వ్యాసుడికి కూడా కథలు చెప్పగల నేర్పరి ఆయన !

Sharing is Caring...

Taadi Prakash …………………………………….

నవరంగ్ లో నవయవ్వన జయబాధురి…అలంకార్ లో చిలిపి నవ్వుల విద్యా సిన్హా…ఊర్వశిలో ఊపిరాడనివ్వని హేమమాలిని…ఆ పక్క చికిలి చూపుల జరీనా వాహబ్… ఈ పక్క అనురాధా పటేల్, రేఖల ఉత్సవ్! ఎర్లీ సెవెంటీస్… విజయవాడ ధియేటర్లలోనాన్ స్టాప్ సెలబ్రేషన్!

ఇది చాలదన్నట్టు….విజయాటాకీస్ ముందు వాల్ పోస్టర్ లో వెల్లకిలా పడుకుని వొళ్లు విరుచుకుంటూ సోగకళ్ల మళయాళ మోహిని- జయ భారతి… నేడే నా సినిమా చూడండి అంటూ పిలుపు.గుర్తుందా? ‘రతినిర్వేదం’, ఆమె మధుర రాత్రులు ‘అతనికి చాలా అర్జెంటు’ లాంటి రక్తిరస ప్రధాన చిత్రాలు తెగ ఆడుతుండేవి. అస్సలు పైట చెంగు అలవాటేలేని జయభారతి, హెలెన్, జయమాలిని వంటి రొమ్ములు తిరిగిన డాన్సర్లు. 

కుర్రాళ్లకి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్న రోజులవి….‘సినిమా టికెట్ కొంటే సెక్స్ ఉచితం’ అన్నట్టు…ఒక మాయజలతారు వలపన్నిన కాలమది! 1974వ సంవత్సరం. ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో …డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నా. నాకు 17 ఏళ్లు. ఇండియా అనే Sex starved nationకి …పబ్లిగ్గా వొళ్లు ప్రదర్శించే ఈ శృంగార తారలు చేస్తున్నసేవ, జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవకంటే తక్కువేమీ కాదని నాకప్పటికి

తెలియదు. పైగా నేనెంత వెర్రివాణ్ణి అంటే…

అటు రేఖనీ, యిటు అనురాధా పటేల్నీ కాలదన్నుకుని…చుట్టుగుంట సెంటర్లోనో, ‘విశాలాంధ్ర’ గేటు ముందో కాళ్లు తొక్కుకుంటూ వెయిట్ చేస్తూ వుండేవాణ్ణి….ఏ చీకూచింతా లేకుండా నెమ్మదిగా వచ్చేవాడు, వేద వ్యాసుడి క్కూడా కథలు చెప్పగల నేర్పరి…పెద్దిభొట్ల సుబ్బరామయ్య! బలంగా దిట్టంగా వుండే ఆయన, దళసరి కళ్లద్దాలతో, సాధారణమైన ప్యాంటూ చొక్కాతో వచ్చేవాడు. సుబ్బరామయ్య గారు రావడమంటే ఏమిటి?

అచ్చూ ఆంటన్ చెహోవ్ వచ్చి నా భుజమ్మీద చెయ్యేసి పలకరించినట్టేగా! సాక్షాత్తూ కాఫ్కానే వచ్చి కాఫీకి పిలిచినట్టేగా! సిగరెట్ నోట్లో పెట్టుకు వచ్చిన మొపాసా, అగ్గిపెట్టుందా? అని నన్ను అడిగినట్టేగా!
*** *** ****
నేను కనిపించగానే పెద్దిభొట్ల చిన్నగా నివ్వి, ‘‘వెళ్దామా’’ అనేవాడు. ఎదురు చూస్తున్నదే అందుకు…కొంత దూరం నడిచి, వో రిక్షా ఎక్కేవాళ్లం ..పూనాలో ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్లు ..  ఆటో ఎక్కి ఎంత హేపీగా ఫీలయ్యారో.. అంత కంఫర్టబుల్ గా వుండేవి విజయవాడ రిక్షాలు. ఆయన దగ్గరగానీ, నా దగ్గరగానీ నయాపైసా వుండేది కాదు.

