Subramanyam Dogiparthi …………………………
ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ “బుడుగు” నవలలో ‘రెండుజెళ్ళసీత’ అనే పాత్రను సృష్టించారు. దాన్ని టైటిల్ గా తీసుకుని ‘జంధ్యాల’ ఈ సినిమా కథ రాసుకుని డైరెక్ట్ చేశారు. ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల .
జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో ! ఈ సినిమా దగ్గర నుంచే జంధ్యాల దర్శకత్వంలో పూర్తి హాస్య రస చిత్రాలు వచ్చాయి . ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసిన ఇ వి వి కూడా తర్వాత కాలంలో గొప్ప హాస్య చిత్రాలను అందించారు.
జంధ్యాల కి విశాఖపట్టణం కలిసొచ్చింది . ఈ సినిమా అంతా విశాఖపట్టణం, అరకు , విజయనగరాల ప్రకృతి అందాల నడుమ తీసారు. ఈ సినిమాకు మరో రెండు విశేషాలు కూడా ఉన్నాయి . ఈ సినిమాకు హీరోయిన్ మహాలక్ష్మి . ఇదే ఆమెకు మొదటి తెలుగు సినిమా . ఈమె సీనియర్ నటి పుష్పలత కుమార్తె . ఈ సినిమాలో ఇద్దరూ తల్లీకూతుళ్ళుగానే నటించారు .
శ్రీలక్ష్మి , రాజేష్ అక్కాతమ్ముళ్ళు . ఈ ఇద్దరూ ఈ సినిమాలో నటించారు. నలుగురు కాలేజి కుర్రోళ్ళు ప్రాణానికి ప్రాణంగా ఉండే రూంమేట్లు . ఎలాగోలా ఓ అమ్మాయిని ప్రేమించాలని తమ బిల్డింగులో ఉన్న ఓ జంటను ఖాళీ చేయించి , ఆ పోర్షన్లోకి ఓ రెండు జెళ్ళ సీత కుటుంబం అద్దెకు వచ్చేలా స్కెచ్ చేస్తారు .
నలుగురూ ఆ అమ్మాయి ప్రేమ కొరకు చివరకు తన్నుకుంటారు . డస్సిపోయిన మిత్రులు ఆ అమ్మాయి దగ్గరకే వెళ్లి తమ కష్టాన్ని చెప్పుకుంటారు . తనకు ముందే పెళ్లి అయిందని , తనను కాబోయే మామ ఎలా బద్నాం చేసి పెళ్ళిని ఆపాడో చెపుతుంది . ప్రేమికులు అన్నలు అయి విజయనగరం చేరుకుని ఆ మామ దుర్మార్గుడికి బుధ్ధి చెప్పి సీతకు పెళ్లి జరిపిస్తారు . పెళ్ళిలో పెళ్లి మరో జంటకు కూడా పెళ్లి జరిపిస్తారు . టూకీగా ఇదీ కధ .
నలుగురు కుర్రాళ్ళుగా నరేష్ , ప్రదీప్,రాజేష్,శుభాకర్ చాలా బాగా నటించారు. జంధ్యాల వారి నుంచి మంచి నటనను రాబట్టారు. ముఖ్యంగా క్లైమాక్సులో చాలా గొప్పగా నటిస్తారు . వీళ్ళ బిల్డింగులో ఉంటూ వీళ్ళకు బకరాలు అయిన జంటగా సుత్తి వేలు , శ్రీలక్ష్మి అదరగొట్టేసారు . అనుమానపు మొగుడుగా వేలు,అమాయక పెళ్ళాంగా శ్రీలక్ష్మి అదరహో అనిపించారు.
సినిమాలో హాస్యంలో సగ భాగం పైన వీరిద్దరిదే . ఆ తర్వాత చెప్పుకోవలసింది అల్లు రామలింగయ్య గురించే . మహానటుడు. ఈ సినిమాలో ‘జిస్ దేశ్ మే గంగా బహతీ హై’ హిందీని కలగాపులగం చేసి మాట్లాడుతూ కామిక్ విలనీని గొప్పగా పోషించారు.
