Bharadwaja Rangavajhala …………………….
కళ కు కళాకారుడికి కులం లేదు అన్నప్పటికిన్నీ….భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు.దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే ..జాషువా గబ్బిలం రాస్తే… జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని జాలాది రాసేశారు గానీ… ఎవరి వల్లకాడు వారికే ఉంది.
విశ్వనాథ్ భుజం నిమిరి పన్లో పెట్టుకుంటాడో లేదో గానీ… జాగ్రత్తగా కనిపెట్టి పై కులాల వారినే చిత్ర సీమ ఆశీర్వాదం చేస్తుంది అన్నది నిజం. కాదనలేని ప్రతిభ ఉంటే మాత్రం కాదనరు అన్నది కూడా నిజమే. అలాంటి సినిమా రంగం లోకి దళితుడుగా కాలుపెట్టి గౌరవం అందుకున్నాడు జాలాది. అంటేనే ప్రతిభావంతుడు అని అర్థం.
జాలాది పుట్టింది కృష్ణాజిల్లా దోసపాడు. తండ్రి ఇమ్మానియేలు స్వతంత్ర సమరయోధుడు. కమ్యునిస్టు, సోషలిస్టు గ్రూపులకు అండగా నిలబడేవాడు. ఆ వారసత్వమే జాలాదిలోనూ ఏదో మేరకు తన వారి గురించి ఆలోచించేలా చేసింది. కులపరమైన అణచివేతను ప్రశ్నించాలని పదే పదే చెప్పేవారాయన. పొట్టచేతపట్టుకుని వీధిన పడడం తప్ప మరే దిక్కూ చూపించని తండ్రి వారసత్వంలోనే…
మేజర్ చంద్రకాంత్ తో ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి’ అనిపించగలిగాడు. ఎస్సెస్సెల్సీ చదివి. స్వయంకృషితో నేర్చుకున్న చిత్రకళ ఆధారంగా డ్రాయింగ్ మాస్టరు ఉద్యోగం సంపాదించుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు తిరిగేశారు. గుండెల్లో సుడితిరిగే బాధలు ఆయన్ని నిలవనీయలేదు. కులపరమైన వివక్షతో పాటు…అందరు పిల్లల్లో మరీ నల్లగా ఉన్నాడనే వివక్ష జాలాది తట్టుకోలేకపోయారు.
ఈసడింపుల నుంచే మనిషిని అర్ధం చేసుకున్నాడు. కవిగా మారాడు. కుల వివక్ష మీదే కాదు…లింగ వివక్ష మీదా అద్భుతమైన పాటలు రాశారు. సినిమాల్లోకి పోవాలనే నిర్ణయం జాలాది అప్పుడెప్పుడో అరవయ్యిల్లోనే తీసుకున్నా… తొలి పాట రాయడానికి ఆరేళ్లు పట్టింది.పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పల్లెసీమ’ చిత్రంలో ‘సూరట్టుకు జారతాంది చితుక్కు చితుక్కు వానసుక్క’ అనే గీతంతో చిత్ర పరిశ్రమలో కాలు పెట్టారు.
తన జీవితంలో అత్యధిక భాగం గడిపేసిన పల్లె సొసగులను ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా సినిమా పాటల్లో ఆరబోశారు. జీవితం చేసిన గాయాలను మాన్చుకోవాలంటే గేయమే రాయాలనుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమా కోసం రాసిన ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు.’ పాట ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
సినిమాల్లోకి రాకపూర్వమే…కృష్ణాపత్రికలో కవిత్వం రాశాడు. జీవితమనే సాగర యానంలో దిక్కుతోచక బిక్కుబిక్కు మంటున్నప్పుడు జీవన తత్వాన్ని చుక్కానిగా ఆసరా అందిస్తుంది… జాలాది పాట. సరిగ్గా ఇదే చిత్ర పరిశ్రమలో జాలాదిని ప్రత్యేకంగా నిలబెట్టగలిగింది.
ఆయన తెలుగు సినిమాకు ఉపయోగపడ్డాడుగానీ సినిమా ఆయనకి పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు.తెలుగు సినిమాకు సంబంధించి జానపదాల్ని సినిమాకు అనుసంధానించిన కవులు ఇద్దరు కనిపిస్తారు. ఒకరు కొసరాజు రాఘవయ్య చౌదరి. రెండో కవి ఇంకెవరు జాలాదే.
ఎప్పుడేనా నారాయణ రెడ్డి. జాలాది పలుకుబడి తెగ నచ్చేసిన బాపుగారు తను తీసిన తూర్పు వెళ్లే రైలులో చక్కటి పాటలు రాయించుకున్నారు. కోటేరు పట్టినోడికో.. పూట కూడు దక్కదెందుకో ? నారు నీరు పోసినోడుకో.. శేరు గింజలుండవెందుకో? అని అమాయకంగా ప్రశ్నిస్తారు జాలాది.
