శ్రీరామచంద్రుని ఇక్ష్వాకు వంశ వృక్షం గురించిన సమాచారం సవివరంగా, విస్తృతంగా అందరికీ అందుబాటులో ఉంది. కానీ మహాభారతం విషయానికి వస్తే అంతగా ప్రచారం లేదు. ఆ వివరాలు సవివరంగా…..
సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 10
ప్రసిద్ధి చెందిన రాజ వంశాల వంశవృక్షాన్ని కూలంకషంగా వివరించిన సామర్థ్యం కేవలం మన సనాతన ధర్మానికి మాత్రమే సాధ్యం… మనకే సొంతం. ఇంతటి విపులీకరణమైన వివరణ మరెక్కడా కనిపించే అవకాశమే లేదు. పై ప్రశ్నకు సమాధానం ఏమంటే… పౌరవులు, భారతులు, కౌరవులు, పాండవులు వీరందరూ ఒకే వంశవృక్షానికి చెందినవారే.
అదెలా అంటే…
* బ్రహ్మ మానస పుత్రులు 6గురు. మరీచీ, అంగిరసుడు, అత్రీ, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. వీరిలో మరీచి కొడుకు కశ్యపుడు (కశ్యప ప్రజాపతి).
* బ్రహ్మ కుడి బొటనవ్రేలు నుండి దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవ్రేలు నుండి భూదేవీ పుట్టారు. వీరిద్దరికీ 1000మంది కుమారులు, 50మంది కుమార్తెలు పుట్టారు. ( దక్షప్రజాపతి నుండే స్త్రీ, పురుషుల సంయోగ క్రియ ఆరంభమైనదని విష్ణుపురాణంలో చెప్పబడింది.) ఈ 1000మంది కుమారులు సాంఖ్యయోగ మభ్యసించి ఇంద్రియాలకు వశపడకుండా జీవన్ముక్తులయ్యారు. అందుచేత దక్షుడు, కూతుళ్ళకు పుట్టే కొడుకులు తన కొడుకులు కావాలని ముందే ఏర్పాటు చేసుకొని ‘పుత్రీకరణం’ చేసుకున్నాడు. –> కీర్తిలక్ష్మీ, ధృతీ, మేథా, పుష్టీ, శ్రద్ధా, క్రియా, బుద్ధీ, లజ్జా, మతీ అనే 10మంది కుమార్తెలను బ్రహ్మ కుడిరొమ్ములో పుట్టిన ధర్ముడనే మనువు(ధర్మ సావర్ణి) కిచ్చాడు. –> అశ్వనీ, భరణీ, కృత్తికా, రోహిణీ, మృగశిరా, ఆరుద్రా, పునర్వసు, పుష్యమి, ఆశ్లేషా, మఖా, పూర్వఫల్గుణి, ఉత్తరఫల్గుణి, హస్తా, చిత్తా, స్వాతీ, విశాఖా, అనూరాధా, జ్వేష్టా, మూలా, పూర్వాషాఢా, ఉత్తరాషాఢా, శ్రవణా, ధనిష్టా, శతభిష, పూర్వాభద్రా, ఉత్తరాభద్రా, రేవతీ అనే 27మంది కూతుళ్ళను చంద్రుడికిచ్చాడు. –> అదితీ, దితీ, దనువు, కాలా, అనాయువూ, సింహిక, మునీ, కపిల( సురభి), వినత, క్రోధా, ప్రాధా, క్రూరా, కద్రువ అనే 13 మంది కూతుళ్ళను కశ్యప ప్రజాపతికిచ్చాడు.
* కశ్యప ప్రజాపతికి అదితి గర్భంలో ఇంద్రుడు, విష్ణువు, ఆర్యముడు, ధాతా, త్వష్టా, పూషుడు, వివస్వతుడు, సవితృడు, మిత్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు అనే 12మంది సూర్యులు (ద్వాదశాదిత్యులు) పుట్టారు.
* వీరిలో వివస్వతునికి వైవస్వత మనువు, యముడు, శని పుట్టారు.
* వీరిలో వైవస్వత మనువుకి ఇక్ష్వాకు (శ్రీరామ చంద్రుని ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు) మొదలగు 50 మంది కుమారులు, ఇళ అనే కూతురు పుట్టారు.
