డా. వంగల రామకృష్ణ ——————————
వేమన పద్యం వేపకాయ అయిపోయింది. పోతన పద్యం మటుమాయమైపోయింది. దాశరథి, సుమతీ శతకాలు బరువై “పోయాయి”. సుభాషితాలు శుష్కభాషితాలై పిల్లల నోటికి అందకుండా పోయాయి. నీతి శతకాలు నిలువుగోతిలో మూలుగుతున్నాయి. పెద్దబాలశిక్ష పెద్ద శిక్షగా మారిపోయింది.
రామాయణం ,భాగవతం, పంచతంత్రం వల్లించే నోళ్ళకు పవర్ రేంజర్స్,యూ ట్యూబ్ గేమ్స్, సెల్ ఫోన్స్ రుచిస్తున్నాయి. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష అక్షరాలు, పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకుంటోంది. ఎవరికీ పట్టని బిడ్డలా వెక్కివెక్కి ఏడుస్తోంది.
ఏవి తల్లీ నీ పద సౌందర్యాలు? ఏవి తవ్లి అచ్చతెలుగు మాధుర్యాలు? ఇవాళ తెలుగు భాషా దినోత్సవం. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు, గురజాడ అప్పారావుకు సహాధ్యాయి అయిన గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు.
పిడుగులాంటి గిడుగు పోయాక పిడుగుపాటుకు లోనై అమృతంలాంటి తెలుగు మృత ప్రాయమవుతోంది. ఇప్పటికే నోటికీ చేతికీ సంబంధం తెగిపోయింది. మాట్లాడడం వచ్చినవాళ్ళలో అత్యధికులు రాయలేక, చదవలేక చేతులెత్తేస్తున్నారు. అమ్మభాషలో మాట్లోడడమే అవమాన మనుకునే అమ్మానాన్నలు గర్భవిచ్ఛితి (అబార్షన్ ) చేసి తెలుగుకు పుట్టగతులు లేకుండా చేస్తున్నారు.
పాలకులు పాపాత్ములై తెలుగు భాషకు నిజంగానే దినం పెడుతున్నారు. తెలుగు కోసం వెంపర్లాడే వాళ్ళు వెర్రివాళ్ళవుతున్నారు. ఇదే ఒరవడి కొనసాగితే తెలుగు నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉందని భాషావేత్తలు భావిస్తున్నారు. ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు అంటున్నారు.
మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ.. ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప విషయమే. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక పద్యాల గురించి అసలు తెలియక పోవచ్చు కూడా .. ఎవరయినా ఇవి మన పద్యాలు అని చెబితే తప్ప గ్రహించరు.. గ్రహించినా ఆ పద్యాలూ అర్థం కాకపోవచ్చు.మళ్ళీ ఎవరో విపులంగా విడమరిచి చెప్పాలి. ఈ పరిస్థితులనుంచి బయటపడాలంటే మన భాషను మనమే పరిరక్షించుకోవాలి