నెమ్మదిగా తేనె మాటల మూట విప్పేవాడు. ‘‘నాది బాగా చిగురుటాకులాంటి హృదయం బాబూ, పావలా లేకపోతే గాయపడుతుంది’’ అన్నాడోసారి. తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకోలేక  రిక్షాలో నుంచి పడిపోతానేమో అనిపించింది. సీతారాంపురం… విజయా టాకీస్ దాటి కాస్త  ముందుకి వెళితే- అరుణా, నవోదయా, విశాలాంధ్ర…మరికొన్ని బుక్ షాపులు ఉండేవి.

పచ్చికమర్షియల్ ఏలూరు రోడ్డుకి విలువైన ఆభరణాలు అవే! ఒక బుక్ షాపు దగ్గర రిక్షా ఆపి, దిగి వెళ్లేవాడు. నేను రిక్షాలోనే. ముసురు, పూర్ణాహుతి, ఏస్ రన్నర్, నీళ్లు లాంటి అనేక గొప్ప కథలు అప్పటికే చదివి ఉండటం వల్ల ఆయనెవరో నాకు బాగా తెలుసు. లయోలా కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్న సుబ్బరామయ్య గారికి ప్రతి రోజూ ఒక సంధ్యా సమస్య!

సాయంకాలం. కబుర్లూ, కాలక్షేపానికో తోడు కావాలి. మా అన్నయ్య ఆర్టిస్టు మోహన్, ఇంకొందరు జర్నలిస్టు రచయితలు డ్యూటీలతో బిజీగా వుండటం వల్ల ఆయన నన్ను ప్రిఫర్ చేసేవాడు. కనీసం మూడు పెగ్గులు మందు తాగాలి. మళ్లీ రిక్షాలోఇంటికి వెళ్లాలి. అనగా డబ్బులు కావాలి. బుక్ షాపు వాళ్లను ఎంతో కొంత యిమ్మని అడిగేవాడు. పెద్దభొట్ల పుస్తకాలు అమ్ముతారు గనుక, యాభయ్యో, వందో యిచ్చేవారు. రిక్షా మరో బుక్ షాపు ముందు ఆగేది.

అక్కడో యాభై. మొత్తమ్మీద నూటయాభై వరకూ పోగేసేవాడు. రెండు వందలుగాని దొరికిందా ‘భాగ్యలక్ష్మి’ లాటరీ కొట్టినట్టే. ఆ మూడు పెగ్గులూ తాగడానికి సుబ్బరామయ్య గారి కృషి, దీక్షా, పట్టుదల చూస్తే ఎంత బావుండేదో చెప్పలేను. సెంటర్లో లక్ష్మీ టాకీసు దగ్గర పొరపాట్న విష్ణుమూర్తి ప్రత్యక్షమై భక్తా, పెద్దిభొట్లా! జ్ఞానపీఠ్ అవార్డు కావాలా ?ముష్టి మూడు పెగ్గుల విస్కీ కావాలా? అని గనగ అడిగితే, దేవా! అవార్డులతో గొంతు తడుస్తుందా? కడుపునిండుతుందా? మూడు పెగ్గులే కటాక్షించుము… బాబు అంటూ, అసహజ భుజకీర్తులను తిరస్కరించే సూపర్ హీరో నా సుబ్బరామయ్య.

*** *** ****
సాగర్ బార్ లో సెటిలయ్యేవాళ్లం. ఒక చికెన్ ఫ్రై, రెండు సిగరెట్లు, మూడు పెగ్గులు…సార్ లెక్క అది! ఉల్లిపాయ ముక్కలంటే ఆయనకి వెర్రి. ఇంట్లో చికెనూ, ఉల్లిపాయలూ నహీ చల్తా! అప్పటికి నాకు రేఖ, జయబాధురి అన్న దురలవాట్లు తప్ప తాగడం, సిగరెట్లు అస్సలు తెలీవు. కొన్ని ద్రాక్ష పళ్లు కొనిచ్చేవాడు.

తొలి పెగ్గులోనే కబుర్లు మొదలు… విశ్వనాధ, షేక్ స్పియరూ, శ్రీశ్రీ, శ్రీపాద, చాసో….ఇలా చాలా… కొంచెం నా స్థాయికి దిగి అర్థమయ్యేలా చెబుతుండేవారు. సుబ్బరామయ్యగారితో కూర్చున్న పులకింతతో బెట్రండ్ రస్సెల్ బామ్మర్ధిలా ఫీలయ్యి ..అది చదివా ఇది చదివా అని వాగుతుండేవాణ్ణి. పాపం మన్నించి వినేవాడు.

