫిల్మ్ నగర్ క్లబ్ లో దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లోను ఏదో మాట్లాడి అభాసు పాలయ్యారు! మరీ అతి చనువుతో ఆయన అలా అని ఉండొచ్చు కానీ, అది వేదిక కాబట్టి ఆయనే నవ్వులపాలయ్యారు! “అచ్చెన్న ఇంత మంది వస్తున్నారని ముందే ఎందుకు చెప్పలేదు. బయట చూసుకుందాం నీ సంగతి చెబుతా నీకు ఉందిలే” అంటూ వంకలు తిరుగుతూ ఏదో పళ్ళు కొరుకుతూ నటించారు!

కానీ, ఎవ్వరికీ అర్ధం కాలేదు ఆయన ఎందుకు అలా చేసారో! ఇక అలీ ఎదురుగా కూర్చుని ఉంటే “ఒరేయ్ అలీ రారా” అని అనకూడని పెద్ద బూ**తు మాట విసిరారు! మనం మనం ఒకటే అని నవ్వారు! వారిద్దరి మధ్య వున్న చనువుతో అని ఉండొచ్చు! అలీ నవ్వుతూ ఈజీ గా తీసుకున్నారు కానీ, అంతమందిలో అనే మాట కాదు!

ఆ మాట అని ఆయనే హుందాతనాన్ని కోల్పోయారు! అంతలో మాజీ మంత్రి రోజా వచ్చారు! ఆమె మంత్రిగా చేశారు కాబట్టి అందరూ పలకరించడం, కాస్త హడావిడి ఉంటుంది! అది చూసి తట్టుకోలేక పోయాడు! “ఏయ్ కూర్చోండి సైలెన్స్ ఆమని” అంటూ అరిచారు. “రోజానా దాన్ని నేనే హీరోయిన్ చేశాను.” అని లూజ్ గా అనేశారు!

సినిమా వాళ్లలో వాళ్ళకు వున్న చనువులో కలసినప్పుడు ఫోన్ లో ఏవేవో అనుకోవచ్చు! కానీ, వేదిక పై ఎంత పరిచయం ప్రేమ వున్నా కాస్త హుందాగా మసలుకోవాలి! పైగా ఈయన స్థాయిలాంటి వ్యక్తి ఇంకా హుందాగా ఉండాలి!ఈయన్ని సినిమా ఫంక్షన్స్ కు పిలిస్తే ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడి వివాదం సృష్టిస్తారు!

అది వైరల్ అయి సినిమాకు ప్లస్ అవుతుందని కొత్త కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళు ఎర వేసి గాలం వదులుతున్నారు! ఆ గాలానికి ఈయన ఇట్టే పడిపోతున్నారు! వాళ్ళు అనుకున్నట్లుగానే ఈయన ఏదొక విధంగా నోరు జారి నగుబాటుకు గురవుతున్నారు! ఎన్టీఆర్ అవార్డు అందుకున్న అని ఆయన అనగానే చప్పట్లు కొట్టాలట! ఆయన అన్నమాటే అది!

అప్పుడు కొట్టారు జనం చప్పట్లు! వేదిక పై వున్న ఎవరో “అడిగి కొట్టించుకున్నారు చప్పట్లు” అంటూ ఎద్దేవా చేశారు! దానికి మళ్ళీ ఈయన గారు స్పందించి “కొట్టకపోతే సిగ్గు శరం లేనట్లే” అంటూ నోరు జారారు!

ఎవ్వరూ చేయలేని చేయని పాత్రలు పోషించి, ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ బిగ్ హీరో ఎందుకిలా అయిపోయారు? ఎవ్వరైనా చెప్పండి! చెప్పినా వింటారా? ‘పెద్దాయన ఏదో అన్నారు పట్టించుకోవద్దు లైట్ తీసుకోండి’ అని నటుడు అలీ ఒక వీడియో విడుదల చేసి పెద్ద మనసు చాటుకున్నారు

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!