* ఇళకు చంద్రుడి కొడుకైన బుధుడి ద్వారా పురూరవుడు పుట్టాడు. ఇక్కడి నుంచే చంద్రవంశం ప్రారంభం.
* పురూరవునికి ఊర్వశి ద్వారా ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, అనాయువు, శతాయువు అనే 6గురు కొడుకులు.
* ఆయువుకి స్వర్భానవి ద్వారా నహుషుడు, వృద్ధశర్మ, రజీ, గయుడు, అన్వేసుడు అనే 5గురు కొడుకులు.
* నహుషునికి ప్రియంవద ద్వారా యతి, యయాతి, సంయాతి, యాయాతి, అయాతి, ధృవుడు అనే 6గురు కొడుకులు.
* రెండవ వాడైన యయాతికి శుక్రాచార్యుని కూతురు దేవయాని (దేవేంద్రుని కూతురు జయంతి గర్భంలో శుక్రాచార్యునికి కలిగిన కూతురు – బ్రహ్మాండ పురాణం) ద్వారా యదుడు, తూర్వసుడు అనే ఇద్దరు కొడుకులు.
–> యయాతికి రెండవ భార్య అయిన శర్మిష్ఠ (రాక్షసరాజు వృషపర్వుడి కూతురు) ద్వారా ద్రుహ్యువు, అనువు, పూరుడు అనే ముగ్గురు కొడుకులు.
* యయాతి చివరి కొడుకైన పూరుడు పురువంశానికి మూలం. కాబట్టి పౌరవులు. ఇతనికి కౌసల్య ద్వారా 3 అశ్వమేధ యాగాలు చేసిన జనమేజయుడు.
* జనమేజయునికి అశ్మకి ద్వారా సంయాతి.
* సంయాతికి వరాంగి ద్వారా అహంయాతి.
* అహంయాతికి భానుమతి (కృతవీర్యుడి పుత్రిక) ద్వారా సార్వభౌముడు.
* సార్వభౌముడికి సునంద (కేకయరాజు పుత్రిక) ద్వారా జయత్సేనుడు.
* జయత్సేనుడికి సుశ్రవస (విదర్భరాజు పుత్రిక) ద్వారా సురాచీనుడు.
* సురాచీనుడికి మర్యాద అనే భార్య ద్వారా అరిహుడు.
* అరిహుడికి అంగి అనే భార్య ద్వారా మహాభౌముడు.
* మహాభౌముడికి సుయజ్ఞ (ప్రసేనజిత్ పుత్రిక) ద్వారా అయుతానాయి.
* ఇతనికి కామ అను భార్య (పృథుశ్రవసుడి పుత్రిక) ద్వారా అక్రోధనుడు.
* అక్రోధనుడికి రంభ (కళింగరాజు కూతురు) ద్వారా దేవాతిథి.
* దేవాతిథికి మర్యాద అను భార్య (విదేహరాజు కూతురు) ద్వారా రుచీకుడు.
* రుచీకుడికి సుదేవ (అంగదేశాధీశుని పుత్రిక) ద్వారా రుక్షుడు.
* రుక్షుడికి జ్వాల (దక్షుడనే రాజు కుమార్తె) ద్వారా మతినారుడు.
* ఈ మతినారుడు సరస్వతి నది ఒడ్డున 12ఏళ్ళు సత్రయాగం చేశాడు. అతడిని వలచి వచ్చిన సరస్వతి ద్వారా త్రసుడు.
* త్రసుడికి కాళింది ద్వారా ఇలీనుడు.
* ఇలీనుడికి రధంతరి ద్వారా దుష్యంత మహారాజు.
* దుష్యంతుడికి శకుంతల ద్వారా భరతుడు (భరత వంశానికి మూలం కాబట్టి భారతులు).
* భరతుడికి సునంద (కేకయరాజు కూతురు) ద్వారా భుమన్యుడు.
* భుమన్యుడికి విజయ (దశార్హరాజు కూతురు) ద్వారా సహోత్రుడు.
* సహోత్రుడికి సువర్ణ (ఇక్ష్వాకు రాజు కూతురు) ద్వారా హస్తి. ఇతని పేరు మీదే హస్తినాపురం నిర్మాణం జరిగింది.