*** *** ****
విశ్వనాధ సత్యనారాయణ గారి పక్కింట్లో చేరడానికి ముందు, మా మకాం, మారుతీనగర్ లోనే మరో వీధిలోని ముక్కామల బిల్డింగ్స్ లో. అవి నాలుగు ఇండిపెండెంట్ పక్కా డాబాలు. అన్నీ ఒకే డిజైనులో వరసగా వుండేవి. చివరి నాలుగో బిల్డింగ్ లో మేము, రెండో దాంట్లో పెద్దిభొట్ల వుండేవాళ్లం. ఓ రోజు ఉదయం తొమ్మిదిన్నరకి సుబ్బరామయ్య కాలేజీకని బయల్దేరారు.

మొదటి బిల్డింగులో వుండే ఇంటి వోనరు, ల్యాండ్ లైన్ ఫోన్ లో గట్టిగా అరిచి మాట్లాడుతున్నాడు. సుబ్బరామయ్య వోనర్ ని పలకరిస్తున్నట్టుగా చెయ్యివూపి, ‘ఏంటీ’’ అని అడిగారు. ‘‘గుంటూరు… గుంటూరు బంధువుతో మాట్లాడుతున్నా’’ అని చెప్పాడు. కొంటెవాడైన సుబ్బరామయ్య, వోనరు అరిచి మాట్లాడటాన్ని వెక్కిరిస్తూ, ‘‘ఫోన్లో మాట్లాడొచ్చుగా’’ అనేశారు. మర్నాడు సుబ్బరామయ్య నాకు యిది చెప్పి ‘‘వోనరు బాగా హర్టయినట్టున్నాడు. ఇల్లు ఖాళీ చేయమన్నాడు’’ అని ఆయన పడీ పడీ నవ్వారు.
*** *** ****
ఒక రోజు ఇద్దరం నడిచివెళుతున్నాం. గుబురుగా పూలతో నిండివున్న బోగన్ విల్లా చెట్టు నీడలో, మురికి కాల్వ పక్కన, మూడేళ్ల వయసులోపున్న ఓ పాప, బాబు చెరో చీపురు పుల్లా తిప్పుతూ, మాట్లాడుకుంటున్నారు. ఇద్దరికీ బట్టల్లేవు. వాళ్లను చూపిస్తూ ‘‘బిజీ విత్ లైఫ్’’ అన్నారాయన.
జోకేసినప్పుడు ఆయన అస్సలు నవ్వడు.

బీజీ విత్ లైఫ్ అనే మాటని మిత్రులందరికీ చెప్పి బాగా పాపులర్ చేశాను. ఏదైనా కథగానీ, నవలగానీ నచ్చకపోతే, సుబ్బరామయ్య ‘‘అతను బలే తమాషాగా రాస్తాడండీ’’ అనేవాడు. అంటే ఆ రచయితకి రాయడంరాదనీ, వొట్టి ఇడియట్ అనీ అర్థం. సాటి రచయితని పరోక్షంగా కూడా తిట్టేవాడు కాదు. తమాషాగా రాస్తాడనటమే దారుణమైన తిట్టు!
*** *** ****
1975 అనుకుంటాను. మధ్యాహ్నం విశాలాంధ్ర ఆఫీసుకి వచ్చారు సుబ్బరామయ్య. సబ్ ఎడిటర్ కం కార్టూనిస్టు కూడా అయినందు వల్ల మోహన్ కి మాత్రం ప్రత్యేకంగా చిన్న టేబుల్, కూర్చీ వుండేవి. ఎడిటోరియల్ సెక్షనులోనే ఓ పక్కగా. ‘‘ఏవీ రెండు కాయితాలు యిలా పడేయండి’’ అని మోహన్ని అడిగారు.

అక్కడే కూర్చుని రాయడం మొదలు పెట్టారు.పెద్దిభొట్ల అలా పబ్లిగ్గా రాయడం మేం ఎప్పుడూ చూడలేదు. అరగంట గడిచాక ‘‘టీ తాగుదాం పదండి’’ అన్నారు. చుట్టుగుంట సెంటర్లో, ఎండలో, ఓ చెట్టు కింద నుంచొని టీ తాగుతున్నాం. నీడ వున్నా, అక్కడక్కడా వెల్తురు పడుతోంది. ‘‘చూడండి. వెలుతుర్నికత్తిరించి నేల మీద అతికించినట్టు లేదూ’’ అన్నారు పెద్దిభొట్ల.