కులమే భారత దేశం లో వర్గం అనుకుంటే? జాలాది చెప్పిన జీవితం అర్థం అవుతుంది. కొసరాజులాగానే… జాలాది కూడా పట్టణీకరణకు కాస్త దూరం. ‘చేసేదీ పట్టణ వాసం… మేసేది పల్లెల గ్రాసం.’..కాస్త విసురుగానే అనేస్తారు ఓ సినిమా పాటలో. జాలాది సినిమా ప్రవేశం చేయాలనుకున్నప్పుడు ఆయన్ని ఆదరించింది మరో దళితుడే. ఎవరో కాదు…కాకి కవిగా పాపులర్ అయిన మోదుకూరి జాన్సన్.
జాన్సనే పి.సి.రెడ్డికి జాలాదిని పరిచయం చేసింది. అలా రెడ్డిగారి ద్వారా పరిచయమైన జాలాదిలో తన పట్టణవాసంలో పాటలు రాయించుకున్నారు కృష్ణ. సమాజంలో పాతుకుపోయిన వివక్ష మీద సందు దొరికితే తన నిరసన తెలియచేసే ప్రయత్నం చేసేవారు. ఆ ప్రయత్నంలో భాగంగా వచ్చిన పాటే…
మురళీ మోహన్ వారాలబ్బాయిలో వినిపిస్తుంది.
అగ్ర వర్ణ కవులందరూ తమకు కోయిలలు…రామచిలుకలు..పావురాలు….ప్రేరణగా కవిత్వం చెప్తే… దళిత కవులు మాత్రం కాకులతోనే తమ నిరసనను రిజిష్టర్ చేయించే ప్రయత్నం చేశారు.
డ్రాయింగ్ టీచర్ ఉద్యోగంలో ఉన్న కాలంలో తను ఏ వూళ్లో పనిచేస్తే అక్కడి బడుగు బలహీన వర్గాల ప్రజల దగ్గరకు వెళ్లి వాళ్ల బాధలు తెల్సుకునేవారు. అలాగే వారి ఆచార వ్యవహారాలతో పాటు కళారూపాలను కూడా అధ్యయనం చేసేవారు.
ఇదే జాలాదికి సినిమా రచయితగా అక్కరకు వచ్చాయి. పల్లె మాండలికాల్లో పాటలు కూర్చాలంటే జాలాదే కావాలనుకోడానికి కారణమూ అదే. ‘చేతి చిటికెన వేళ్లు కలిపితే కళ్యాణమై… కాలి బొటన వేళ్లు కలిపితె నిర్యాణమై’ అంటూ వైరాగ్యభావాన్ని జానపద పద్దతిలో చెప్పగలగడం జాలాదికి మాత్రమే సాధ్యం.
దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘కుంతీపుత్రుడు’ మూవీ కోసం జాలాది రాసిన ‘గుమ్మాలు తొమ్మిది ..గుండేమో చిన్నది’ పాట వినగానే ఎక్కడో తలుపులు తెరుచుకున్నట్టు అనిపిస్తుంది.జాలాది తండ్రి ఇమ్మానుయేలుకు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉంది. టెక్నికల్ గా కాంగ్రెస్ తో కలసి నడిచినా ఇమ్మానుయేలు ప్రధానంగా కమ్యునిస్టు పార్టీ అభిమానే.
అయితే జాలాది మాత్రం వాటికి కాస్త దూరం జరిగారు. ఆయనకి దేశమన్నా…సంస్కృతన్నా కాస్త ఎక్కువే అభిమానం. కుల పరమైన అణచివేత గురించి పట్టించుకుందాం. అంతే తప్ప దేశాన్ని, సంస్కృతిని తిట్టొద్దనేవారు. దీంట్లో కొంత వాస్తవం మరికొంత సెంటిమెంటూ కల కలసి ఉన్నాయి.
తన దగ్గరకు పాట రాయమని వచ్చినోళ్లనెవర్నీ ఆయన కాదనలేదు. నిజానికి 1952 ఎన్నికల్లో జాలాదిని కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధిగా గుడివాడ, కంకిపాడు నియోజకవర్గాల్లో ఏదో ఒక దాన్నించీ పోటీ చేయమనే ప్రపోజలు కూడా వచ్చింది. ఆయనే కాదన్నారు. గుడివాడ నుంచి కామ్రేడ్ గంజి రామారావు గారు నెగ్గారు గా అప్పుడు.
