రేసులో బాలీవుడ్ వెనుక పడుతోందా ?

Sharing is Caring...

Sankeertan ……………….

ఒక్కొక్క సినిమా కాదు.. బాలీవుడ్‌ను తొక్కుకుంటూ పోవాలి… హిందీ హీరోలను ఏసుకుంటూ పోవాలన్నట్లు RRR జైత్రయాత్ర కొనసాగింది. RRR తర్వాత సర్వం సౌత్ మయం అన్నట్లు బాలీవుడ్‌లో పరిస్థితి తయారైంది. బాలీవుడ్‌లో బాహుబలికి ఓ స్పెషల్ పేజీ ఉంటే పుష్పకు మరో పేజీ క్రియేట్ అయింది.

రాజమౌళి, సుకుమార్ మాత్రమేనా.. మా సత్తా కూడా చూపిస్తామంటూ బాలీవుడ్ మీద దండెత్తారు తెలుగు డైరెక్టర్లు. అంతే… చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా తెలుగులో హిట్ అవుతుందకున్న సినిమాలు అన్ని ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నాయి.    

తెలుగు సినిమా వస్తేనే బాలీవుడ్‌లో హిట్… లేకపోతే ఫట్ అన్న రేంజ్‌కు తెలుగు సినిమా ఎదిగింది. RRRను బాలీవుడ్‌లో జక్కన్న ఏ రేంజ్‌లో ప్రమోట్ చేశారంటే… నార్త్ జనాలకు రీచ్ అయ్యే ఏ చిన్న మాధ్యమాన్ని వదులుకోలేదు. బాహుబలిలో ప్రభాస్ హీరో, విలన్ రాణా.

ఈ సారి RRRతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను బాలీవుడ్ స్క్రీన్‌పైకి దింపాడు. అంతే రాజమౌళి ఏం చెబితే అది ఫాలో అయ్యే హీరోలు కాబట్టి.. ప్రాణంపెట్టి నటించారు. దెబ్బకు బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీ వచ్చింది. RRR దేశం గర్వించదగ్గ సినిమా అయ్యింది.  

టాలీవుడ్‌ను ఎదుర్కొనేందుకు ఏ దశలోనూ సిద్ధంగా ఉన్న బాలీవుడ్‌ను ఐసీయూలో చేర్చే వార్త బయటకు వచ్చింది. అదే RRRకు ఆస్కార్ అవార్డు. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులకు ప్రపంచమే ఉర్రూతలు ఊగిపోయి… సాహో అంటూ రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ కాదు టాలీవుడ్ సినిమా అని ప్రపంచానికి తెలిసేలా చేసింది RRR.

RRR తర్వాత వచ్చిన కార్తీకేయ2, దసరా, హనుమాన్ వంటి చిన్న సినిమాలు హిందీ జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. హిందీలో ఏ సినిమా తీసినా.. అట్టర్ ఫ్లాప్ అవడమే తప్ప.. హిట్ అన్న మాటే బాలీవుడ్ మర్చిపోయిందని జగమెరిగిన ఎరిగిన సత్యం.

ఇక తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ కేక్ లాంటి డైరెక్టర్. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు  కోట్లు కుమ్మరించేందుకు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉన్నారు. కబీర్ సింగ్ రీమేక్‌‌తో బాలీవుడ్‌కు మాస్ సీన్స్‌ను రుచిచూపించిన సందీప్..

ఆ తర్వాత యానిమల్‌ వంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బోల్డ్ అంటే ఇది… వాయిలెన్స్ అంటే ఇది అంటూ బాలీవుడ్‌ను షేక్ చేశాడు. యానిమల్ సినిమా ఏకంగా 7 వందల కోట్లు కొల్లగొట్టి సందీప్  స్టామినాను బాలీవుడ్‌కు చూపించింది. ఇక సందీప్ అప్ కమింగ్ సినిమా స్పిరిట్ ప్రభాస్‌తో వస్తుండటంతో ఈ సినిమా బాలీవుడ్‌లో వెయ్యి కోట్లను కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.      

పుష్ప జుకేగా నయ్… సాల..! అంటూ.. అల్లు అర్జున్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లో అల్లు అర్జున్ పుష్పరాజ్‌కు ఓ బ్రాండ్‌ క్రియేట్ చేశాడు. ఏ… ఉస్తరికే బ్లేడ్… అంటూ పుష్ప హిందీ డైలాగ్స్ అక్కడి జనాలకు ఏ స్థాయిలో రీచ్ అయ్యాయి అంటే.. ఎప్పుడు హౌజ్ ఫుల్ కాని థియేటర్లు వద్ద బ్లాక్‌లో టికెట్లు అమ్మే రోజులను తీసుకువచ్చాయి. దేశం మొత్తం జుకేగా నై అంటూ ఊగిపోయింది. పుష్ప దెబ్బకు.. పుష్ప2 కోసం బయ్యర్లు ఏడాది ముందు నుంచే అడ్వాన్స్‌లు ఇచ్చి పెట్టేశారు.  