మరో గొప్ప పాత్ర సాక్షి రంగారావుది.రంగస్థలం నుండి వచ్చిన నటుడు కదా ! విషాద, భావోద్వేగ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో శుభలేఖ సుధాకర్ , కమలాకర్ , కిరణ్ , రాళ్ళపల్లి , పొట్టి ప్రసాద్ , సుత్తి వీరభద్రరావు , పుష్పలత , దేవి , ప్రభృతులు నటించారు.కధ , స్క్రీన్ ప్లే , సంభాషణలు , దర్శకత్వం జంధ్యాల వారివే .
కేవలం 14 లక్షల రూపాయల బడ్జెటుతో తీసిన ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. నిర్మాతలకు కనక వర్షం కురిపించింది.వంద రోజులు ఆడిన ఈ సినిమా ను తమిళం లోకి కూడా డబ్ చేశారు. రమేష్ నాయుడు సంగీతం ఈ సినిమా విజయానికి బాగా దోహదపడింది . ఏ సినిమాకు అయినా సంగీత దర్శకుడు రెండు రకాల సంగీతాన్ని అందిస్తాడు. ఒకటి BGM , రెండవది పాటలకు.ఈ రెండింటికీ న్యాయం చేసారు రమేష్ నాయుడు .
సినిమా లోని ఆరు పాటల్లో అయిదు వేటూరి వారే వ్రాసారు . ఒక్క క్లైమాక్స్ పాట అయిన ‘పురుషులలో పుణ్యపురుషులు వేరు’ అంటూ సాగే టీజింగ్ పాటను ఇంద్రగంటి వారు వ్రాసారు. క్లైమాక్స్ ను బాగా పండించింది ఈ పాట. వరకట్న మహమ్మారిని ఎండగడుతూ ముగించే ఈ సినిమాకు ఈ పాట లైఫ్ అని చెప్పొచ్చు .
‘వేట వేట వేట’ అంటూ అమ్మాయిలకు సైట్ కొడుతూ సాగే పాట భీమిలి రోడ్లో బాగా తీసారు జంధ్యాల . ‘సరిసరి పదపదని’ అంటూ సాగే పాటలో నలుగురు మిత్రులు ఎవరికి వారే రెండు జెళ్ళ సీతతో ఊహాలోకంలో డాన్స్ చేసే పాటను జంధ్యాల చాలా అందంగా చిత్రీకరించారు. మందారంలో ఘుమఘుమలై డ్యూయెట్ మహాలక్ష్మి , కమలాకర్ల మీద , కొబ్బరి నీళ్ళ జలకాలాడి కోనసీమ కోక కట్టి డ్యూయెట్ శుభలేఖ సుధాకర్ , దేవిల మీద చాలా చక్కగా చిత్రీకరించారు.
రెండు జెళ్ళ సీత … తీపి గుండె కోత పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . ఆరు పాటలూ బాగుంటాయి. పాటల్ని బాలసుబ్రమణ్యం , యస్ జానకిలు శ్రావ్యంగా పాడారు . ఆరుగురు కుర్రాళ్ళు , మెయిన్ హీరోయిన్ , తోడు హీరోయిన్ అందరూ ముడతలు లేకుండా లేత లేతగా బాగుంటారు .
సహజంగానే కాలేజి పిల్లలు అందరూ ఐడెంటిఫై అయిపోయి సినిమాను బాగా ఆడించారు . కంబైన్డ్ స్టడీలు , కంబైన్ఢ్ సైట్ కొట్టడాలు , ఆ అమ్మాయి కోసం తమలోతామే కొట్టుకోవడాలు, తన్నుకోవటాలు కాలేజి రోజుల్లో కామనే కదా ! అవన్నీ పుష్కలంగా ఉన్న ఈ సినిమా చక్కని సంసారపక్ష , వినోదభరిత , సందేశాత్మక సినిమా . 1983 మార్చిలో విడుదలయిన ఈ సినిమా యూట్యూబులో ఉంది. ఇంతకుముందు చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి.