Most famous food …………………………
పాలకొల్లు దిబ్బరొట్టె రుచే వేరు. చుట్టుపక్కల జిల్లాలలో కూడా ఈ దిబ్బరొట్టె చాలా ఫేమస్. పాలకొల్లు వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ దిబ్బరొట్టె రుచి చూసే వెళతారు. పాలకొల్లు టౌన్ లోని మారుతి థియేటర్ పక్కన ఉన్న మారుతీ క్యాంటీన్‌లో కాల్చే దిబ్బరొట్టె కోసం జనాలు క్యూలో నిలబడతారు అంటే అతిశయోక్తి కాదు.
చింతామణి చట్నీ (శనగ పిండిని ఉడికించి.. తాలింపు వేసిన చట్నీ.. దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు )తో వేడి వేడి ఆ రొట్టెను తింటే … అబ్బో టేస్ట్ అదిరిపోద్ది. ఈ దిబ్బరొట్టెలు సహజంగా బొగ్గుల పొయ్యిపైనే కాలుస్తారు. పొయ్యిపై పాత కాలం నాటి మూకుడు పెట్టి అందులో కొంచెం నూనె వేస్తారు. ఆ తరువాత రవ్వ కలిపిన మినప పిండిని వేసి దానిపై మూత పెడతారు. ఆ మూతపై మరికొన్ని నిప్పులు వేసి రొట్టెల్ని కాలుస్తారు.
ఒక్కో రొట్టె కాలడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత ప్లేట్ లో వేసి ఇస్తారు. ఉదయం 6 గంటలు మొదలు రాత్రి 9 గంటల వరకూ 20 పొయ్యిలపై రొట్టెలను కాలుస్తూనే ఉంటారు. రొట్టె తినాలంటే కనీసం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. సెల్ఫ్ సర్వీస్ మూలానా ఈ క్యాంటీన్‌కు వచ్చే ప్రముఖులు, సామాన్యులు సైతం కార్లలోను, రోడ్డుపైనే నిలబడి తినేస్తుంటారు.
కొందరు పార్సెల్ తీసుకువెళుతుంటారు. పాలకొల్లులో ఇపుడు చాలా చోట్ల దిబ్బరొట్టె తయారు చేసే హోటళ్లు ఉన్నాయి . కానీ మారుతీ క్యాంటీన్‌లో వేసే దిబ్బరొట్టె ఫేమస్. అడ్రెస్ అడిగి మరి అక్కడికి వెళ్లి తింటుంటారు. ఈ థియేటర్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ది. గతంలో పాలకొల్లులో ఏటా లలిత కళాంజలి నాటకోత్సవాలు నిర్వహించేవారు.
ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున సినిమా నటులు హాజరయ్యేవారు. వారంతా ఇక్కడి దిబ్బరొట్టెను తెప్పించుకుని మరీ తినేవారట. మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ధవళ సత్యం, రవిరాజా పినిశెట్టి,మరెంతో మంది సినీ ప్రరిశ్రమకు చెందిన వారు ఈ దిబ్బరొట్టె రుచి చూసిన వారే అని చెబుతుంటారు. ఇక్కడ రోజూ 500 రొట్టెలు అమ్ముతుంటారు. పాలకొల్లు వెళ్ళినపుడు మీరు కూడా దిబ్బరొట్టె టేస్ట్ చూడండి.