అలా జాలాది టీచరు పనే బెటరనుకున్నారు. అక్కడా రాజకీయాలు ఎక్కువయ్యే సరికి 1968 లో వీరఘట్టం లో పనిచేసేప్పుడు రాజీనామా చేసేశారు. ఆయన భార్య మెడికల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తూండడంతో ఇల్లు గడవడానికి ఇబ్బంది లేకపోయింది. అలా చెలో చెన్నై అనేసి అక్కడ పాటలు రాయడం ప్రారంభించారు.
జాలాదితో కంటిన్యూగా ఎక్కువగా పాటలు రాయించుకున్న నిర్మాత మోహన్ బాబు. ఆయన తీసిన నటించిన సినిమాల్లో జాలాది పాటలు చాలానే ఉండేవి. గృహప్రవేశం సినిమాతో ప్రారంభించి.. రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, కుంతీపుత్రుడు, మేజర్ చంద్రకాంత్ తదితర చిత్రాల్లో ఆయన రాసిన పాటలు చాలా పెద్ద విజయాలనే అందుకున్నాయి.
చిత్రమేమిటంటే… పి.సి.రెడ్డి పల్లెసీమతో సినిమా కవి అయిన జాలాది…అదే పి.సి.రెడ్డి తీసిన శాంతి సందేశం చిత్రంలో తన చివరి పాట రాశారు. జాలాది తొలి గీతం సూరట్టుకు జారతాంది సిటుక్కు సిటుక్కు వాన సుక్క మహదేవన్ స్వరసారధ్యంలో సుశీల గాత్రంలో పురుడు పోసుకుంది.
పల్లె పట్టు పైరగాలి పాటలే కాదు…జీవన వేదాన్ని ఆవిష్కరించే రచనలూ చేసిన జాలాది తెలుగు సినిమా ప్రపంచంలో ప్రత్యేక ముద్ర వేసిన కవి. ఇవాళ ఎన్నో బూతుల్ని అలా వదిలేస్తున్న సెన్సారు వారు…’వగలాడికి మొగుడొస్తుంటే…వరిచేనుకు ఈడొస్తుంటే’…పాటలో వడివడిలో సుడితిరిగి అనే మాటకు అభ్యంతరం చెప్పారట. జాలాది చెన్నైలో నిలబడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో…
ఆయన ఎవరైనా పిలిస్తే వెళ్లి రాసిచ్చేశాక వెనక్కు వచ్చేసేవాడు.
కాలం నా కాలి చెప్పు… కాదంటే నా నడకే తప్పు లాంటివి బయట రాసిన జాలాదే… సినిమాల్లో మాత్రం ‘ఈ కాలం పదికాలాలు బతకాలనీ’ అని కాలానికి చిరంజీవితం ప్రసాదించాడు. రెండో ప్రపంచయుద్దం జరుగుతున్న కాలంలో జాలాది గుడివాడలో ఉన్నాడు. గుడివాడ రహదారి బంగ్లాలో బ్రిటిష్ సైనికులు ఉండేవారు.
అంత వరకు జాలాది ఆయన మిత్రుల ఆటపాటలన్నీ ఆ ఆవరణలోనే నడిచేవి. సైన్యం రావడంతో బందయ్యాయి. దీంతో మొదటిసారి యుద్దాల మీదా సైన్యాల మీదా కోపం వచ్చిందట.జారా, గోరా, జాసురా లాంటి కలం పేర్లతో జాలాది రాసిన కవిత్వం పత్రికల్లో అచ్చయ్యేది. తండ్రి మరణానంతరం అనే కాదు…1960 తర్వాత ఎందుచేతో జాలాది రాజకీయ ఉద్యమాలకు కాస్త దూరం జరిగాడు. గుడివాడలో చదువు ఉద్యోగానంతర జీవితం నడిచే రోజుల్లో ఆయనకి త్రిపురనేని మధుసూదనరావుతో స్నేహం కుదిరింది.
త్రిపురనేని మధుసూదనరావు విప్లవరచయితల సంఘం నాయకుడు. నక్సల్బరీ రాజకీయాలను తన దృక్పథంగా ప్రకటించుకున్న రచయిత. మార్క్సిస్టు తత్వశాస్త్రం మీద పట్టున్న రచయిత. టిఎమ్ఎస్ అని విప్లవ వర్గాల్లో పాపులర్ అయిన త్రిపురనేనిని టిఎమ్ఎస్ అంటే తిరుపతి మావోసేటుంగ్ అని సెటైర్లు వేసేవారు పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు.
త్రిపురనేని తో స్నేహం నడిచిందిగానీ…ఆయన రాజకీయాలకు మాత్రం జాలాది కాస్త దూరంగానే ఉండేవారు.జాలాది రాసిన పాట… పుణ్యభూమి నా దేశం..కొంచెం చిరాకు పెట్టినా సిన్మా పాపం గానే చూస్తాన్నేను…. జాలాది తెలుగు సిన్మా అభిమానులకు గుర్తుండే పేరు అన్నది వాస్తవం.