బెంగాల్‌లోని ఓ సమస్యాత్మక ప్రాంతంలో ఏనాడూ సెకెండ్ షో వేయ్యని థియేటర్లలో.. 20 ఏళ్ల తర్వాత పుష్ప సినిమా సెకెండ్ షో కంటిన్యూగా పడిందంటే పుష్ప సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బిహార్‌లో అయితే అల్లు అర్జున్ స్టార్ హీరో అయిపోయారు. జుకేగా నై అంటూ కటౌట్లు కట్టి దండలు వేశారు.

తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్, కేరళలో మల్లు అర్జున్, ఇప్పుడు బిహార్‌లో బిల్లు అర్జున్ అయ్యాడు బన్నీ. యూపీలో కూడా సేమ్ సిట్యూవేషన్. పుష్ప అంటే ఫైర్ అంటూ ఫస్ట్ పార్ట్ అప్పుడు అన్న యూపీ బాయ్‌లు… సెకెండ్ పార్ట్‌తో వైల్డ్ ఫైర్ అంటూ థియేటర్ల మీదకు దండెత్తారు. టికెట్లు ఇవ్వకపోతే లేపేస్తామంటూ థియేటర్ల ఓనర్లకు వార్నింగ్స్ ఇచ్చారంటే పుష్పరాజ్ మేనియా బాలీవుడ్‌ను ఏ స్థాయిలో కుదిపేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప2 ప్రీరిలీజ్ ఈవెంట్‌కు… కనీవినీ ఎరుగని రేంజ్‌లో జనాలు వచ్చారు. పాట్నా మొత్తం అల్లు అర్జున్… అల్లు అర్జున్.. అంటూ మారుమోగిపోయింది. బిహారీలు అంటే విలన్లుగా బాలీవుడ్ చిత్రీకరించిందని… పుష్ప అంటే బిహార్ సినిమా అంటూ నెత్తినపెట్టుకున్నారు. అల్లు అర్జున్ కటౌట్లకు కొబ్బరికాయలు కొట్టి మరి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

నిజానికి బాలీవుడ్ సామాన్యుల జీవితాలకు అద్దం పట్టే సినిమాలు తీయడం మానేసింది. ఓ సాధారణ కూలీ…అంచలంచెలుగా ఎదిగిన తీరును పుష్పలో సుకుమార్ చూపించారు. బిహార్‌,యూపీలోని చాలా మంది ప్రజలు ఈ కాన్సెప్ట్‌కు కనెక్ట్ అయ్యారు. పుష్పరాజ్‌లో తమను చూసుకుని మురిసిపోయారు.

తెలుగు సినిమా.. బాలీవుడ్‌ను రూల్ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండే కథాంశాలు తెలుగు సినిమాను మరో స్థాయిలో నిలబెడుతున్నాయి. ముఖ్యంగా హిందూ సాంస్కృతి సాంప్రదాయాలకు తెలుగు సినిమాలు అద్దంపడుతున్నాయి. కార్తీకేయ2, కాంతారా, కల్కీ, పుష్ప2 వంటి సినిమాలు హిందూ సాంప్రదాయాలను, హిందూ దేవతల శక్తి యుక్తులను తెలిపేలా ఉన్నాయి.

అయితే గతంలో బాలీవుడ్‌లో వచ్చిన కొన్ని సినిమాల్లో హిందూ సాంప్రదాయాలను కించపరిచారు. హిందూ దేవతలను తక్కువ చేసి చూపించడం కూడా బాలీవుడ్ పతనానికి కారణమైంది. సమాజంలో జరిగే విషయాలే కథాంశాలు అవుతాయన్న సత్యాన్ని బాలీవుడ్ గుర్తించనంత కాలం ఇదే గడ్డు పరిస్థితి తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

సామాన్య జనాలకు చేరువైయ్యే కథలు కాకుండా… ఖాన్‌లు కండలు, చెడ్డీలు, మిడ్డీలనే నమ్ముకుంటే బాలీవుడ్ దుకాణం పూర్తిగా మూసుకోక తప్పదని బాలీవుడ్ సినీ పండితులే చెబుతున్నారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!