ఎవరీ జ్యోతి మల్హోత్రా ? ఏమిటి ఆమె కథ ?

Sharing is Caring...

Espionage case …………………………..

జ్యోతి మల్హోత్రా.. కొద్దీ రోజులుగా వార్తల్లో విన్పిస్తున్నపేరు. యూట్యూబర్ గా ఈ జ్యోతి మల్హోత్రా కు చాలాపేరుంది.ఈమెను జ్యోతి రాణి అని కూడా అంటారు.హర్యానాలోని హిసార్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ “ట్రావెల్ విత్ జో” ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు.

జ్యోతి మల్హోత్రాను మే 16న గూఢచర్యం ఆరోపణల కింద అరెస్టు చేశారన్న సంగతి తెలిసిందే.  జ్యోతి పై అధికారిక రహస్యాల చట్టం, ఐపీసీ  కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOలు)తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జ్యోతి ని అదుపులోకి తీసుకున్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) జ్యోతి ని విచారిస్తున్నాయి. ఒక PIO తో ప్రేమాయణం సాగించారని, అతనితో  కలిసి ఇండోనేషియాలోని బాలికి కూడా వెళ్లి వచ్చారనే ఆరోపణలున్నాయి.కూపీ లాగే కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

తాజాగా జ్యోతి పాకిస్థాన్ టూర్‌కి సంబంధించి రాసుకున్న డైరీ దర్యాప్తు సంస్థలకి చిక్కింది. ఆ డైరీ ఆధారంగా జ్యోతి పాకిస్థాన్ లో ఎవరెవరిని కలిశారు అనే అంశాలు బయటపడ్డాయి. అలాగే  ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన పాకిస్తానీ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో నవంబర్ 2023 నుంచి మార్చి 2025 వరకూ జ్యోతి  మాట్లాడుతున్నారని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.

డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు జ్యోతి ఒప్పుకున్నారని హర్యానా పోలీసులు చెబుతున్నారు. డానిష్ జ్యోతి మల్హోత్రాను అలీ అహ్వాన్‌కు పరిచయం చేశాడు.తర్వాత  అలీ.. జ్యోతి కి  పాక్‌లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంతోపాటు, పాకిస్థాన్ భద్రతా అధికారులు షకీర్, రాణా షాబాజ్‌‌‌లకూ పరిచయం చేసి వారితో మీటింగ్స్ ఏర్పాటు చేశాడని పోలీసులు కూపీ లాగారు.

ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత జ్యోతి వాట్సాప్,టెలిగ్రామ్, స్నాప్‌చాట్ ద్వారా వాళ్లతో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో డానిష్‌ను జ్యోతి చాలా సార్లు కలిసిందట.యూట్యూబర్‌ జ్యోతి కి అనేక లావాదేవీలతో కూడిన వివిధ బ్యాంకు ఖాతాలు ఉన్నాయంటున్నారు. వీటన్నింటిని ఇప్పుడు జ్యోతి టూర్ హిస్టరీతో పోల్చి కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్లేషిస్తున్నాయి.

జ్యోతి కి ఉన్న ఇన్‌కం సోర్సెస్‌తో ఇన్ని టూర్స్ చేయలేదని, ఎక్కడి నుంచో ఫండ్స్ రావడం వల్లనే ఆమె ఎక్కువగా పర్యటనలు చేసిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.ఇక జ్యోతి తన కుటుంబ విషయాలను, వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచారు.  

జ్యోతి కి 377,000 కి పైగా యూట్యూబ్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 132,000 మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్నారు. జ్యోతి ఇండియా,పాకిస్తాన్‌తో సహా విదేశాలలో తన ప్రయాణాలను డాక్యుమెంట్ చేస్తూ, ఒక శక్తివంతమైన కథకురాలిగా ఖ్యాతిని సంపాదించుకున్నారు. జ్యోతి హిందువు.ఖత్రి కులస్తురాలు. ప్రధాన వృత్తి యూట్యూబ్ ఛానల్ ‘ట్రావెల్ విత్ జో’ కి వీడియోలు చేయడమే.

జ్యోతి తన YouTube ప్రయాణాన్ని 2011లో ప్రారంభించారు. ఇప్పటివరకు ఆమె దాదాపు 500 వీడియోలను పోస్ట్ చేసింది. వాటిని  5.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. పాకిస్తాన్,ఇండోనేషియా, చైనా దేశాల్లో పర్యటించారు.పాకిస్తాన్‌లోని హిందూ పుణ్యక్షేత్రాల గురించి మార్చి 2025లో పోస్ట్ చేశారు.

ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలలముందు జ్యోతి జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌కి వెళ్లారు. క్రమంలో ఆ టూరిస్ట్‌ ప్లేస్‌ సమాచారాన్నిఎవరితోనైనా షేర్‌ చేసుకుందా? అని కూడా ఎంక్వయిరీ చేస్తున్నారు. పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ తర్వాత ఒక లైవ్‌ వీడియో చేసింది జ్యోతి. ఆమె టూర్‌, రియాక్షన్‌ రెండూ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలు ప్రారంభానికి జ్యోతి హైదరాబాద్ వచ్చారట. అపుడు ఆమె ఎవరిని కలిశారు అనే అంశాల గురించి కూడా కూపీ లాగుతున్నారు.జ్యోతి ట్రావెల్ వ్లాగ్‌లను దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. జ్యోతి కారణంగా నిజాయితీగా దేశ విదేశాల్లో తిరుగుతూ వీడియోలు చేసే యూట్యూబర్లకు కొత్త కష్టాలు ఎదురుకావచ్చు.   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!