Vijaya Nirmala’s first Telugu directed film ….
మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్గా పేరు తెచ్చుకున్న ‘విజయ నిర్మల’ తెలుగులో కూడా ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. విజయ నిర్మలకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు. ఆమె యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే చాలా ఇష్టం.దాన్నే సినిమాగా తీస్తే బాగుంటుందా అని ఆలోచించి అదే చేయాలనుకున్నారు.
హక్కు లు గురించి కూపీ లాగితే అవి నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు దగ్గర ఉన్నాయని తెల్సింది. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ‘పూలరంగడు’, ‘ఆత్మీయులు’ సినిమాల్లో ఆమె నటించారు. ఆయనతో బాగా పరిచయం కూడా ఉంది. దుక్కిపాటిని కలిసి ‘మీనా’ హక్కులు అడిగారామె. కృష్ణ హీరోగా ఈ సినిమా తానే డెరైక్ట్ చేయాలనీ అనుకుంటున్నట్టు చెప్పారు.
అందుకు దుక్కిపాటి ఆశ్చర్యపోతూ “కృష్ణలాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా ఎలా తీస్తావ్? ఇందులో ఫైట్లూ, మాస్ మసాలా అంశాలు ఉండవు కదా” అనడిగారు. పర్లేదు..నేను మేనేజ్ చేస్తా.. అన్నారు ఆమె. దుక్కిపాటి ఒకే అన్నారు. కృష్ణ కు చెబితే ‘మంచి కథ కదా. డేట్లిస్తా. ప్రొసీడ్ అనేసారు.
ఆత్రేయ ను సంప్రదిస్తే బిజీ అన్నారు. వెంటనే అప్పలాచార్య ను పిలిపించారు.అప్పలాచార్య కి అప్పటికే కొన్ని సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. చాలా సినిమాలకు కామెడీ సన్నివేశాలు, పాటలు కూడా రాసేవాడు. సముద్రాల రాఘవాచార్య కు మేనల్లుడు. ఆయనతో కూర్చుని స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు.
కృష్ణతో డాన్సులూ, ఫైట్లూ లేకుండా క్లాస్ సినిమా అంటే బయటి నిర్మాతలు వస్తారో రారో ? రిస్క్ ఎందుకు? అని విజయ నిర్మల సొంతంగా విజయకృష్ణా మూవీస్ బేనర్ పెట్టారు.హీరోగా కృష్ణ రెడీ. ప్రధాన పాత్రలో తాను,హీరోయిన్ తండ్రి పాత్రకు ఎస్వీ రంగారావుని అడిగితే ఆయనా ఓకే చెప్పారు.
ఎస్. వరలక్ష్మి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రకళ… ఇలా అందరి కాల్ షీట్స్ సిద్ధం. షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నంతలో ఎస్.వి.ఆర్ హెల్త్ ప్రాబ్లమ్ అని కబురు వచ్చింది. దాంతో అప్పటికప్పుడు ఆ ప్లేస్ లో గుమ్మడిని తీసుకున్నారు. శరవేగంతో షూటింగ్ ముగించారు
35 రోజుల్లో సినిమా తయారైంది. పల్లెటూరు లో ఎక్కువ భాగం కథ నడుస్తుంది. అందుకే పల్లెటూరి ఇళ్లలోనే షూటింగ్ చేశారు. 5 లక్షల రూపాయలు వరకు ఖర్చయ్యింది. ఫస్ట్ కాపీ వచ్చాక పంపిణీ దారులకు చూపించారు.
సినిమా అంతా బాగుంది కానీ, ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట తీసేయమన్నారు. కానీ విజయ నిర్మల మాత్రం ఆ పాట ఉండి తీరాల్సిందే అని పట్టుబట్టారు. ఆరుద్ర రాసిన ఆ పాట ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది.
1973 డిసెంబర్ 28న ‘మీనా’ విడుదలైంది. బలమైన కథ ..ఫ్యామిలీ డ్రామా ఉండటంతో ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఫస్ట్ ,సెకండ్ రన్ లో కూడా బాగా ఆడింది. రమేష్ నాయుడు స్వరపరిచిన పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ పాటలు పెద్ద హిట్టు. అలా దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల క్లిక్ అయ్యారు. సినిమా చూసి చాలా బాగా తీశావని యద్దనపూడి మెచ్చుకున్నారు. ఈ సినిమా అంతా సూపర్ స్టార్ కృష్ణ పంచెకట్టులోనే కనిపిస్తారు. (ఒకటి రెండు చోట్ల మినహా )చదువుకున్న పల్లెటూరి యువకుడి పాత్రలో కృష్ణ ఒదిగిపోయారు.
విజయ నిర్మల మీనా పాత్రకు నూరు శాతం న్యాయం చేశారు. హీరో హీరోయిన్ల పై ఒకటే పాట.. ఆత్రేయ రాసిన ‘అమ్మమ్మమ్మో అమ్మాయి గారండి ఆగండి చూడండి’ అంటూ హీరో టీజ్ చేసే పాట కూడా బాగుంటుంది. ఎక్కడా అతి లేకుండా .. అనవసర పాత్రలు లేకుండా విజయనిర్మల జాగ్రత్తగా డీల్ చేశారు.
సినిమాలో ఛాయాదేవి డైలాగులు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ‘మీ నాయన .. మా ఆయన కావాల్సిందే’ అంటూ ఏడ్చే సన్నివేశాలు, ‘ఒక్కోచోట అడిగి పుచ్చుకుంటే అధిక లాభం’ అంటూ కృష్ణ అల్లుని మందలించే సీన్, విజయ నిర్మలకు కాలికి గుచ్చుకున్న ముల్లు తీసే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
పల్లెటూరి పిల్లలా చంద్రకళ రాణించింది.ఎస్.వరలక్ష్మి ఆపాత్రకు కరెక్ట్ గా సూట్ అయ్యారు. మరొకరిని ఆ పాత్రలో ఊహించలేం. జగ్గయ్య పాత్ర కూడా కీలకమే. ఆయన బాగానే చేసాడు. గుమ్మడి సంగతి ఇక చెప్పనక్కర్లేదు. క్లయిమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు చూడ వచ్చు.. చూసిన వారు చూడొచ్చు.