* హస్తికి యశోధర (త్రిగర్తరాజు కూతురు) ద్వారా వికంఠనుడు.
* వికంఠనుడికి వసుదేవ (దశార్హరాజు కూతురు) ద్వారా అజమీఢుడు.
* అజమీఢుడికి కైకేయీ,గాంధారీ,రుక్ష అనే ముగ్గురు భార్యల ద్వారా సంవరుణుడు మొదలగు 120మంది కుమారులు.
* సంవరణుడికి తపతి ద్వారా కురుమహారాజు. (కురు వంశానికి మూలం కాబట్టి కౌరవులు)
* కురుమహారాజుకి సుభాంగి (దశార్హరాజు కూతురు) ద్వారా విదూరధుడు.
* విదూరధుడికి సంప్రియ ద్వారా అనశ్వుడు.
* అనశ్వుడికి అమృత (మగధరాజు కూతురు) ద్వారా పరీక్షితుడు.
* పరీక్షితుడికి సుయశ ద్వారా భీమసేనుడు.
* భీమసేనుడికి కుమారి (కేకయరాజు కూతురు) ద్వారా ప్రతిశ్రవసుడు.
* ప్రతిశ్రవసుడికి ప్రతీపుడు
* ప్రతీపుడికి శిబి ద్వారా సునంద అనే కూతురు.
* సునందకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనే ముగ్గురు కొడుకులు.
* శంతనుడికి గంగాదేవి ద్వారా భీష్ముడు. –> రెండోభార్య యోజనగంథి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు.
* విచిత్రవీర్యుడికి అంబిక, అంబాలిక అను ఇద్దరు భార్యలు. –> వ్యాసమహర్షి వలన అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు.
* ధృతరాష్ట్రుడికి గాంధారి ద్వారా దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలగు 100మంది కుమారులు, దుశ్శల అను ఒక కుమార్తె.
* పాండురాజుకు కుంతి, మాద్రి అను ఇద్దరు భార్యలు. –> పాండురాజు శాపం కారణంగా అతని కోరిక మేరకు, కుంతికి యముడి ద్వారా ధర్మరాజు, వాయుదేవుడి ద్వారా భీముడు, ఇంద్రుడి ద్వారా అర్జునుడు. మాద్రికి అశ్వనీ దేవతల ద్వారా నకులుడు, సహదేవుడు. (పాండురాజు కుమారులు కాబట్టి పాండవులు)
* ధర్మరాజుకి ద్రౌపది ద్వారా ప్రతివింద్యుడు, దేవిక ద్వారా ఔధేయుడు. –> భీముడికి ద్రౌపది ద్వారా శ్రుతసోముడు, జలంధర ద్వారా సర్వగుడు, హిడింబ ద్వారా ఘటోత్కచుడు. –> అర్జునుడికి ద్రౌపది ద్వారా శ్రుతకీర్తి, సుభద్ర ద్వారా అభిమన్యుడు, ఉలూచి ద్వారా ఇలావంతుడు, చిత్రాంగద ద్వారా బభ్రువాహనుడు. –> నకులుడికి ద్రౌపది ద్వారా శతానీకుడు, రేణుమతి (చేదిరాజు కూతురు) ద్వారా నిరమిత్రుడు. –> సహదేవుడికి ద్రౌపది ద్వారా శ్రుతసేనుడు, విజయ ద్వారా సహోమిత్రుడు.
* ఈ 13మంది పాండవ సంతానంలో అభిమన్యుడు వంశకర్త అయ్యాడు. అభిమన్యుడికి ఉత్తర ద్వారా పరీక్షిత్తు.
* పరీక్షిత్తుకి మాద్రవతి ద్వారా జనమేజయుడు.
* జనమేజయుడికి వవుష్ఠ ద్వారా శతానీకుడు, శంకుడు, కర్ణుడు.
* శతానీకుడి కొడుకైన అశ్వమేధదత్తుతో ఈ వంశవృక్షం ఆఖరు.
* మూలం – మూడో అశ్వాసం, ఆదిపర్వం, మహాభారతము. **
————- పులి. ఓబుల్ రెడ్డి
ఇది కూడా చదవండి >>>>>>>>>>>>>>>>>విశ్వం వయస్సు ఎంత?