తిరిగి వచ్చాక మరో అరగంటలో రాయడం ముగించారు. అప్పటికే తెప్పించిన ఓ డజను అర ఠావు తెల్లకాయితాలు నా చేతిలో పెట్టి, మీ హ్యాండ్ రైటింగ్ బావుంటుందిగా.. ఈ కథని ఫెయిర్ చెయ్యండి అన్నారు. శ్రద్ధగా, చక్కగా రాసిచ్చాను. కథకి పేరు పెట్టాలిగా, ‘దగ్ధగీతం’ అని రాయండి అన్నారు.
సాయంత్రం నాలుగు దాటింది. ‘‘మీరు నాతో రండి’’ అన్నారు. ఇద్దరం విశాలాంధ్ర ఆఫీసు బైటికి వచ్చాం. రిక్షా ఎక్కాం. పక్కనే సీతారాంపురం. అక్కడే స్వాతి’ మంత్లీ ఆఫీసు.

ఆ రోజు 31వ తేదీ. సాయంత్రం 5 గంటలకి స్వాతి కథల పోటీ ముగింపు సమయం. స్వాతి పక్క రోడ్లో
రిక్షా ఆపి, ‘‘మీరు వెళ్లి యీ కవరు యిచ్చేయండి. నేను రావడం బాగోదు’’ అన్నారు. వెళ్లగానే ఎడిటర్ బలరాం కనిపించారు. సుబ్బరామయ్య గారు ఇవ్వమన్నారు అని కవరు యిచ్చేసి వచ్చాను. కట్ చేస్తే, సాగర్ బారు, మూడు పెగ్గులు. సుబ్బరామయ్య, చిట్టచివరి నాలుగో పెగ్గు కోసం తహతహలాడేవారు. డబ్బులు సరి చూసుకుని నాలుగోదీ పుచ్చుకున్నారా… cloud 9 మీద తేలుతూ చిటికెన వేలు పట్టుకుని మాటల పూల తోటల్లో తిప్పేవాడు నన్ను.
*** *** ****
వారం రోజుల తర్వాత, పొద్దున్నే ఆరింటికి ఆయన మా యింటికొచ్చారు. మోహన్నీ, నన్నూ నిద్రలేపారు. ఇంత ఉదయాన్నే ఏమిటీ? అనుకుంటుండగా ‘‘మన కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది’’ అని ఎంతో ఆనందంగా చెప్పారు. మొదటి బహుమతి అంటే అయిదు వేల రూపాయలు. అప్పట్లో మోహన్ నెల జీతం 300 రూపాయలు మాత్రమే.
*** *** ****
మాష్టారి చాలా కథల్లాగే ‘దగ్ధగీతం’ భరించలేని ట్రాజడీ, పంకజవల్లి మంచి గాయని. పెళ్లి చేసుకున్న రవి ఆమె కచేరీల ద్వారాడబ్బు సంపాదించి, పంకజవల్లికి జబ్బు చేయగానే వొదిలి వెళ్లిపోతాడు. ఆమెని ఇష్టపడిన చిన్న నాటి మిత్రుడు, పేదవాడు సేతురామన్ పంకజవల్లిని ఆస్పత్రిలో చేరుస్తాడు. ఆమె చనిపోతుంది.

ఆస్పత్రి గోడపక్కనే బీడీ కాల్చి, కన్నీళ్లతో ఫుట్ పాత్ మీద నిద్రపోతాడు సేతురామన్. ‘‘నిద్రలో… గుంపులు గుంపులుగా పచ్చపచ్చగా కళకళలాడుతున్న గంధపు చెట్లు తగలబడిపోతున్నట్టు కల’’ అని ముగుస్తుంది కథ.
*** *** ****
మధ్య తరగతి జీవితాల్లోని బాధ, వేదన, క్షోభ, నైరాశ్యాల్ని కన్నీటి అక్షరాలుగా కాగితమ్మీద పరిచినవాడు ..పెద్దిభొట్ల సుబ్బరామయ్య. వాస్తవానికి ఆయన నిజ జీవితంలోనూ ఆనందం అనేదేమీ లేదు. పిల్లలు లేరు. భార్య పూర్తిగా మడి, నిరంతరం పూజాపునస్కారాల టైపు. ఓ పాపను పెంచుకున్నారు. చదివించి పెళ్లి చేశారు. భార్య చనిపోయింది.

