Bharadwaja Rangavajhala ………………………… voice of the nation
బాలీవుడ్ సింగర్స్ లో మహమ్మద్ రఫీ అంటే తెలుగువారికి ప్రత్యేక అభిమానం. ఎందుకంటే ఆయన తెలుగులో దాదాపు పాతిక పైగా పాటలు పాడారు. అంతే కాదు … సింగిల్ కార్డ్ మేల్ సింగర్ గా పాడారు కూడా. అయితే … ఆయన గురించి తెలుగు సినీ పరిశ్రమ ప్రత్యేకంగా చెప్పుకునే సంగతి ఒకటి ఉంది.
చిత్తూరు నాగయ్య గారు భక్త రామదాసు తీయదల్చుకున్నప్పుడు అందులో కబీర్ పాడే పాటలకు ఒరిజినల్ కబీర్ భజనలనే వాడుకోవాలనుకున్నారు. మరి అవి తెలుగులో ఉండవు కదా … వాటిని ఎవరు పాడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు రఫీ అనే అనుకున్నారు.
ఆయనకు కబురు వెళ్లింది. ఆయన వచ్చారు. పాడారు..ఆయనతో సంగీత దర్శకుడు అశ్వత్థామ పాడించారు. రఫీకి రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితిలో నాగయ్య గారు లేరు. ఆయన దగ్గర పారితోషికం ప్రస్తావన తీసుకురాకుండా నాగయ్యగారికి నమస్కరించి … శాలువా కప్పి ఆయన చేసిన సత్కారమే చాలనుకుని వెళ్లిపోయారు. అంతటి సుమనస్కుడుఆయన.
భారతదేశంలో అత్యధిక ప్రాంతీయ భాషల్లో పాటలు పాడిన బాలీవుడ్ గాయకుడు రఫీనే అనుకుంటా. అస్సామీ, కొంకణీ, భోజ్ పురి, ఒడియా, పంజాబీ, మరాఠీ,సింధీ, కన్నడ,గుజరాతీ, ఉర్దూ, తెలుగు భాషలతో పాటు మరో రెండు మూడు భాషల్లో కూడా పాడారు. అందుకే ఆయన్ని వాయిస్ ఆఫ్ ది నేషన్ అన్నారు.
భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో పాడడమే కాదు. ఇంగ్లీషు, ఫ్రెంచ్, డచ్ లాంటి భాషల్లో కూడా పాడారు రఫీ. ఆయన హిందీలో పాడిన పాటల్లో నాకు బాగా ఇష్టమైన గీతం … గైడ్ లో దేవానంద్ వహీదా నటించిన తేరే మేరే సప్నే. మరెన్నో మధురమైన పాటలు ఆయన పాడారు.
Tharjani ……………….
ఇక తెలుగు సినిమాల విషయానికొస్తే .. ’ఆరాధన’లో ని ‘నా మది నిన్ను పిలచింది గానమై, ‘భలే తమ్ముడు’ సినిమాలో ‘ఎంతవారుగానీ, వేదాంతులైన గానీ… ఓర చూపు సోకగానె తేలిపోదురోయ్.. కైపులో…’ పాట ‘జీవిత చక్రం’ సినిమాలో ‘కంటి చూపు చెబుతోంది… కొంటె నవ్వు చెబుతోంది…’ అక్బర్ సలీమ్ అనార్కలి లో ‘తారలెంతగా’ వంటి పాటలను తెలుగు వారు ఎప్పటికి మరువలేరు.
తన విలక్షణ గాత్రంతో రఫీ పాటలకు ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన మరపురాని గాయకుడు. ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదు తో సత్కరించింది. మొదటి స్వాతంత్య్ర ఉత్సవాల్లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆయన రజత పతకాన్ని అందుకున్నారు. విషాదగీతాలైనా, ప్రేమ గీతాలైనా రఫీ గొంతులో కొత్త సోయగాలు అద్దుకుని ప్రేక్షకులను అలరించేవి.