‘‘నాన్నా ఒంటరివాడివై పోతావు’’ అని కూతురు, ఒప్పించి, ఓ పెద్దావిడతో మళ్లీ పెళ్లి జరిపించింది.ఆమె కూడా మడీ, పూజలూ చాదస్తం.చివరి సంవత్సరాల్లో పెద్ద మొత్తం పెన్షన్ రావడం వల్ల డబ్బుకి యిబ్బంది లేకపోయినా…ఒంటరితనం ఆయన్ని వేధించింది.రచయితలూ, కవి మిత్రులూ, సాహిత్య అకాడమీ అవార్డులూ, రావిశాస్త్రి పురస్కారంలాంటివి మాత్రమే ..ఆ గొప్ప రచయితకి మిగిలిన ఆనందాలు!

2016లో సీతారాంపురంలో ఆయనింటికెళ్లాను. చాలా కబుర్లు చెప్పారు. హిట్లర్ చివరి రోజుల్నిఎఫెక్టివ్ గా చూపించిన “DownFall” సినిమా గురించి చెప్పారు. ఆ సినిమా నేనూ చూశానని చెబితే, ఆనందించారు.
‘‘బతుకేమీ బాగాలేదు’’ అన్నారు నాతో. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గరికొచ్చారు.విశాలాంధ్ర ఆఫీసులో సాహిత్య సభ. పెద్దిభొట్లకి సన్మానం. నడవలేని సుబ్బరామయ్యగార్ని ఆ ఇద్దరూ ఎత్తుకుని తీసుకెళ్లి కార్లో కూర్చోపెట్టారు. చెయ్యి వూపుతూ ‘‘వెళ్తాను.. కలుద్దాం’’ అన్నారు.

అదే ఆఖరిసారి. 2018 మే 18 తేదీన 80వ యేట సుబ్బరామయ్య చనిపోయారు. నాకో రోజు లేటుగా తెలిసింది. మాష్టార్ని చివరిసారి చూడలేకపోయానని ఓ జర్నలిస్టు మిత్రుడికి చెప్పాను.అంత్యక్రియలేమీ లేవు. ఎన్నారై హాస్పిటల్ కి బాడీని యిచ్చారని చెప్పాడు. అక్కడ నాకో డాక్టర్ తెలుసు. మీరు రాగలిగితే చూడొచ్చు అన్నాడు.

మర్నాడు హైదరాబాదు నుంచి బయల్దేరి మంగళగిరి వెళ్లాను. పచ్చని చెట్లతో, ఎంతో పరిశుభ్రంగా వుంది విశాలమైన ఎన్నారై ఆస్పత్రి. మార్చురీలోకి వెళ్లాం. పెద్ద ఐస్ బాక్స్, ముందుకు లాగి, డోర్ ఓపెన్ చేశారు. విశాలమైన నుదురు, బట్టతల… కదిపితే, లేచి కబుర్లు చెప్పేలా వున్నాడామహానుభావుడు. నమస్కారం పెట్టుకుని వచ్చేశాను.
*** *** ****
ఓ పుస్తకం కొందామని విజయవాడ ఏలూరు రోడ్డుకి వెళ్లాను. కనీసం 60 సంవత్సరాలు ఆయన ఆ రోడ్డు మీద నడిచి ఉంటారు. మన కాలపు మహా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్యని కోల్పోయిన ఏలూరు రోడ్డు దిగాలుగా, ఒంటరిగా, తండ్రిని కోల్పోయిన బిడ్డలా అనాధగా కనిపించింది నా తడి కళ్లకి!
*** *** ****
గృహశాంతి వచనం:
45 ఏళ్ల క్రితం సినిమాలు, హీరోయిన్ల పేర్లు క్షణంలో ఇట్టే చెప్పేసిన ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ సినిమానికా’ నా భార్య నళినికి కృతజ్ఞత!
– తాడి ప్రకాష్, 97045 41559

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!